
బడుగు వర్గాల ఆశాజ్యోతి.. అంబేడ్కర్
సూపర్‌బజార్(కొత్తగూడెం): అంటరానితనంతో ఎదురైన అవమానాలనే ఆయుధాలుగా మలుచుకుని ప్రపంచ మేధావిగా ఎదిగిన వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఘనంగా నివాళులర్పించారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా కొత్తగూడెంలోని పోస్టాఫీస్ సెంటర్‌లో సోమవారం ఎస్సీ సంక్షేమ శాఖ, ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎస్పీ రోహిత్‌రాజుతో కలిసి పాల్గొన్న కలెక్టర్.. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. జయంతి రోజునే కాకుండా ప్రతి రోజూ ఆ మహనీయుడిని స్మరించుకోవాలని, అందరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. ప్రజలు స్వేచ్ఛగా జీవించడానికి అవసరమైన అన్ని హక్కులను రాజ్యాంగంలో పొందుపర్చారని చెప్పారు. అంబేద్కర్ ఒక వర్గానికి చెందిన వారు కాదని, అందరి వాడని అన్నారు. ఆయన సిద్ధాంతాలను నేటి తరా ల వారు తెలుసుకోవాలని సూచించారు. సామాజిక రుగ్మతలు అనుభవించి భావితరాల భవిష్యత్‌కు రుగ్మతలు అడ్డుకారాదని హక్కులు కల్పించారని అన్నారు. అంబేడ్కర్ వంటి గొప్ప వ్యక్తి భారతదేశంలో జన్మించడం అందరికీ గర్వకారణమని అన్నారు. ఎస్పీ రోహిత్‌రాజు మాట్లాడుతూ.. యువతలో ఉన్న శక్తిని సమాజోద్ధరణకు ఉపయోగించడమే అంబేడ్కర్‌కు నిజమైన నివాళి అన్నారు. ఆయనకు ప్రతీ కుటుంబంలోనూ ఓ అభిమాని ఉండాలని అన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, ఎస్సీ అభివృద్ధి అధికారి అనసూర్య, సూపరింటెండెంట్ హనుమంతరావు, సీనియర్ అసిస్టెంట్ ప్రసాద్, ఉత్సవ కమిటీ కన్వీనర్ మారపాక రమేష్, కో కన్వీనర్లు కొప్పరి నవతన్ కుమార్, వేమూరి లక్ష్మీబాయి, సంభారపు నాగేందర్, కనుకుంట్ల నిర్మల, ఎం.లక్ష్మీబాయి, భార్గవి, కూరపాటి రవీందర్, బి.పుష్పలత, కుమారస్వామి, కరిసె రత్నకుమారి, ఆర్.మాధవి, జి.కల్పన, ఎం.సాయిసుధీర్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ జితేష్ వి పాటిల్ నివాళి