
ఈ రోబో చకచకా గోడలెక్కేస్తుంది. మనుషులు చేరుకోలేని ఎత్తు ప్రదేశాలకు కూడా ఇది చేరుకోగలదు. ఎత్తయిన ప్రదేశాల్లోని బరువులను కిందకు దించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. సమాంతర సమతల ప్రదేశాల్లోనైనా, నిటారుగా ఉండే ఉపరితలాల మీదైనా ఇది సునాయాసంగా నాలుగు కాళ్లతో నడుస్తూ ముందుకు సాగగలదు.
పైకప్పులపై కూడా పాకుతూ ముందుకు పోగలదు. స్విట్జర్లాండ్‌లోని ఈటీహెచ్ జ్యూరిక్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఈ ‘మ్యాగ్నెకో రోబో’ను రూపొందించారు. పరిసరాలకు తగినట్లుగా తనను తాను సర్దుకుని, అత్యంత క్లిష్టమైన ప్రదేశాలకు కూడా చేరుకునేలా దీన్ని తీర్చిదిద్దారు.
దీని కాళ్లకు ఎలక్ట్రానిక్ మాగ్నెట్లు అమర్చడం వల్ల ఉడుంపట్టులాంటి పట్టుతో ఎక్కడా జారిపోకుండా పనిచేయగలదు. ఈ రోబో ఒక్కో కాలితో తన బరువుకు రెండున్నర రెట్ల బరువు మోయగలదు.