
సీఎం ఇలాకాలోని ద్రవిడియన్ యూనివర్సిటీలో అడ్డగోలు దందా
నిబంధనలకు విరుద్ధంగా అడహక్ నియామకాలు
ఉన్నత విద్యా మండలి ఆదేశాలను బేఖాతరు చేస్తున్న ఇన్‌చార్జ్ పాలకులు
ఏడాది కాలంగా అవుట్ సోర్సింగ్ సిబ్బందికి జీతాలు ఇవ్వలేని దుస్థితి
సాక్షి, అమరావతి: ద్రవిడియన్ వర్సిటీలో అడ్డగోలు దందా రాజ్యమేలుతోంది. అకడమిక్ సంబంధిత వ్యవహారాల కంటే అవినీతి కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది. నిబంధనలకు విరుద్ధంగా పీహెచ్‌డీలు జారీ చేయడం దగ్గర నుంచి దొడ్డిదారిన అడహక్ నియామకాలకు ఒడిగట్టడం వరకూ పలు అంశాలు వర్సిటీ ప్రతిష్టను దిగజార్చుతున్నాయి. వాస్తవానికి బోధనేతర వ్యక్తులకు పాలన పగ్గాలు అప్పగించడంతోనే వర్సిటీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది.
దీనికి తోడు సాక్షాత్తూ సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇలాకాలో వర్సిటీ ఉండడంతో, ‘తాము ఏం చేసినా అడిగేవారు లేరని’ కొందరు రాజకీయ పలుకుబడి కలిగినవారు భావిస్తున్నారు. దీనితో అందినకాడికి దోచుకోవడం..పంచుకోవడం సర్వసాధారణమైపోయింది. వర్సిటీ ఆస్తులను, ఆదాయాన్ని అప్పనంగా మింగేస్తుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోంది.
అడహక్ పేరుతో అడ్డుగోలు వ్యవహారం
ద్రవిడియన్ వర్సిటీలో అకడమిక్ పాలన పూర్తిగా గాడితప్పింది. తాజాగా ఒక అకడమిక్ కన్సల్టెంట్‌కు ఏకంగా ‘అడహక్ నియామకం ద్వారా’ భారీ పే స్కేల్‌ను ఇచ్చేందుకు చకచకా పావులు కదపడం వర్సిటీలో పెనుదుమారం రేపింది. వాస్తవానికి వర్సిటీలో వివిధ విభాగాల్లో 30 మందికిపైగా అకడమిక్ కన్సల్టెంట్లు పని చేస్తున్నట్లు సమాచారం. కానీ, వర్సిటీ పాలకులు మాత్రం ‘ఆ ఒక్క వ్యక్తి’పై మాత్రమే ప్రత్యేక ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం. గతంలో వర్సిటీలో ఎంఎస్‌సీ గణిత విభాగంలో అకడమిక్ కన్సల్టెంట్‌గా సదరు ఉద్యోగి చేరారు.
ఆ తర్వాత ప్రవేశాలు లేకపోవడంతో ఈ విభాగాన్ని మూసివేశారు. దీంతో అప్పటి అకడమిక్ కన్సల్టెంట్‌లు వర్సిటీ నుంచి బయటకు వెళ్లిపోయారు. కానీ, ఈ ఉద్యోగి మాత్రం తన పలుకుబడితో అక్కడే డిగ్రీ విభాగంలోని బీఎస్సీ (ఎంఎస్‌సీఎస్)లోకి మారిపోయారు. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వర్సిటీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడంతో అడహక్ నియామకం పొందేందుకు బాటలు వేసుకున్నారు. నేడో, రేపో నియామక పత్రం కూడా రానున్నట్టు సమాచారం. దీంతో మిగిలిన విభాగాల అకడమిక్ కన్సల్టెంట్లు అగ్గిమీద గుగ్గిళం అవుతున్నట్టు తెలుస్తోంది.
రాజకీయ ఉపాధి కేంద్రం..
కుప్పం నియోజకవర్గంలోని టీడీపీకి చెందిన ఒక మహిళా నాయకురాలు కుమారుడికి రాజకీయ ఉపాధిలో భాగంగా వర్సిటీలో ఉద్యోగం కట్టబెట్టేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీనిని కూడా నిబంధనలు పాటించకుండానే అడహక్ నియామకం కింద చేపట్టి, ఇంజనీరింగ్ విభాగంలో ఏఈ పోస్టులో కూర్చో బెట్టేందుకు మార్గం సుగుమం చేశారు. సాక్షాత్తు ముఖ్యనేత కుమారుడు, రాష్ట్ర మంత్రి ఆదేశాలతోనే ఇదంతా జరుగుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ఇంజనీరింగ్ విభాగంలో సిబ్బందికే పని లేనప్పుడు కొత్తవారిని తీసుకొచ్చి వర్సిటీపై ఆరి్థక భారం పెంచడం తప్ప ఒరిగేది ఏమీలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
త్వరలో వంద మందికిపైగా ఉద్వాసన!
వాస్తవానికి వర్సిటీ ఖజానాలో ఎటువంటి నిధులు లేవు. ప్రభుత్వం కూడా కొత్తగా అభివృద్ధి నిధులు కేటాయించలేదు. ఏడాదిగా అవుట్ సోర్సింగ్ సిబ్బందికి జీతాలు ఇవ్వలేని స్థితిలో వర్సిటీ ఉంటే..కొత్తగా నియామకాలు చేపట్టి ఏం సందేశం ఇస్తున్నారని వర్సిటీ వర్గాలు మండిపడుతున్నాయి. మరోవైపు 235 మందికిపైగా అవుట్ సోర్సింగ్ సిబ్బందిలో వంద మందికిపైగా సిబ్బందికి ఉద్వాసన పలికేందుకు వర్సిటీ యాజమాన్యం సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాల భోగట్టా.
నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు?
వాస్తవానికి వర్సిటీల్లో ప్రత్యక్షంగా నియామకాలు చేపట్టే అధికారం ఇన్‌చార్జ్ పాలకులకు ఉండదు. ఇందుకు ప్రభుత్వం, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ముందస్తు అనుమతి తప్పనిసరి. ఆ తర్వాత ఉద్యోగ వివరాలతో బహిరంగ ప్రకటనల ద్వారా నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇది సాధారణ, అడహక్ నియామకాలకు వర్తిస్తుంది. కానీ, ద్రవిడియన్ వర్సిటీలో మాత్రం ఇన్‌చార్జ్ పాలకులు ‘తాము చెప్పిందే వేదం.. చేసేదే శాసనం’ అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో ఉన్నత విద్యా మండలి ఈ ఏడాది జనవరిలో జారీ చేసిన ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ నియామక, ఆర్థిక పరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు.