
రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులుగా నిలిచిపోయిన కేబుల్ ప్రసారాలు
11 నెలల్లో 6.5 లక్షల నుంచి 4.5 లక్షలకు పడిపోయిన కేబుల్ కనెక్షన్లు
గత ప్రభుత్వంలో నియమించిన వారంటూ 800కు పైగా ఉద్యోగుల తొలగింపు
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఏపీ ఫైబర్ నెట్ (ఏపీ ఎస్ఎఫ్ఎల్) మూసివేత దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో నియామకాలంటూ కూటమి ప్రభుత్వం ఏకంగా 800 మంది ఉద్యోగులను తొలిగించి.. వారి జీవితాలను రోడ్డున పడేసింది. మిగిలిన సిబ్బందికి 4 నెలలుగా జీతాలు లేకపోవడంతో.. వారంతా ఏప్రిల్ 1నుంచి విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొంటున్నారు. కేబుల్ కట్ అయినప్పుడు వెళ్లి సరిదిద్దడానికి వినియోగించే ఆటోలకు 8 నెలలుగా చార్జీలు చెల్లించకపోవడంతో వీరు కూడా సమ్మెలో పాల్గొంటున్నారు. దీంతో కనీసం ప్రసారాలు ఆగిపోతే పునరుద్ధరించలేని పరిస్థితి.
కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసినా కాల్ రిసీవ్ చేసుకునే నాథుడే కరువయ్యాడు. ప్రభుత్వం నిరంకుశత్వ చర్యలతో విసుగు చెందిన వినియోగదారులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. గడిచిన 11 నెలల్లోనే కేబుల్ కనెక్షన్ల సంఖ్య 6.5 లక్షల నుంచి 4.5 లక్షలకు పడిపోయిందంటే పరిస్థితి ఏ విధంగా దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. వినియోగదారుల నుంచి వస్తున్న ఒత్తిడితో సమాధానం చెప్పలేక లోకల్ కేబుల్ ఆపరేటర్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.
ముగ్గురు ఎండీలు మార్పు.. చైర్మన్ రాజీనామా
కూటమి ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన వెంటనే ఫైబర్‌నెట్ ప్రధాన కార్యాలయాన్ని సుమారు 3 నెలలపాటు సీజ్ చేశారు. 10 నెలల్లోనే ముగ్గురు ఎండీలు మారారు. ఈ పరిస్థితుల్లో ఫైబర్‌నెట్‌మూసివేత దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందంటూ తీవ్ర ఆరోపణలు చేసి మరీ చైర్మన్ జీవీ రెడ్డి రాజీనామా చేశారు. గత ప్రభుత్వ హయాంలో టెరాసాఫ్ట్‌లో పనిచేసిన వారందరినీ ఉద్యోగంలోకి తీసుకుంది.
కానీ.. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు లేకుండా గత ప్రభుత్వం నియామకాలంటూ 800 మందికిపైగా ఉద్యోగాల నుంచి తొలగించింది. సెటాప్ బాక్స్ పాడైపోతే కొత్త బాక్సులు ఇవ్వకపోవడం, ప్రసారాలు ఆగిపోతే పునరుద్ధరించకపోతుండంటంతో వినియోగదారులు ఫైబర్ నెట్ సేవలకు దండంపెట్టి ప్రైవేటు సంస్థల కనెక్షన్లకు తరలిపోతున్నారు. దీంతో తమ ఉపాధి దెబ్బతింటోందని ఆపరేటర్లు లబోదిబోమంటున్నారు

నేటినుంచి విజయవాడలో ధర్నా
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫైబర్‌నెట్ ఆపరేటర్లు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా విజయవాడ ధర్నా చౌక్‌లో రెండు రోజుల పాటు ధర్నా నిర్వహించాలని తీర్మానించుకున్నారు. తక్షణం సర్వీసులను పునరుద్ధరించడంతోపాటు కొత్త బాక్సులు అందించడం, ఈఎంఐ చార్జీలను తొలగించాలన్న ప్రధాన డిమాండ్లతో ఆపరేట్లర్లు ధర్నా నిర్వహిస్తున్నారు.
క్షేత్రస్థాయిలో పనిచేసే టెక్నికల్ సిబ్బందికి జీతాలు అందజేసి తిరిగి విధులు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి సరైన స్పందన వచ్చేవరకు విజయవాడను వదిలి వేళ్లే ప్రసక్తే లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మల్టీ సర్వీసెస్ కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం స్పష్టం చేస్తోంది.