
అమెరికా, చైనాల మధ్య పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు, వరుస ప్రతీకార సుంకాలు ప్రపంచ వాణిజ్య ముఖచిత్రాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా చైనా వస్తువులపై అమెరికా 145 శాతం వరకు సుంకాలు విధించడంతో ఆ దేశ ఎగుమతి ఆధారిత ఆర్థిక వ్యవస్థ గణనీయమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ సుంకాలు చైనా ఎగుమతులను ఎలా ప్రభావితం చేస్తాయో, అక్కడి ఎగుమతిదారులు అనుసరిస్తున్న వ్యూహాలేమిటో తెలుసుకుందాం.
145 శాతం వరకు సుంకాలు
చైనా ఆర్థిక వ్యవస్థ చాలా కాలంగా ఎగుమతులపై ఆధారపడి ఉంది. చైనా అతిపెద్ద మార్కెట్‌ల్లో యూఎస్ కీలకం. 2024లో యూఎస్‌కు చైనా సుమారు 440 బిలియన్ డాలర్ల ఎగుమతులు చేసింది. ఇది ఆ దేశం మొత్తం ఎగుమతుల్లో 14%, జీడీపీలో సుమారు 3%గా ఉంది. చైనా దిగుమతులను కట్టడి చేయడమే లక్ష్యంగా ఇటీవల వివిధ వస్తువులపై 10 శాతం నుంచి 145 శాతానికి అమెరికా సుంకాలు పెంచింది. ప్రధానంగా ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్స్, మెషినరీ సహా పలు రకాల ఉత్పత్తులను లక్ష్యంగా చేసుకుంది.
ఎగుమతులపై తీవ్ర ప్రభావం
సుంకాల తక్షణ ప్రభావం కింద చైనా వస్తువులకు అమెరికాలో డిమాండ్ గణనీయంగా తగ్గింది. టారిఫ్‌ల పెంపు వల్ల వచ్చే రెండేళ్లలో అమెరికాకు చైనా ఎగుమతులు 80 శాతం వరకు పడిపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఉదాహరణకు, చైనా నుంచి యూఎస్ దిగుమతుల్లో 9% ఉన్న స్మార్ట్‌ఫోన్లు వంటి ఉత్పత్తులు తీవ్రమైన ధరల పెరుగుదలను ఎదుర్కొంటాయి. దాంతో వాటిని మార్కెట్ నుంచి బహిష్కరించే అవకాశం ఉంది. దాంతోపాటు మిలియన్ల మంది చైనా కార్మికుల జీవనోపాధికి ముప్పు కలిగిస్తుంది. చైనాలో సుమారు రెండు కోట్ల ఉద్యోగాలు యూఎస్ సంబంధిత ఎగుమతులపై ఆధారపడి ఉన్నాయి.
ఆర్థిక పరిణామాలు
అమెరికా సుంకాలు చైనా ఎగుమతిదారులను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. లాభాల మార్జిన్లను గణనీయంగా తగ్గించాయి. కొన్ని సంస్థలు పూర్తిగా ఎగుమతులను నిలిపేశాయి. టెక్స్‌టైల్ కంపెనీలు యూఎస్‌కు ఎగుమతులను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తెలిపాయి. సుంకాల ప్రభావం వల్ల లాభాలు భారీగా క్షీణించాయని పేర్కొన్నాయి. మరోవైపు వియత్నాం వంటి దేశాలు ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. తగ్గిన ఎగుమతి ఆదాయాలు చైనా ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభమైన తయారీ రంగాన్ని బలహీనపరుస్తాయి. ఇప్పటికే ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతలతో కుదేలైన పారిశ్రామికోత్పత్తి మరింత ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ఆర్డర్లు తగ్గడంతో కొన్ని కర్మాగారాలు పరికరాలను విక్రయిస్తున్నాయి.
తగ్గిన జీడీపీ అంచనా
అమెరికా సుంకాలు పెంపు, అంతర్జాతీయంగా డిమాండ్ మందగించడం వంటి కారణాలతో గోల్డ్ మన్ శాక్స్ 2025లో చైనా జీడీపీ వృద్ధి అంచనాను 4 శాతానికి సవరించింది. చైనా జీడీపీలో అమెరికాకు చేసే ఎగుమతుల వాటా తక్కువే అయినప్పటికీ, తగ్గిన పెట్టుబడులు, వినియోగదారుల సామర్థ్యం వల్ల మరింత ఆర్థిక ఒత్తిడి ఎందురవుతుంది.
చైనా ప్రతిస్పందన
చైనా యూఎస్ సుంకాల ప్రభావాన్ని తగ్గించడానికి చైనా బహుముఖ వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఆగ్నేయాసియా ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఎగుమతిదారులు అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించే ప్రయత్నాలను వేగవంతం చేస్తున్నారు. 2019 నుంచి ఆగ్నేయాసియా చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. తాజా సుంకాలతో ఈ వాణిజ్య పరిమాణాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఉదాహరణకు, టెక్స్‌టైల్ సంస్థలు తక్కువ వాణిజ్య అవరోధాలు ఉన్న మార్కెట్లకు తమ ఎగుమతులను మళ్లిస్తున్నాయి. అయినప్పటికీ ఈ మార్కెట్లు తరచుగా తక్కువ మార్జిన్లను అందిస్తాయి.
ఇదీ చదవండి: థియేటర్ల పంట పండుతుందిలా..
యూఎస్‌పై చైనా రివర్స్ సుంకాలు
అమెరికా వస్తువులపై చైనా సుంకాలను 125 శాతానికి పెంచుతున్నట్లు ఇటీవల ప్రకటించింది. ఇది సోయాబీన్స్, పంది మాంసం వంటి వాటితోపాటు ఇంధనాలు, యంత్రాలు లక్ష్యంగా చేసుకుంది. యూఎస్ ఉత్పత్తిదారులపై ఒత్తిడి తీసుకురావాలని ఉద్దేశంతో ఈమేరకు చైనా ప్రతీకార సుంకాలను విధించింది.