
70 వ ఏడాదిలోకి ప్రవేశిస్తున్న నాగార్జున సాగర్ ప్రాజెక్ట్
ప్రజా సౌభాగ్య మందిరానికి శంకుస్థాపన చేస్తున్నానని చెప్పిన నెహ్రూ
విజయపురిసౌత్: నాటి భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి రేపటితో 69 ఏళ్లు నిండుతాయి. ఆనాడు నెహ్రూ కన్న కలలను నిజం చేస్తూ కోట్లాది మంది ప్రజలకు జీవనాధారంగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అన్నపూర్ణగా ఆధునిక దేవాలయంగా నాగార్జునసాగర్ ప్రాజెక్టు విరాజిల్లుతోంది. 1955 డిసెంబర్ 10న ఆనాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఆయన మాట్లాడుతూ ఈనాడు నాగార్జున సాగరానికి నేనిక్కడ జరిపే శంకుస్థాపనను పవిత్రకార్యంగా పరిగణిస్తున్నాను. ఇది భారత ప్రజాసౌభాగ్య మందిరానికి జరుగుతున్న శంకుస్థాపన. ఈనాడు మనం ఆసేతుహిమాచల పర్యంతం నిర్మించుకుంటున్న నవదేవాలయాలకు ఇది చిహ్నం’ అని అన్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో పూర్తిస్థాయిలో మానవశక్తితో నిర్మితమైన ప్రాజెక్టు నాగార్జునసాగర్.
సాగునీటి కోసం కుడి, ఎడమ కాలువలను నిర్మించారు. కుడికాలువను జవహర్ కాలువగా, ఎడమకాలువను లాల్‌బహదూర్ కాలువగా పిలుస్తారు. జవహర్ కాలువ సాగర్ రిజర్వాయర్ నుంచి ఆనకట్టకు కుడివైపు నుంచి ప్రారంభమవుతుంది. ఈ కాలువ పనులను అప్పటి ఆంధ్రరాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి 1956 అక్టోబర్ 10న ప్రారంభించారు. దక్షిణ విజయపురి (రైట్‌బ్యాంకు) వద్ద ఈ కాలువ సొరంగ మార్గం ద్వారా ప్రారంభమై 392 కిలో మీటర్లు ప్రయాణిస్తుంది.

ఈ కాలువ ద్వారా గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 11లక్షల 74వేల 874 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. 132 టీఎంసీల నీటిని కేటాయించారు. రిజర్వాయర్ ఎడమవైపు నుంచి ప్రారంభమయ్యే కాలువకే లాల్‌బహదూర్ కెనాల్ అని పేరు. ఈ కాలువ పొట్టిచెలమ నుంచి చలకుర్తి వరకు సొరంగ మార్గం ద్వారా ప్రయాణిస్తుంది. ఈ కాలువ నిర్మాణాన్ని ఆనాటి గవర్నర్ భీమ్‌సేన్ సచార్ 1959లో ప్రారంభించారు. ఈ కాలువ పొడవు 349కిలోమీటర్లు.
ఈ కాలువ కింద 10 లక్షల 37వేల 796 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించారు. 132 టీఎంసీల నీటిని కేటాయించారు. రిజర్వాయర్ నీటిమట్టం 489 అడుగుల పైన ఉన్నప్పుడు కుడికాలువలాగే ఈ కాలువకు కూడా నీటిని విడుదల చేయవచ్చు. సాగర్ ప్రాజెక్టు ఒకసారి నిండితే ప్రభుత్వానికి 20 వేల కోట్ల రూపాయలకు పైచిలుకు ఆదాయం వస్తుందని అంచనా. 1967 ఆగస్టు 4న నాటి ప్రధాని ఇందిరాగాంధీ కుడి, ఎడమ కాలువలకు నీటిని వదిలారు.
సాగర్ జలాశయం విస్తీర్ణం,110 చదరపు మైళ్లు
గరిష్ట నీటిమట్టం 590 అడుగులు
డెడ్ స్టోరేజి లెవల్ 490 అడుగులు
నీటి నిల్వ 408.24 టీఎంసీలు (ప్రస్తుతం పూడిక నిండటంతో 312.0. టీఎంసీలు)
డెడ్‌స్టోరేజినీరు 179.16 టీఎంసీలు (ప్రస్తుతం పూడిక నిండటంతో 168 టీఎంసీలు)
నీటివిడుదలకు కనీస నీటిమట్టం 510 అడుగులు