
అంతర్జాతీయ మార్కెట్‌లో కోకో గింజల ధర కిలో రూ.770 పైమాటే
వర్షాకాలం పంట పేరిట రూ.200–250కి మించి ధర ఇవ్వని వ్యాపారులు
కొత్త పంటకు సైతం కిలోకు రూ.400–450 మాత్రమే చెల్లింపు
గతేడాది ఇదే సమయంలో కిలో రూ.1,050 పలికిన ధర
సిండికేట్‌గా ఏర్పడి రైతుల శ్రమను దోచేస్తున్న కంపెనీలు
పట్టనట్టు వ్యవహరిస్తున్న కూటమి సర్కారు
సాక్షి, అమరావతి: చాక్లెట్ పంట అన్నదాతకు చేదును పంచుతోంది. కంపెనీలు సిండికేట్‌గా మారి కోకో గింజల ధరల్ని అమాతం తగ్గించేయడంతో రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. కష్టకాలంలో ఆదుకోవాల్సిన ప్రభుత్వం కంపెనీలకు కొమ్ముకాస్తూ తమని పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. రాష్ట్రంలో 1.12 లక్షల ఎకరాల్లో కోకో తోటలు ఉండగా.. ఎకరాకు 3–4 క్వింటాళ్ల చొప్పున ఏటా 12 వేల టన్నుల గింజల దిగుబడి వస్తోంది. ఇందులో 80 శాతం గింజల్ని క్యాడ్బరీ, మిగిలింది నెస్లే, క్యాంప్కో, లోటస్ (Lotus) తదితర కంపెనీలు సేకరిస్తున్నాయి.
కోకో పంటకు నవంబర్ నుంచి జూన్ వరకు సీజన్. జూలై నుంచి అక్టోబర్ వరకు అన్ సీజన్. దిగుబడిలో రెండొంతులు సీజన్‌లోనూ, ఒక వంతు అన్ సీజన్‌లోనూ చేతికొస్తుంది. గతంలో సీజన్, అన్ సీజన్ అనే తేడా లేకుండా గింజలన్నింటినీ ఒకే రీతిలో అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా కంపెనీలు కొనుగోలు చేసేవి. ఇప్పుడా పరిస్థితి లేకపోవడంతో రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు.
గతేడాది కిలో గింజల ధర రూ.1,050
గతేడాది ఇదే సమయంలో కిలో కోకో గింజలకు రూ.1,050 ధర లభించింది. ఈ ఏడాది కంపెనీలు సిండికేట్‌గా మారి అనూహ్యంగా ధరలు తగ్గించేయడంతో రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో కిలో గింజల ధర రూ.770కి పైగా పలుకుతుండగా, కంపెనీలు మాత్రం నాణ్యమైన (ప్రీమియం) గింజలకు సైతం రూ.400–450 మధ్య చెల్లిస్తున్నాయి.
అన్‌సీజన్ గింజల్ని కొనేందుకు కంపెనీలు ఆసక్తి చూపడం లేదు. ఇదే అదునుగా ప్రైవేటు వ్యాపారులు కిలో రూ.200–250 మధ్య కొనుగోలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. ప్రస్తుతం కోతకు వచ్చిన సీజన్ పంటకు సైతం కంపెనీలు గిట్టుబాటు ధర చెల్లించేందుకు ముందుకు రావడం లేదు. కోతకు సిద్ధంగా ఉన్న పంట కాకుండా రైతుల వద్ద దాదాపు 1,500 టన్నులకు పైగా కోకో గింజల నిల్వలున్నాయి.
దిగుమతుల వల్లే..
