
టన్ను అరటి రూ.20 నుంచి 25 వేలతో కొనుగోలు చేస్తున్న వ్యాపారులు
హర్షం వ్యక్తం చేస్తున్న అరటి రైతులు
పులివెందులూరల్: వైఎస్సార్ జిల్లా పులివెందుల అరటి కాసులు కురిపిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో మంచి డిమాండ్ ఉన్న ఈ అరటి ఇటీవల కాలంలో గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతూ నాణ్యత విషయంలో తగ్గేదే లేదంటోంది. ఈ ప్రాంతంలో సాగయ్యే అరటికి బయట మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉండడంతో వ్యాపారులు నేరుగా తోటల వద్దకు వస్తున్నారు.
ఢిల్లీ మార్కెట్‌కు అనుకూలంగా ఉన్న తోటలను ఎంచుకుని అరటికాయలను కొనుగోలు చేస్తున్నారు. రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి ధరలు నిర్ణయించి కొనుగోలు చేయడం ద్వారా దళారుల బెడద లేకుండా పోయిందని రైతన్నలూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నియోజకవర్గంలో 10 నుంచి 15వేల ఎకరాల్లో ...
పులివెందుల ననియోజకవర్గ వ్యాప్తంగా 15వేల ఎకరాల్లో అరటి సాగు ఉంటే ఇందులో 10వేల ఎకరాల్లో గెలలు మొదటి కోతకు రానున్నాయి. నియోజకవర్గంలోని పులివెందుల, లింగాల, వేముల, వేంపల్లె మండలాల్లో అధికంగానూ, తొండూరు, సింహాద్రిపురం మండలాల్లో తక్కువగా అరటి సాగు అవుతోంది.
ఒకసారి సాగు చేస్తే మూడు పంటలు తీయవచ్చన్న ఉద్దేశంతో రైతులు అరటిని ఎంచుకుంటున్నారు. ఎక్కువగా మే, జూన్, జూలై నెల్లో సాగుచేస్తారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో కోతకు వచ్చేలా సాగు చేయడం ద్వారా ధరలు ఉంటాయని రైతులు అంటున్నారు.
ఎకరాకు రూ.60వేలు పైనే పెట్టుబడులు
అరటి సాగులో పెట్టుబడులు కూడా అధికం అవుతున్నాయి. ఎకరా సాగు చేయాలంటే రూ.60వేల నుంచి రూ.70వేల వరకు పెట్టుబడులు వస్తున్నాయని రైతులు చెబుతున్నారు. అరటి నాటిన మొదలు గెలలు కోతకు వచ్చే వరకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సాగుచేసిన 11 నెలలకు గెలలు కోతకు వస్తాయి. సాగులో పెట్టుబడులు అవుతున్నప్పటికీ ఆదాయం ఉంటుందనే రైతులు అరటిని సాగుచేస్తున్నారు.
డ్రిప్పు ద్వారా నీటి తడులతో పాటు ఎరువులు అందించడం ద్వారా నాణ్యమైన అరటి ఉత్పత్తులు అందుతున్నాయి. సాగులో ఎకరాకు 10 నుంచి 15 టన్నుల వరకు దిగుబడులు వస్తున్నాయి. ఒక్కో గెల 10 నుంచి 12 చీప్‌లు వేస్తుందని రైతులు అంటున్నారు.
వారం రోజుల పాటు అరటి కాయల నిల్వ ...
పులివెందుల నుంచి అరటిని ఢిల్లీకి తరలించాలంటే వారంరోజులు పడుతుంది. పక్వానికి వచ్చిన గెలలను కొట్టి చీపులను వేరుచేస్తారు. ఎలాంటి రసాయనాలు వాడకుండా వారంపాటు నిల్వ ఉండడంతో ఢిల్లీకి చెందిన వ్యాపారులు పులివెందుల అరటి కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. ఒక్కోసారి అరటి గెలలను లారీకి లోడ్ చేసి ఢిల్లీకి తరలిస్తారు. ఇక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లేసరికి అరటి గెలలు దెబ్బతినవని, కాయలు నాణ్యతగా ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు.
అరటికాయలను శుద్ధిచేసి ప్యాకింగ్ ...
పులివెందుల నుంచి అరటి కాయలను ఢిల్లీకి తరలించాలంటే శుద్ధి చేసి ప్యాకింగ్ చేయాల్సి ఉంటుంది. దీంతో తోటల వద్దకు కూలీలు వెళ్లి అరటి గెలలు తీసుకువచ్చి చీపులను వేరుచేస్తారు. వీటిని బ్లీచింగ్ పౌడర్ కలిపిన నీటిలో శుద్ధి చేస్తారు.
అలా శుద్ధిచేసిన చీపులను అట్టపెట్టెలో కవరు వేసి అందులో అరటి కాయలను ఉంచి ప్యాకింగ్ చేస్తారు. ఒక్కో అట్టపెట్టెలో 15కిలోల చొప్పున అరటికాయలను ప్యాక్ చేస్తారు. తోటల వద్దనే తూకాలు వేసి అట్టపెట్టెలను సీజ్ చేస్తారు. అరటికాయలతో ఉన్న అరటి పెట్టెలను లోడ్ చేసి ఢిల్లీ మార్కెట్‌కు తరలిస్తారు.
గల్ఫ్ దేశాలకు పులివెందుల అరటి
పులివెందుల ప్రాంతంలో పండిన అరటికి ఢిల్లీ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంటుంది. ఎక్కువగా ఈ సీజన్‌లోనే ఇక్కడ అరటి కాయలను తరలిస్తారు. నెలకు 10నుంచి 15వేల టన్నుల మేర కాయలు ఢిల్లీ మార్కెట్‌తో పాటు గల్ఫ్ దేశాలు అరబ్, ఇరాక్, ముంబై తదితర ప్రాంతాలకు వెళ్తాయి. ఇక్కడ పండించిన అరటి నాణ్యతగా ఉండడం, వారం రోజుల పాటు నిల్వ ఉండడం వల్ల ఢిల్లీ మార్కెట్‌తో పాటు ఇతర గల్ఫ్ దేశాల్లో డిమాండ్ ఉంటుంది. – రామమల్లేశ్వరరెడ్డి, అరటి రైతు