
ఆర్థిక సేవల రంగంలో, ముఖ్యంగా బ్యాంకింగ్‌లో ఉత్పాదకతను జెనరేటివ్ ఏఐ (Generative AI) గణనీయంగా పెంచనుంది. ఫైనాన్షియల్ సర్వీసెస్ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చివేయనుందని, కస్టమర్‌తో అనుసంధానత, కార్యకాలపాల సామర్థ్యాన్ని మెరుగుపరచనున్నట్టు ‘ఈవై’ ఇండియా నివేదిక తెలిపింది. 2030 నాటికి ఫైనాన్షియల్, సర్వీసెస్ రంగంలో ఉత్పాదకతను 34–38 శాతం మేర, బ్యాంకింగ్‌లో ఉత్పాదకతను 46 శాతం మేర జెనరేటివ్ ఏఐ అధికం చేస్తుందని అంచనా వేసింది. ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది.
ఫైనాన్షియల్ సర్వీసెస్, రిటైల్, హెల్త్‌కేర్, లైఫ్ సైన్సెస్, మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్, టెక్నాలజీ, ఆటోమోటివ్, ఇండ్రస్టియల్స్, ఎనర్జీ తదితర రంగాల్లోని 125కు పైగా ఉన్నత స్థాయి ఉద్యోగుల (సీఈవో, సీఎఫ్‌వో, సీవోవో తదితర) అభిప్రాయాలను ఈవై తన సర్వే కోసం సేకరించింది. ‘జెనరేటివ్ ఏఐపై పెట్టుబడులు పెరుగుతున్నాయి. 42 శాతం కంపెనీలు ఏఐ కోసం ప్రత్యేకంగా బడ్జెట్‌ను కేటాయిస్తున్నాయి. వాయిస్ బాట్స్, ఈమెయిల్ ఆటోమేషన్, బిజినెస్ ఇంటెలిజెన్స్, వర్క్‌ఫ్లో ఆటోమేషన్‌లో జెనరేటివ్ ఏఐని వేగంగా అమలు చేస్తున్నాయి’ అని ఈవై నివేదిక వివరించింది.
ఇదీ చదవండి: ఎయిరిండియా అనుబంధ సంస్థలపై విదేశాల్లో రోడ్‌షో
కస్టమర్ సేవల్లో జెనరేటివ్ ఏఐ
కంపెనీలు కస్టమర్ సేవల్లో జెనరేటివ్ ఏఐని అత్యధికంగా వినియోగిస్తున్నాయి. 68 శాతం సంస్థలు కస్టమర్ సేవల్లో జెనరేటివ్ ఏఐకి ప్రాధాన్యం ఇస్తున్నాయి. కార్యకలాపాల్లో 47 శాతం, అండర్‌రైటింగ్ కార్యలాపాల్లో 32 శాతం, అమ్మకాల్లో 26 శాతం, ఐటీలో 21 శాతం చొప్పున జెనరేటివ్ ఏఐ వినియోగానికి సంస్థలు ఇప్పటికే ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ కృత్రిమ మేధ అమలుతో కస్టమర్ల సంతృప్త స్థాయిలు మెరుగుపడినట్టు 63 శాతం కంపెనీలు తెలిపాయి. వ్యయాలను తగ్గించుకున్నామని 58 శాతం కంపెనీలు వెల్లడించాయి. కోర్ బ్యాంకింగ్ వ్యవస్థలు, సీఆర్‌ఎం, రుణాల మంజూరు, కార్డ్ మేనేజ్‌మెంట్ ప్లాట్‌ఫామ్‌లు ఇతర విభాగాల్లో జెనరేటివ్ ఏఐని సంస్థలు అమలు చేస్తున్నాయి. దీంతో వ్యయాలు గణనీయంగా తగ్గుతున్నట్టు ఈవై ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్ పార్ట్‌నర్ ప్రతీక్‌షా తెలిపారు. ఒక యూనిట్‌కు సాధారణ వ్యయాల్లో 90 శాతం మేర తగ్గుతున్నట్టు చెప్పారు.