
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుపై వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వంగవీటి రంగా హత్య కేసులో వెలగపూడి నిందితుడని.. రాగమాలిక సీడీషాప్‌ను అడ్డగా చేసుకుని రంగా హత్యకు ప్లాన్ చేశారని ఆరోపించారు. (చదవండి: ‘విగ్రహం ధ్వంసం వెనుక చంద్రబాబు పాత్ర’)
‘‘రంగాను కత్తితో పొడిచి హత్య చేసిన వాళ్లలో వెలగపూడి ఒకరు. వెలగపూడిని.. మొదట రాగమాలిక రామకృష్ణ అనే పిలిచేవారు. కాపీ కొట్టి ఇంటర్ పరీక్షలు రాసిన వ్యక్తి వెలగపూడి రామకృష్ణ. ఒక విశ్వవిద్యాలయం నుంచి పట్టా కొనుగోలు చేసిన వ్యక్తి వెలగపూడి అని’’ విజయసాయిరెడ్డి దుయ్యబట్టారు. త్వరలోనే వెలగపూడి విద్యార్హతపై కేసు పెడతామని ఆయన తెలిపారు. వెలగపూడికి హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో కమర్షియల్ కాంప్లెక్స్, ఇళ్లు ఉన్నాయని, విశాఖలో కూడా బినామీ పేర్లతో ఇళ్లు ఉన్నాయన్నారు. (చదవండి: ‘రొయ్య మీసాలతో భయపెట్ట లేరు’)
‘‘బైరెడ్డి పోతన్నరెడ్డి, కాళ్ల శంకర్, పట్టాభి, రాజేంద్రకుమార్, సతీష్.. వెలగపూడి బినామీలు. విశాఖలో వెలగపూడి లిక్కర్ సిండికేట్ అక్రమాలకు పాల్పడ్డారు. దేవినేని బాజీ పేరుతో కబడ్డీ పోటీలు నిర్వహించి కలెక్షన్లు చేసిన వ్యక్తి ఆయన. రజకులకు చెందిన భూమిని లాక్కున్నారు. ఏసీపీ రంగారావుకు లంచం ఇచ్చి.. రౌడీషీట్ తీయించుకున్నారు. వెలగపూడి యువజన పేరుతో ఆరిలోవలో అక్రమాలకు పాల్పడ్డారు. విధి నిర్వహణలో ఉన్న ఎస్‌ఐను గాయపరిచిన కేసులో వెలగపూడి నిందితుడని, రుషికొండ లే అవుట్‌లో రెండు ప్రభుత్వ ప్లాట్‌లు కొట్టేసిన వ్యక్తి అని’’ టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి అవినీతి చిట్టాను ఎంపీ విజయసాయిరెడ్డి విప్పారు.