
జాంబవంతుడు ప్రతిష్టించిన రామక్షేత్రం!
త్రేతాయుగంలో సీతారామలక్ష్మణ నివాసమే ఏకశిలానగరం
ఆంజనేయుడు లేకపోవడమే ఆలయ ముఖ్య విశేషం
వంటడు..మిట్టడుతో ఆలయ నిర్మాణానికి అంకురార్పణ
నేటి నుంచి ఒంటిమిట్ట కోదండరాముడి బ్రహ్మోత్సవాలు
11న రాములోరి కల్యాణానికిటీటీడీ సమాయత్తం
రాష్ట్ర విభజన తర్వాత ఒంటిమిట్ట రామాలయం టీటీడీలోకి విలీనమైంది. టీటీడీ ఏటా బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా నిర్వహిస్తోంది. ఈ ఏడు కూడా శనివారం నుంచి ఈ నెల 15 వరకు బ్రహ్మోత్సవాలు అత్యంత వేడుకగా నిర్వహించనున్నారు. తొలిరోజున అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ఆరంభం కానున్నాయి. ఈనెల 11న రాములోరి కల్యాణం కన్నుల పండువగా చేయనున్నారు. ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈసందర్భంగాఒంటిమిట్ట రామయ్య క్షేత్రం ప్రత్యేక కళను సంతరించుకుంది.
ఒంటిమిట్ట (రాజంపేట): ఒంటిమిట్టలోని కోదండరామాలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబయింది. ఈ నెల 5వ తేదీ నుంచి 15 వరకు ఉత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో విశేష పూజలు చేపట్టనున్నారు. రోజుకొక అలంకారంలో రామయ్య భక్తులకు దర్శనమివ్వనున్నాడు.
ప్రధాన విశేషం..
సీతారామలక్ష్మణులు కొలువుదీరిన ఏ ఆలయంలో అయినా హనుమ కూడా దర్శనమిస్తారు. అయితే ఒంటిమిట్ట గుడిలో సీతారామలక్ష్మణులు మాత్రమే ఏకశిలపై దర్శనమిస్తారు. ఆంజనేయుడి విగ్రహం లేదు. అయితే ఆలయ తూర్పు గాలిగోపురానికి తూర్పుగా రథశాల పక్కనే సంజీవరాయుడుగా వెలసిన ఆంజనేయస్వామి గుడి నిర్మించారు.
త్రేతాయుగంలో సీతారామలక్ష్మణ నివాసం..
త్రేతాయుగంలో సీతారామలక్ష్మణులు ఈ ప్రాంతంలో కొంతకాలం నివసించారని పురాణ కథనం. అప్పుడు సీతమ్మకు దప్పిక అయింది..రాముడు బాణం సంధించి భూమిలోకి వదిలాడు. నీరుపైకి ఎగజిమ్మింది. సీతమ్మ దప్పిక తీరింది. లక్ష్మణుడు అన్న అనుజ్ఞతో తాను ఒక బాణం వదిలాడు. నీరుపైకి వచ్చింది. ఆ నీటిబుగ్గలనే నేడు రామతీర్థం..లక్ష్మణతీర్థం అని పిలుస్తున్నామనే కథ పురాణాల ద్వారా తెలుస్తోంది.
ధర్మ సంస్థాపన కోసం ఒంటిమిట్ట గుడి..
రాముడిక్కడ కోదండం ధరించి ఉన్నాడు. కోదండం ధర్మరక్షణకు ప్రతీక. అలనాడు శ్రీరామచంద్రుడు అడవుల్లో తిరుగుతూ నార వస్త్రాలు ధరించినా కోదండాన్ని విడువలేదు. అది ధర్మరక్షణ కోసమే. బుక్కరాయులు తర్వాత సిద్దవటం మట్లిరాజులు ఆలయాన్ని అత్యంత వైభవోపేతంగా తీర్చిదిద్దారు. అనంతరాజు, తిరుమలరాయలు, తిరువెంగళనాథరాజు, కుమార అనంతరాజులు ఒంటిమిట్ట కోవెలను తీర్చిదిద్దారు. ఉన్నతమైన ప్రాకారకుడ్యాలు సమున్నతమైనగోపుర శిఖరాలు రంగమంటపాల్లో అద్భుత శిల్పవిన్యాసాలు కనిపిస్తాయి.
