
నిర్వీర్యమవుతున్న రైతు సేవా కేంద్రాలు.. మూగబోయిన ఫైబర్ ఇంటర్నెట్ సేవలు
స్టేషనరీ, రోజువారీ నిర్వహణ ఖర్చులకు పైసలు కరువు
క్రమబద్ధీకరణ పేరుతో సిబ్బందిని కుదిస్తున్న కూటమి సర్కార్
సాక్షి, అమరావతి: విత్తు నుంచి విక్రయం వరకు రైతులకు అండగా నిలిచేందుకు ఏర్పాటు చేసిన రైతు సేవా కేంద్రాల (పూర్వపు ఆర్‌బీకేలు) స్ఫూర్తిని దెబ్బతీసేలా కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. క్రమబద్ధీకరణ పేరిట రైతు సేవా కేంద్రాలతో (ఆర్‌ఎస్‌కే) పాటు సిబ్బందిని కూడా కుదించేస్తున్న ప్రభుత్వం, వాటి నిర్వహణను సైతం పూర్తిగా గాలికొదిలేసింది. పీ4, కుల గణన, పింఛన్ల పంపిణీ వంటి తమకు సంబంధం లేని అడ్డమైన సర్వేల కారణంగా తీవ్రమైన పని ఒత్తిడితో సిబ్బంది పనిచేయాల్సి వస్తోంది.
పక్కదారి పడుతున్న నిధులు..
గడచిన 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఆర్‌ఎస్‌కేల నిర్వహణకు రూ.35.05 కోట్లు కేటాయించారు. ఇందులో రూ.19 కోట్లు విడుదల చేశారు. దీనిలో రూ.10.52 కోట్లు అద్దెలకే పోవడం గమనార్హం. సిబ్బందికి చివరికి కష్టమే మిగులుతోంది. మంజూరు చేసిన నిధులు గతంలో నేరుగా ప్రతి ఆర్‌ఎస్‌కే అకౌంట్‌లో పడేవి. ఇప్పుడు సబ్ డివిజన్ అధికారుల ఖాతాకు జమ చేస్తున్నారు. ఈ నిధులు వారు పక్కదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
విద్యుత్, ఇంటర్నెట్ బిల్లులతో పాటు తమకు రావాల్సిన బకాయిల కోసం అడిగితే ‘వస్తాయిలే..ఇస్తాం లే..’ అంటూ సిబ్బందిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. గట్టిగా ఒత్తిడి తీసుకొస్తే అడ్డమైన పనులు అప్పగిస్తూ పని ఒత్తిడి పెంచుతూ వేధింపులకు గురిచేస్తున్నారని సిబ్బంది వాపోతున్నారు. మరొక వైపు పాడిపంటలు మ్యాగజైన్ కోసం కూడా లక్ష్యాలను నిర్ధేశిస్తుండడంతో వాటి చందాల కోసం కూడా తమ జేబులకే చిల్లుపడుతోందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నాడు పారదర్శకం
సచివాలయాలకు అనుబంధంగా గ్రామ స్థాయిలో 10,778 రైతు సేవా కేంద్రాల్లో 15,667 మంది సిబ్బంది సేవలు అందిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో అద్దెలతో పాటు ఇంటర్నెట్, విద్యుత్ బిల్లులకు క్రమం తప్పకుండా నిధులు విడుదల చేసేవారు. గతేడాది ఏప్రిల్ నాటికి అద్దెల రూపంలో రూ.33 కోట్లు, స్టేషనరీ కోసం రూ.3 కోట్లు, విద్యుత్ బిల్లుల కోసం రూ.12 కోట్లు చెల్లించారు.
