
ట్రాఫిక్ పోలీసులను చూసి.. బైక్ వెనక్కి మళ్లించి వెళ్తుండగా ప్రమాదం
ఆర్టీసీ బస్సు కిందపడి వ్యక్తి దుర్మరణం
హైదరాబాద్ : బాలానగర్ డివిజన్ పరిధిలోని ఐడీపీఎల్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ వ్యక్తి తన బైక్‌ను వేగంగా వెనక్కి మళ్లించి వేగంగా వెళ్లే క్రమంలో ఆర్టీసీ బస్సు కింద పడి మృతి చెందిన ఘటన బాలానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది.
సీఐ నరసింహ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. షాపూర్ నగర్‌లో నివసించే జోషిబాబు (35) కార్పెంటర్ పని చేస్తున్నాడు. జీడిమెట్ల నుంచి బాలానగర్ వైపు వస్తున్న క్రమంలో ట్రాఫిక్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. వీరిని చూసి భయపడి తిరిగి వేగంగా వెనక్కి వెళ్లే క్రమంలో తన ద్విచక్ర వాహనం పడిపోయింది. దీంతో అతని తలపై నుంచి ఆర్టీసీ దూసుపోయింది. తల ఛిద్రమై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తమ్ముడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు బాలానగర్ పోలీసులు తెలిపారు.