ఈ ఏడాది చాక్లెట్ కంపెనీలు విదేశాల నుంచి కోకో గింజలు, పొడి, బటర్ దిగుమతి చేసుకోవడంతో ఇక్కడి రైతులు పండించిన పంటకు డిమాండ్ లేకుండాపోయింది. కోకో రైతుల్లో అత్యధికులు కౌలుదారులే. ఎకరాకు రూ.1.10 లక్షల నుంచి రూ.1.50 లక్షల వరకు కౌలు చెల్లిస్తుంటారు. తెగుళ్లు, చీడపీడలు, యాజమాన్య పనుల కోసం ఏటా రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు పెట్టుబడి పెడుతుంటారు. ఆశించిన స్థాయిలో దిగుబడులు రాక సతమతమవుతున్న రైతులు కంపెనీల మాయాజాలం వల్ల తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది.
సీజన్, అన్‌సీజన్‌తో సంబంధం లేకుండా అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా కోకో గింజల్ని కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా.. ప్రభుత్వం జోక్యం చేసుకుని కంపెనీల మాయాజాలాన్ని అడ్డుకోవాలని ఏపీ కోకో రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ధరల స్థిరీకరణ నిధి పథకాన్ని కోకో రైతులకూ వర్తింప చేయాలని కోరారు. కోకో రైతులను ఆదుకోకపోతే ఉద్యమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ప్రభుత్వం స్పందించడం లేదు
ఎకరాకు రూ.1.40 లక్షల చొప్పున చెల్లించేలా 60 ఎకరాలను కౌలుకు తీసుకుని కోకో సాగు చేస్తున్నా. ఎకరాకు రూ.40 వేల వరకు పెట్టుబడులు అవుతున్నాయి. అన్‌సీజన్‌కు సంబంధించి 7 టన్నుల గింజలు ఉండగా.. కిలో రూ.330 చొప్పున 2.50 టన్నులు అమ్మాను. మిగిలిన 4.50 టన్నులు అమ్ముదామంటే కొనేవారు లేదు. సీజన్‌కు సంబంధించి 7 టన్నుల గింజల్ని కిలో రూ.550 చొప్పున కొన్నారు.
ఇంకా 4 టన్నులు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు కిలో రూ.450కు మించి కొనలేమని చెబుతున్నారు. మరో రెండు టన్నుల వరకు పంట రావాల్సి ఉంది. ఈ ఏడాది పెట్టుబడులు కూడా వచ్చేలా కనిపించడం లేదు. లీజుకు చెల్లించాల్సిన మొత్తం నష్టపోయినట్టే. పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. ఏమాత్రం స్పందించలేదు.
రూ.45 లక్షలకు పైగా నష్టపోతున్నా
ఈ రైతు పేరు అవర్ని అనిల్‌కుమార్. ఏలూరు జిల్లా పెదవేగి మండలం రాయన్నపాలేనికి చెందిన ఈయన 150 ఎకరాలను కౌలుకు తీసుకుని.. ఎకరాకు రూ.1.40 లక్షల చొప్పున కౌలు చెల్లిస్తూ కోకో సాగు చేస్తున్నారు. ఎకరాకు రూ.40 వేల చొప్పున పెట్టుబడి అవుతోంది. ఎకరాకు 3.50 క్వింటాళ్ల చొప్పున కోకో గింజల దిగుబడి వచ్చింది. అన్ సీజన్(వర్షాకాలం)లో తీసిన పంటను కొనేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. బతిమాలుకుంటే కిలోకు రూ.200–250 మించి ధర ఇచ్చేది లేదంటున్నారు.
చదవండి: భోజనం లేదు.. పుస్తకాల్లేవు!
గతేడాది ఇదే సమయంలో సీజన్, అన్ సీజన్‌తో సంబంధం లేకుండా కిలో గింజలకు రూ.1,050 చొప్పున ధర దక్కింది. ఈ ఏడాది అమాంతం ధర తగ్గిపోవడంతో ఎకరాకు రూ.30 వేల చొప్పున మొత్తంగా తాను రూ.45 లక్షల మేర నష్టపోతున్నట్టు రైతు అనిల్‌కుమార్ ఘొల్లుమంటున్నారు. కోకో గింజల్ని కొనుగోలు చేసే కంపెనీలు సిండికేట్‌గా మారి ధరల్ని దారుణంగా తగ్గించేయడంతో కోకో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన చెందుతున్నారు.