టెలికాం రెగ్యులేటింగ్ అథారిటీ (TRAI) ప్రతిపాదనలతో అపరిమిత కాలింగ్, డేటా ప్లాన్‌ల భవిష్యత్తు ప్రమాదంలో పడింది. తమ ప్రియమైన అన్‌లిమిటెడ్ మొబైల్ రీచార్జ్ ప్యాకేజీలు ఆగిపోతాయేమోనని కోట్లాది మంది టెలికాం యూజర్లు ఆందోళన చెందుతున్నారు.
అవసరం లేకపోయినా అన్ని కలిపి అందించే అన్‌లిమిటెడ్ ప్యాక్‌లు కాకుండా గతంలో మాదిరి కాలింగ్, ఎస్‌ఎంఎస్‌లకు విడివిడిగా ప్యాక్‌లు అందించే విషయంపై టెలికాం రెగ్యులేటింగ్ అథారిటీ (TRAI) ఇటీవల టెలికాం కంపెనీల స్పందన కోరింది. దీనికి ప్రధాన టెలికాం ఆపరేటర్లు జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్-ఐడియా తమ వైఖరిని తెలియజేశాయి. తమ రీఛార్జ్ ప్లాన్‌ల ప్రస్తుత నిర్మాణాన్ని సమర్థించుకున్నాయి.
ఎయిర్‌టెల్ ఏం చెప్పిందంటే..
ఎయిర్‌టెల్ ట్రాయ్‌కి ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో తమ ప్రస్తుత ప్లాన్‌లు సూటిగా, యూజర్ ఫ్రెండ్లీగా ఉన్నాయని పేర్కొంది. ఈ ప్లాన్‌లు ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా వాయిస్, డేటా, ఎస్‌ఎంఎస్ సేవలను కలిపి అందిస్తున్నాయని చెప్పింది. ప్రత్యేక వాయిస్, ఎస్‌ఎంఎస్ ప్యాక్‌ల మోడల్‌కి తిరిగి వెళ్లడం పరిశ్రమను కాలం చెల్లిన సిస్టమ్‌గా మారుస్తుందని, విడివిడి రీఛార్జ్‌లతో వినియోగదారులకూ భారం పడుతుందని బదులిచ్చింది.
జియోదీ అదే వైఖరి
ఎయిర్‌టెల్ వైఖరికి సమర్థిస్తూ జియో కూడా తమ సర్వే డేటాను సమర్పించింది. 91 శాతం మంది వినియోగరులు ప్రస్తుత టెలికాం ప్లాన్‌లను మోస్ట్ అఫర్డబుల్‌గా భావిస్తున్నారని, 93 శాతం తమకు మెరుగైన ప్రయోజనాలు లభిస్తున్నాయని నమ్ముతున్నారని పేర్కొంది. ఈ గణాంకాలు వినియోగదారులలో అపరిమిత మోడల్ విస్తృత ఆమోదాన్ని తెలియజేస్తున్నాయని జియో వివరించింది.
ఆధునిక టెలికాం సేవలలో డేటా ప్రధాన అంశంగా మారిందని, అపరిమిత డేటా, కాలింగ్ మోడల్‌ను పే-యాజ్-యు-గో ప్రత్యామ్నాయం కంటే మెరుగైనదిగా టెలికాం కంపెనీలు నొక్కిచెప్పాయి. ఈ ప్లాన్‌లలో మార్పులు ప్రస్తుత వినియోగదారు అనుభవానికి అంతరాయం కలిగించవచ్చని పరిశ్రమ ఏకీకృత వైఖరి తెలియజేస్తోంది. ఇక దీనిపై ట్రాయ్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment