
ఐదుగురు నైజీరియన్లు అత్యంత కీలకమని గుర్తింపు
గత ఏడాది రాష్ట్రంలో రూ.148 కోట్ల సరుకు స్వాదీనం
రాష్ట్ర వ్యాప్తంగా కేసులపై దృష్టి పెట్టిన టీజీఏఎన్‌బీ
సాక్షి,సిటీబ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా 2020-24 మధ్య నమోదైన మాదకద్రవ్యాల కేసుల్లో 8,822 మంది ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు. వీరిలో ఐదుగురు నైజీరియన్లు అత్యంత కీలకమని, దేశవ్యాప్తంగా డ్రగ్స్ సిండికేట్‌ను వాళ్లే నడిపిస్తున్నారని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీజీఏఎన్‌బీ) అధికారులు గుర్తించారు. 2023లో పోలీసులు రూ.94.39 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ చేయగా, అది ఇది గత ఏడాది నాటికి రూ.148.09 కోట్లకు చేరింది. ఈ కేసుల్లో సూత్రధారులు కంటే పాత్రధారులు మాత్రమే చిక్కుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా నమోదైన డ్రగ్స్ కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టిన టీజీఏఎన్‌బీ అధికారులు వాంటెడ్‌గా ఉన్న వారి కోసం గాలిస్తోంది.
అప్పట్లో నేరుగా వచ్చి
మాదకద్రవ్యాల క్రయవిక్రయాలన్నీ సోషల్ మీడియా, డార్క్ వెబ్ కేంద్రంగా సాగుతున్న విషయం తెలిసిందే. వీటిలోనే పెడ్లర్లు, సప్లయర్లు, కన్జ్యూమర్ల మధ్య బేరసారాలు పూర్తవుతున్నాయి. ఒకప్పుడు ఆన్‌లైన్‌లో డబ్బు డిపాజిట్ చేయించుకునే పెడ్లర్లు సిటీకి వచ్చి డ్రగ్స్ అందించి వెళ్లే వాళ్లు. అయితే టీజీఏఎన్‌బీ, హెచ్–న్యూ వంటి ప్రత్యేక విభాగాలు ఏర్పడిన తర్వాత డ్రగ్స్ దందాపై నిఘా పెరిగింది. వరుస పెట్టి డెకాయ్ ఆపరేషన్లు చేసిన అధికారులు, సిబ్బంది జాతీయ, అంతర్జాతీయ పెడ్లర్స్‌ను పట్టుకున్నారు. దీంతో తెలంగాణకు వచ్చి డ్రగ్స్ సరఫరా చేయడానికి వెనుకడుగు వేస్తున్నారు.
కొరియర్స్, డెడ్ డ్రాప్ విధానాల్లో...
సోషల్ మీడియా ద్వారా ఆర్డర్లు తీసుకుంటున్న పెడ్లర్లు ఆన్‌లైన్‌లోనే నగదు చెల్లింపులు అంగీకరిస్తున్నారు. ఆపై కొరియర్ పార్శిల్ చేయడం లేదా సప్లయర్‌ను పిలిపించుకొని మాదకద్రవ్యాలను అందిస్తున్నారు. ఈ సప్లయర్లు సైతం నేరుగా కన్జ్యూమర్‌ని కలవట్లేదు. దీనికోసం డెడ్ డ్రాప్ విధానం అవలంభిస్తున్నారు. మాదకద్రవ్యాన్ని ఓ ప్రాంతంలో ఉంచి ఆ ప్రాంతం ఫొటో, లోకేషన్‌లను వారికి పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అధిక కేసుల్లో కన్జ్యూమర్లు, కొన్ని కేసుల్లో సర్లయర్లు చిక్కుతున్నారు. పెడ్లర్స్ మాత్రం దొరక్కపోవడంతో ఆయా కేసుల్లో వాంటెడ్స్ పెరుగుతున్నారు.
గత ఏడాది భారీగా పెరిగిన కేసులు...
మాదకద్రవ్యాల కేసులు, అరెస్టు అయిన నిందితుల సంఖ్య 2023 కంటే 2024లో గణనీయంగా పెరిగింది. 2023లో రాష్ట్రవ్యాప్తంగా ఎన్డీపీఎస్ యాక్ట్ కింద నమోదైన కేసుల సంఖ్య 1487గా, అరెస్టు అయిన నిందితుల సంఖ్య 2170గా ఉంది. గత ఏడాది ఇవి 3074, 5205కు పెరిగాయి. 2020–24 మధ్య ఐదేళ్ల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 7131 కేసులు నమోదు కాగా, వీటిలో 23,547 మంది పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో 14,725 మంది మాత్రమే అరెస్టు కాగా, ఇప్పటికీ 8822 మంది పరారీలోనే ఉన్నారు. ఈ వాంటెడ్స్ కోసం టీజీఏఎన్‌బీ, హెచ్–న్యూ, టాస్క్‌ఫోర్స్, ఎస్‌ఓటీలతోపాటు స్థానిక పోలీసులూ గాలిస్తున్నారు.
ఆ ఐదుగురూ అత్యంత కీలకం
రాష్ట్రంలోనే కాదు... దేశ వ్యాప్తంగా వివిధ మెట్రో నగరాల్లో విస్తరించి ఉన్న డ్రగ్ నెట్‌వర్క్‌లో నైజీరియన్లే కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రధాన పెడ్లర్స్, సర్లయర్స్‌లో వీళ్లే ఎక్కువగా ఉంటున్నారు. తెలంగాణకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారిలో ఐదుగురు నైజీరియన్లు కీలకమని టీజీఏఎన్‌బీ గుర్తించింది. వీరిలో డివైన్ ఎబుక సుజీపై ఎనిమిది, పీటర్ న్వాబున్వన్నా ఒకాఫర్, నికోలస్ ఒలుసోలా రోటిమీ, మార్క్ ఒవలబిలపై నాలుగు చొప్పున, అమోబి చుక్వుడి మూనాగోలుపై ఒక కేసు నమోదై ఉన్నాయి. ఈ కేసుల్లో ఆధారాలు లభించడంతో నిందితులుగా చేర్చామని అధికారులు చెప్తున్నారు. 2023–24ల్లో డ్రగ్స్ దందాలో ప్రమేయం ఉందనే ఆరోపణల నేపథ్యంలో సూడాన్, కెన్యా, నైజీరియా, సోమాలియా, టాంజానియా, లైబీరియాలకు చెందిన 11 మందిని పోలీసులు నగరంలో గుర్తించి ఆయా దేశాలకు తిప్పిపంపారు.