
కంటి నిండా నిద్రపోతే కలిగే మేలు ఎంతో, కలత నిద్రతో జరిగే కీడు కూడా అంతే! తాజాగా నిద్రలేమి సమస్యతో గుండెజబ్బులు వస్తున్నాయని తేలింది. మిమ్మల్ని హాయిగా నిద్రపోయేలా చేసే స్మార్ట్ టెక్నాలజీతో రూపొందించిన గాడ్జెట్స్ గురించి తెలుసుకుందాం.
నిద్రపుచ్చే రోబో
అమ్మలా మిమ్మల్ని జోకొట్టి, పాటలు పాడి, కథలు చెప్పే రోబోలు చాలానే వచ్చేశాయి. అలాంటి వాటిలో ఒకటే ఈ ‘సోమ్నాక్స్ స్లీప్ రోబో’. ఇది మిమ్మల్ని నిద్రపోయే ముందు విశ్రాంతి తీసుకోవడానికి బాగా సహాయపడుతుంది.
సంగీతం, కథలను వినిపిస్తూ నిద్ర పుచ్చుతుంది. మెత్తగా, వెచ్చగా ఉండే వీటిని పక్కనే పట్టుకొని నిద్రపోతే ఎటువంటి భయం లేకుండా చాలా ధైర్యంగా ఉంటుంది. ఇక ఇందులో వివిధ ప్రకృతి శబ్దాలు, ఆహ్లాదకరమైన సంగీతంతో పాటు శ్వాస వ్యాయామాలు, ధ్యానం చేసేలా వాల్యూమ్ నియంత్రణలు, నైట్‌లైట్ ఎంపికలు వంటి ఆప్షన్లు ఉన్నాయి. ధర రూ.46,976.