
ఉద్యోగుల తొలగింపులపై దేశీయ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ (Infosys) దూకుడు తగ్గించింది. ఉద్యోగులు నేర్చుకోవడానికి ఇంకా ఎక్కువ సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ తన రాబోయే ఉద్యోగుల మదింపులను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. ఈ నిర్ణయం సరికొత్త ఎత్తుగడ అని, ఇటీవలి తొలగింపుల (Layoff) నుండి దృష్టిని మరల్చడానికి కంపెనీ ప్రయత్నిస్తోందని ఎంప్లాయీ వెల్ఫేర్ గ్రూప్ నాజెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) ఆరోపించింది.
తొలగింపుల నేపథ్యం
ఇన్ఫోసిస్ ఫిబ్రవరి 7న 700 మంది ఉద్యోగులను తొలగించింది. వీరిలో ప్రధానంగా 2022 ఇంజనీరింగ్ బ్యాచ్‌కు చెందిన ఫ్రెషర్స్ ఉన్నారు. వీరు ఇప్పటికే ఆన్‌బోర్డింగ్‌లో రెండు సంవత్సరాల ఆలస్యాన్ని ఎదుర్కొన్నారు. అంతర్గత మదింపుల ఆధారంగా ఈ తొలగింపులు జరిగినట్లు సమాచారం. అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడానికి సదరు ఉద్యోగులకు మూడు అవకాశాలు ఇచ్చినట్లు కంపెనీ చెబుతోంది. అయితే తొలగింపునకు గురైన ఉద్యోగులు దీనిని ఖండిస్తున్నారు. అసెస్ మెంట్ సిలబస్ ను మధ్యలోనే మార్చారని, ముందస్తు సమాచారం లేకుండానే చాలా మందికి తొలగింపు నోటీసులు వచ్చాయని ఆరోపిస్తున్నారు.
ఎన్ఐటీఈఎస్ స్పందన..
ఇన్ఫోసిస్ చర్యలను విమర్శిస్తూ, తొలగింపులు కార్మిక హక్కుల ఉల్లంఘనగా ఎన్ఐటీఈఎస్ అభివర్ణించింది.. తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరుతూ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది. ఎన్ఐటీఈఎస్ అధ్యక్షుడు హర్ప్రీత్ సింగ్ సలూజా మాట్లాడుతూ, మదింపులను ఆలస్యం చేయాలని తీసుకున్న ఆకస్మిక నిర్ణయం తొలగింపులపై మరింత వివాదం కొనసాగకుండా కప్పిపుచ్చుకోవడానికేనని విమర్శించారు.
ఇన్ఫోసిస్ సమర్థన
ఉద్యోగులకు అదనపు ప్రిపరేషన్ సమయాన్ని అందించడమే లక్ష్యంగా మదింపులను వాయిదా వేస్తున్నట్లు ఇన్ఫోసిస్ పేర్కొంది. కంపెనీ తమ అన్ని కార్యకలాపాలలో సమ్మతి, పారదర్శకతను పాటించడంలో తమ నిబద్ధతను నొక్కి చెప్పింది. ఇన్ఫోసిస్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ షాజీ మాథ్యూ మాట్లాడుతూ.. కంపెనీ కార్మిక శాఖతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని, వారి విచారణలకు సహకరిస్తూ అవసరమైన సమాచారాన్ని అందిస్తోందని తెలిపారు.
ఉద్యోగులపై ప్రభావం..
మదింపులను నిరవధికంగా వాయిదా వేయడం చాలా మంది ఉద్యోగులను వారి భవిష్యత్తుపై మరింత అనిశ్చితికి గురిచేసింది. ఆయా అంశాల్లో నిపుణులతో అదనపు శిక్షణ, ఇతర సహకారం అందిస్తామని కంపెనీ హామీ ఇచ్చినప్పటికీ, ఉద్యోగులకు మాత్రం ఆందోళన తొలగడం లేదు. ఉద్యోగుల తొలగింపు, మదింపుల వాయిదాతో తలెత్తిన వివాదం భారత ఐటీ రంగంలో ఉద్యోగ భద్రతపై దేశవ్యాప్తంగా చర్చలకు దారితీసింది.