
భారీ వర్షం.. రైతుల ఆందోళన
మణుగూరు టౌన్/చర్ల/పాల్వంచరూరల్/గుండాల/అశ్వాపురం/టేకులపల్లి/ఇల్లెందు: జిల్లాలోని పలు చోట్ల గురువారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. సాయంత్రం నుంచి వస్తున్న గాలి దుమారానికి తోడు రాత్రి వర్షం పడింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందారు. మణుగూరు, చర్ల, పాల్వంచ, గుండాల, ఆళ్లపల్లి, అశ్వాపురం, టేకులపల్లి, ఇల్లెందు మండలాల్లో వర్షం కురిసింది. దీంతో పంటలను కాపాడుకునేందుకు ఉరుకులు, పరుగులు పెట్టారు. కల్లాల్లో ఆరబోసిన ధాన్యం, మిర్చి రాశులపై టార్పాలిన్ పట్టాలు కప్పుకుని పంటలను కాపాడుకున్నారు. అయినా కొన్ని చోట్ల ధాన్యం, మిర్చి స్వల్పంగా తడిసింది. చేతికి అందిన మొక్క జొన్న చేన్లు పడిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుచోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. వరద నీటితో టేకులపల్లి ప్రధాన రహదారి సెంటర్ చెరువులా మారింది. పలు దుకాణాల్లోకి వరద నీరు చేరింది. మణుగూరులో రోడ్లు జలమయంగా మారాయి. సింగరేణిలో సెకండ్, నైట్ షిఫ్ట్‌ల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందని అధికార వర్గాలు తెలిపాయి.