
హైదరాబాద్: నగరంలోని బాలా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐడీపీఎల్ చౌరస్తాలో హిట్ అండ్ రన్ కేసు మంగళవారం చోటు చేసుకుంది. అనిల్ అనే వ్యక్తి తన కారుతో ఓ యువతిని ఢీకొట్టి పారిపోయేందుకు యత్నించాడు. అయితే పోలీసులు సకాలంలో స్పందించడంతో నిందితుడిని పారిపోయే క్రమంలోనే అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. ఐడీపీఎల్ చౌరస్తా నుంచి బల్కంపేటకు అనిల్ అనే వ్యక్తి తన ఫార్చునర్ కారులో వెళుతుండగా సాయి కీర్తి(19) అనే యువతిని ఢీకొట్టాడు. అయితే ఢీకొట్టిన అనంతరం కారును ఆపకుండా అతి వేగంగా ఫతేనగర్ ఫ్లైఓవర్ దాటేందుకు యత్నించాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఫతేనగర్ ఫ్లైఓవర్ వద్ద అనిల్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే కారును డ్రైవ్ చేస్తున్న అనిల్ మద్యం తాగి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన సాయి కీర్తి స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.