
అమెరికన్ ట్రాక్టర్ల తయారీ సంస్థ ‘జాన్ డీరె’ ఇటీవల ఎరువులు చల్లే రోబో ట్రాక్టర్ను రూపొందించింది. ‘ఎగ్జాక్ట్ షాట్’ పేరుతో రూపొందించిన ఎలక్ట్రిక్ రోబో ట్రాక్టర్, నేలను బట్టి ఎక్కడ ఎంత ఎరువు అవసరమో, కచ్చితంగా అంత ఎరువు మాత్రమే చల్లుతుంది. ఇందులోని అధునాతనమైన సెన్సర్లు భూసారాన్ని గుర్తించి, నేలలోని లోపాలను బట్టి ఎక్కడ ఎంత మోతాదులో ఏ ఎరువు అవసరమో అంత మేరకు మాత్రమే ఎరువును చల్లుతాయి.
దీనివల్ల భూసారంలోని సమతుల్యతకు అవరోధాలు ఏర్పడకుండా ఉంటాయి. ఎరువుల అధిక మోతాదు కారణంగా భూసారం దెబ్బతినకుండా ఉంటుంది. ఇది ఎరువుల వృథాను గణనీయంగా అరికట్టగలదని నిపుణులు చెబుతున్నారు.
వారి అంచనా ప్రకారం దీనివల్ల అమెరికాలో ఏటా వేసే మొక్కజొన్న పంట సాగులోనే ఎరువుల్లో 9.3 కోట్ల గ్యాలన్ల పరిమాణంలోని ఎరువులు ఆదా కాగలవని, మిగిలిన పంటలను కలుపుకొంటే ఎరువుల వ్యయం గణనీయంగా తగ్గుతుందని చెబుతున్నారు. ఇది వ్యవసాయరంగంలో సరికొత్త విప్లవాన్ని సృష్టించగలదని అంటున్నారు.