
న్యూఢిల్లీ: కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం ప్రత్యేక ప్రీపెయిడ్ ప్యాక్స్‌ను టెలికాం కంపెనీలు రిలయన్స్ జియో(Jio), భారతీ ఎయిర్‌టెల్(Airtel) పరిచయం చేశాయి. 84 రోజుల కాల పరిమితితో రూ.499 ధరలో కొత్త ప్లాన్‌ను ఎయిర్‌టెల్ అందుబాటులోకి తెచ్చింది. అపరిమిత కాల్స్, 900 ఎస్‌ఎంఎస్‌లు ఆఫర్ చేస్తారు. అలాగే రూ.1,959 ధరలో 365 రోజుల వ్యాలిడిటీ గల ప్యాక్ కింద అపరిమిత కాల్స్, 3,600 ఎస్‌ఎంఎస్‌లు అందుకోవచ్చు.
రిలయన్స్ జియో రూ.458 ధరలో 84 రోజుల కాల పరిమితితో అపరిమిత వాయిస్‌కాల్స్, 1,000 ఎస్‌ఎంఎస్‌లను అందిస్తోంది. ఏడాది కాల పరిమితితో రూ.1,958 ధరలో అపరిమిత కాల్స్, 3,600 ఎస్‌ఎంఎస్‌లను పొందవచ్చు. డేటా అవసరం లేకపోయినా బండిల్ ప్యాక్స్ వల్ల కస్టమర్లకు చార్జీల భారం పడుతోందన్న ఫిర్యాదుల పెద్ద ఎత్తున రావడంతో టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ గత నెలలో టారిఫ్ నిబంధనలను సవరించింది. దీనికి అనుగుణంగా డేటా అవసరం లేని కస్టమర్ల కోసం వాయిస్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం టెలికం కంపెనీలు ప్రత్యేక ప్లాన్స్‌ను ప్రవేశపెట్టాల్సి ఉంటుంది.
ఇదీ చదవండి: త్రైమాసిక ఫలితాల్లో కంపెనీలకు లాభాలు
ఎన్‌సీఎల్‌ఏటీలో వాట్సాప్‌కి ఊరట
న్యూఢిల్లీ: నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్‌లో (NCLAT) వాట్సాప్‌కు ఊరట లభించింది. మాతృ సంస్థ మెటాతో వాట్సాప్ అయిదేళ్ల పాటు యూజర్ల డేటాను షేర్ చేసుకోరాదంటూ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) నిషేధంపై ఎన్‌సీఎల్‌ఏటీ స్టే విధించింది. తదుపరి విచారణను మార్చి 17కు వాయిదా వేసింది. ప్రకటనల అవసరాలరీత్యా యూజర్ల డేటాను మెటాతో పాటు గ్రూప్ కంపెనీలకు అందించేలా 2021లో వాట్సాప్ గోప్యతా పాలసీని అప్‌డేట్ చేసింది. అయితే, ఇలాంటివి అనుచిత వ్యాపార విధానాల కిందికి వస్తాయంటూ నవంబర్‌లో సీసీఐ అయిదేళ్ల నిషేధంతో పాటు మెటాపై రూ.213 కోట్ల జరిమానా విధించింది. దీన్ని సవాలు చేస్తూ మెటా, వాట్సాప్ సంస్థలు ఎన్‌సీఎల్‌ఏటీని ఆశ్రయించాయి.