అంతేకాదు విద్యుత్ బిల్లులకు అవసరమైన బడ్జెట్‌ను విద్యుత్ శాఖకు కేటాయించేలా ఉత్తర్వులిచ్చారు. హై స్పీడ్ ఇంటర్నెట్ నెట్‌వర్క్ సదుపాయాన్ని సమకూర్చేందుకు రూ.23 కోట్లు ఖర్చు చేసారు. మరొక వైపు మట్టినమూనాలు, ఈ పంట నమోదు, ధాన్యం కొనుగోలు, ఎరువుల అమ్మకాలు, పంట కోత ప్రయోగాలు ఇలా ప్రతీ పనికి నిర్ధేశించిన ప్రోత్సాహకాలను ఎప్పటికప్పుడు నేరుగా వారి ఖాతాలకే జమ చేసేవారు.
నేడు లోపభూయిష్టం..
రైతు భరోసా కేంద్రాలు– ఆర్‌బీకేల పేరును రైతు సేవా కేంద్రాలుగా (ఆర్‌ఎస్‌కే) మార్చేందుకు చూపిన ఉత్సాహం వాటి నిర్వహణపై కూటమి ప్రభుత్వం చూపడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని ముఖ్యాంశాలు చూస్తే..
» ప్రతిరోజూ ఆర్‌ఎస్‌కేలను శుభ్రం చేసేందుకు, నీటి వసతి కల్పించేందుకు స్టేషనరీకి, ఇంటర్నెట్ చార్జీలు, మైనర్ రిపేర్లు తదితర ఖర్చుల కోసం ప్రతీ నెలా రూ.2,000 చెల్లించేవారు.
»ఇవి కాకుండా వ్యక్తిగతంగా సిబ్బందికి ఒక్కో మట్టి నమూనాకు రూ.50, టన్ను యూరియాకు రూ.50, డీఏపీ, ఇతర ఎరువులకు రూ. 100 చొప్పున చెల్లించేవారు.
» దీనితోపాటు ఒక్కొక్క పంట కోత ప్రయోగానికి రూ.150 చొప్పున ఇచ్చేవారు.
» ఆర్‌ఎస్‌కే పరిధిలో ప్రతీ సీజన్‌లో నాలుగు పంటకోత ప్రయోగాలు జరుగుతుంటాయి. పొలంబడుల నిర్వహణకు రూ.20,514 ఖర్చు అయ్యేది. ధాన్యం కొనుగోలు నిర్వహణ
ఖర్చు నిమిత్తం ఒక్కొక్క క్లస్టర్‌కు సుమారు రూ.5 వేలకు పైగా చెల్లించేవారు.
» కానీ గడిచిన సీజన్‌కు సంబంధించి ఏ ఉద్యోగికి పైసా కూడా జమ కాలేదు. కేంద్ర నిధులతో చేపట్టే సామూహిక ఎలుకల నివారణకు ఉపయోగించే గ్లౌవ్స్, కత్తెర, ప్యాకింగ్ మెటీరియల్‌కే కాదు చివరికి బ్యానర్ తయారీకి కూడా ఒక్క రూపాయి ఇవ్వలేదంటున్నారు.
»కేవలం ఆర్‌ఎస్‌కేల నిర్వహణ కోసం ప్రతీ నెలా సగటున రూ.2,500 నుంచి రూ.3వేల వరకు తమ జీతాల నుంచి ఖర్చు చేయాల్సి వస్తోందని సిబ్బంది వాపోతున్నారు.
» ఇక ఆర్‌ఎస్‌కేల్లో ఎక్కడా ఇంటర్నెట్ సేవలు లేనే లేవు. ఏపీ ఫైబర్ నెట్ కనెక్షన్లు అలంకార ప్రాయంగా మారిపోయాయి.
» కరెంట్ బిల్లుల చెల్లింపులు పూర్తిగా మరిచి పోయారు. 25–30 శాతం ఆర్‌ఎస్‌కేలు అంధకారంలో ఉన్నాయని సమాచారం. విద్యుత్ బకాయిల బిల్లులు తడిసి మోపెడవుతున్నాయి.