
అనకాపల్లి, సాక్షి: పదేళ్ల కిందట తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన చిన్నారి వేపాడు దివ్య హత్య కేసులో సంచలన తీర్పు వెలువడింది. ఈ కేసులో నిందితుడు గుణశేఖర్‌ను దోషిగా ప్రకటించిన చోడవరం కోర్టు.. మరణశిక్షను ఖరారు చేసింది.
దేవరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. గుణశేఖర్‌కు దివ్య కుటుంబంతో గొడవలు ఉన్నాయి. ఇది మనసులో పెట్టుకుని.. స్కూల్‌కి వెళ్లి వస్తున్న ఆరేళ్ల చిన్నారి దివ్యను నిందితుడు తన వెంట తీసుకెళ్లాడు. బిళ్లలమెట్ల రిజర్వాయర్ వద్దకు తీసుకెళ్లి బీర్ బాటిల్‌తో గొంతు కోసి పైశాచికంగా హత్య చేశాడు. ఈ ఘటన అప్పట్లో కలకలం రేపింది.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరంగా జరిపారు. చివరకు బంధువైన గుణ శేఖరే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిర్ధారించుకుని అరెస్ట్ చేశారు. ఇన్నేళ్లపాటు విచారణ జరగ్గా.. చివరకు దివ్య కుటుంబానికి న్యాయం జరిగిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.