ఏకశిలానగరానికి ఎలా చేరుకోవాలంటే..
చెన్నై–ముంబాయి రైలుమార్గంలోని ఒంటిమిట్ట రైల్వేస్టేషన్‌లో దిగి ఒంటిమిట్ట(ఏకశిలానగరం)కు చేరుకోవచ్చు. కడప నుంచి రేణిగుంట తిరుపతికి వెళ్లే బస్సు మార్గంలో , కడప నుంచి 25కిలోమీటర్ల దూరంలో ఒంటిమిట్ట వస్తుంది.
ఆలయ చరిత్ర..
విజయ నగర స్రామాజ్యంలో క్రీ.శ 1340లో ఉదయగిరి పాలకుడు కంపరాయలు ఒంటిమిట్ట ప్రాంతంలో పర్యటించారు. ఆయన కొంతపరివారాన్ని వెంటబెట్టుకొని వచ్చాడు. ఈ అడవుల్లో ఇద్దరు బోయలు ఉండేవారు. వారే వంటడు, మిట్టడు. వీరు రాజుగారికి సేవలందించారు. ఈ సమయంలో సమీపంలో గుట్టమీద చిన్నపాటి గుడి ఉంది. జాంబవంతుడు నిలిపిన శిలలో సీతారామలక్ష్మణులని భావించి దండం పెట్టుకొంటున్నారని, అక్కడ గుడి కట్టి పుణ్యం కట్టుకోమన్నారు.
సీతమ్మను వెతుకుతూ ఒకనాడు జాంబవంతుడు ఈ గుట్టమీద విశ్రమించాడని, ఆరాత్రి అక్కడే నిద్రించాడని ఉదయం తిరిగి వెళ్తూ ఆ శిలలో సీతారామలక్ష్మణులను భావించుకొని నమస్కరించుకొని వెళ్లాడట. వంటడు..మిట్టడు చెప్పిన మేరకు కంపరాయులు గుడి, చెరువు నిర్మించేందుకు అంగీకరించారు. ఆ బాధ్యత బోయలకే అప్పగించారు. కాగా.. ఒంటడు.. మిట్టడు.. ఆలయ నిర్మాణంలో భాగం అయ్యారు గనుకనే ఈ ఆలయానికి ఒంటిమిట్ట అనే పేరు వచ్చిందనే పురాణ కథ ప్రాచుర్యంలో ఉంది.
ఏకశిలా నగరంగా..
ఒంటిమెట్ట మీద నిర్మించిన ఆలయం ఉన్న ప్రదేశం ఒంటిమిట్ట అయింది. ఒంటిమిట్ట గుడికి అనురూపంగానే ఏర్పడిన మరోపేరు ఏకశిల. ఒకేశిలలో సీతారామలక్ష్మణ విగ్రహాలు నిర్మితమై ఉన్నాయి. ఇది అరుదైన సంగతి. జాంబవంతుడు ముగ్గుర్ని ఒకే శిలలో భావించుకొన్నాడు. ఆ తర్వాత కాలంలో కంపరాయలు, బుక్కరాయలు అదే సంప్రదాయంతో ఏకశిలలో ముగ్గురు మూర్తులు ఉండేటట్లు నిర్మాణం చేయించారు. బహుశా ఒకే శిలలో ముమ్మూర్తులను నిలిపిన సంఘటన ఒంటిమిట్టలో మొదటిగా ఆవిష్కృతమైంది. అరుదుగా కొలవైన ఏకశిలావిగ్రహ ప్రాంతాన్ని ఏకశిల అని భక్తితో అన్నాడు పోతన.
రాత్రిపూటే కల్యాణం..
ఒంటిమిట్ట స్వామివారి కల్యాణం రాత్రిపూట నిర్వహిస్తారు. చతుర్ధశినాటి రాత్రి వివాహమహోత్సవం, కళాపూర్ణుడైన చంద్రుడు సీతారామ కల్యాణాన్ని పరమానందంతో తిలకిస్తాడని పురాణకథ చెపుతోంది. కాగా రాత్రి కల్యాణం సంప్రదాయం ఇప్పటిదికాదు. అది ఒంటిమిట్ట ఆలయం ప్రజలకు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఇలాగే జరుగుతోంది. అన్ని రామాలయాలలో నవమిరోజున కల్యాణం నిర్వహిస్తారు. అది పగటిపూట. ఒక్క ఒంటిమిట్ట కోదండరామాలయంలోనే రాత్రి పూట రాములోరి కల్యాణం జరుగుతుంది. ఈ నెల11న రాత్రి 8–10 గంటలలోపు స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు.
రామయ్య సేవలో కవులు
ఒంటిమిట్ట కోదండరామాలయంలో వెలసిన రఘురాముడిని సేవిస్తూ కవులెందరో తరించారు. వారిలో అయ్యలరాజు తిప్పయ్య, బమ్మెర పోతన, అయ్యలరాజు రామభద్రుడు, ఉప్పుగొండూరు వెంకట కవి, వరకవి నల్లకాల్వ అయ్యప్ప, వాసుదాసు వావిలికొలను సుబ్బారావులు తమతమ స్థాయిలో కోదండరామునిపై సాహిత్యం, కీర్తనలు, రచనలుతోపాటు ఆలయ అభివృద్ధికి తోడ్పడ్డారు.
ఆలయ నిర్మాణం ఇలా..
విజయ నగర సామా్రజ్య చక్రవర్తి బుక్కరాయలు ఒంటిమిట్ట గుడిలో ఏకశిలా విగ్రహం నిలిపిన నాటికి గర్భాలయం, అంతరాళం, చిన్నగోపురం ఉండేవి. మొదటి దశ నిర్మాణమిది. మూడవ దశలో మహా మంటపం (రంగ మంటపం), మహా ప్రాకారం, తూర్పు, ఉత్తర , దక్షిణ గాలిగోపురాలు, మహా ప్రాకారం లోపల నైరుతి దిక్కున కళ్యాణ మంటపం, ఆగ్నేయ దిశలో పాకశాల, ప్రాకారంలోపల ఉత్తరం వైపు తూర్పున, పడమర ఎదుర్కోలు మంటపాలు, రామలింగదేవుని గుడి (1966)లో లింగాన్ని నిలిపారు.
సంజీవరాయస్వామి, రథం, రథశాలను ఏర్పాటుచేశారు. అనంతరం అనంతరాజు గుడిని విస్తరించాడు. మహామంటపం, మహాప్రాకారం, గాలిగోపురాల నిర్మాణాలు చేపట్టారు. తెలుగురాష్ట్రాలలో ఒంటిమిట్ట గాలిగోపురాల తరహాలో మరెక్కడా కనిపించవు. ఈ ఆల యాన్ని దర్శించిన టావెర్నియర్ అనే యాత్రికుడు ఎత్తయిన గోపురాలు చూసి విస్మయం చెందాడు.
రామయ్యకు బ్రహ్మోత్సవ శోభ
ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలతో ఏకశిలానగం శోభాయమానంగా వెలుగొందనుంది. ఇప్పటికే కళ్యాణవేదిక ముస్తాబు, భక్తుల కోసం గ్యాలరీలు చకచకా ఏర్పాటుచేశారు. 60 గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు. వీవీవీఐపీ, వీఐపీ, సాధారణ భక్తులును దృష్టిలో ఉంచుకొని గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. దాశరథి కల్యాణానికి వచ్చే భక్తులకు తోపులాట వాతావరణం లేకుండా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. రేపటి నుంచి జరిగే బ్రహ్మోత్సవాలకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు దాదాపు పూరికావస్తున్నాయి.
దాశరథి కోవెలలో నవమి ఏర్పాట్లు...
ఒంటిమిట్టలో శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆరోజున ఆలయంలో పోతన జయంతి కార్యక్రమాన్ని టీటీడీ నిర్వహించనున్నది. కవిసమ్మేళనం నిర్వహిస్తారు. నవమి సందర్భంగా భక్తులు పెద్దఎత్తున రానున్నారు.