
అమెరికాలో దందా చేసినా భారత్ ద్వారానే హవాలా
ఏడేళ్లలో నైజీరియాకు రూ.125 కోట్లు అక్రమంగా తరలింపు
ఇద్దరు నైజీరియన్స్, ఒక ఫారెక్స్ ఏజెంట్ అరెస్టు
ముఠా ఆర్థిక మూలాలను దెబ్బ తీస్తేనే డ్రగ్స్ కట్టడి
టీజీఏఎన్‌బీ డైరెక్టర్ సందీప్ శాండిల్య వెల్లడి
సాక్షి, హైదరాబాద్: మన దేశంతోపాటు విదేశాల్లో నిషేధిత మాదకద్రవ్యాల విక్రయం ద్వారా వచ్చిన సొమ్మును గుట్టుచప్పుడు కాకుండా విదేశాలకు తరలిస్తూ మనీలాండరింగ్‌కు పాల్పడుతున్న నైజీరియన్ ముఠా గుట్టును తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీజీఏఎన్‌బీ) పోలీసులు రట్టు చేశారు.
గత ఏడేళ్లలో ఈ ముఠా రూ.125 కోట్లు అక్రమంగా విదేశాలకు తరలించినట్లు గుర్తించారు. ఈ కేసు వివరాలను టీజీఏఎన్‌బీ డైరెక్టర్ సందీప్ శాండిల్య టీజీఏఎన్‌బీ ఎస్పీలు రూపేశ్, రఘువీర్‌తో కలిసి శనివా రం బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ ముఠాలోని ఇద్దరు నైజీరియన్లతోపాటు ఒక ఫారెక్స్ ఏజెంట్‌ను అరెస్టు చేసినట్టు చెప్పారు.
అంతా వాట్సాప్‌లోనే..
బ్లెస్సింగ్ అలియాస్ జో అనే మహిళ హైదరాబాద్‌లోని నైజీరి యన్ డ్రగ్స్ ముఠా కింగ్‌పిన్ ఎబుకా సుజీ సోదరుడు కేలేశీకి ఇచ్చేందుకు ఢిల్లీ నుంచి 200 గ్రాముల కొకైన్ తీసుకువస్తుండగా 2024 జూలైలో టీజీఏఎన్‌బీ అధికారులు పట్టుకున్నారు. ఆమెను విచారించగా ఈ ముఠా డొంకంతా కదిలింది.
⇒ డ్రగ్స్ ఆర్డర్ తీసుకోవడం, డబ్బు అందిన విషయాన్ని నిర్ధారించుకోవడం, ఒక ప్రదేశంలో డ్రగ్స్‌ను వదిలి..వాటి ఫొటో, లొకేషన్‌ను కస్టమర్‌కు చెప్పి.. డ్రగ్స్ వారికి చేరవేయడం వరకు అన్నింటికీ వాట్సాప్‌ను వినియోగిస్తున్నట్టు గుర్తించారు.
⇒ కింగ్‌పిన్ ఎబుకా సుజీ ఆదేశాలతో డ్రగ్స్‌ను స్థానిక కస్టమర్లకు చేర్చడంలో కెలేశీకి ఎమ్మా, బిగ్‌జో సహకరించేవారు. ఎబుకా సుజీ తన డ్రగ్స్ దందాను అమెరికాలోనూ మొదలు పెట్టినట్లు గుర్తించారు.
⇒ యూఎస్ కస్టమర్ల నుంచి డబ్బును నేరుగా తీసుకోకుండా తొలుత ఇండియాకు తరలించి ఇక్కడి నుంచి హవాలా మార్గంలో నైజీరియాకు ఈ ముఠా తరలిస్తోంది. యూఎస్ నుంచి డబ్బును భారత్‌కు చేర్చేందుకు పాత మలక్‌పేటకు చెందిన మహ్మద్ మతీన్ సిద్ధిఖీ అనే పైన్ మల్టీ సర్విసెస్ ప్రొప్రైటర్ సహకారం తీసుకునేవారు.
⇒ మతీన్ తనకున్న పరిచయాలతో గోయమ్ ఫారెక్స్‌కు చెందిన ఆనంద్ జైన్ ద్వారా అమెరికాలోని పలువురు భారతీయుల బ్యాంకు ఖాతాలు సేకరించాడు. డ్రగ్స్ అమ్మగా వచ్చిన సొమ్మును ఆ ఖాతాల్లో వేయించి భారత్‌లోని వారి బంధువుల ద్వారా ఇక్కడ తీసుకునేవారు.
⇒ ఆ డబ్బును ముంబైకి వస్త్ర వ్యాపారం కోసం వచ్చే నైజీరియన్ వ్యాపారులు డానియల్, మాలిక్, స్టాన్లీల ద్వారా నైజీరియాకు తరలించేవారు. ఇలా ప్రతిదశలోనూ ఎవరికి వారు కమీషన్లు తీసుకుంటూ దందా చేస్తున్నారు. ఇలా 40 శాతం వరకు కమీషన్లు తీసుకుని, మిగిలిన మొత్తాన్ని నైజీరియాలోని ఎబుకా సుజీకి చేరవేస్తున్నారు. – ఈ నెల 3న ఏ–1 ఎమ్మా, ఏ–2 బిగ్ జో, ఏ–3 మతీన్ సిద్దిఖీలను అరెస్టు చేశారు. డివైన్ ఎబుకా సుజీ, కేలేశీతోపాటు సయ్యద్ సోహిల్ అబ్దుల్ అజీజ్, సయ్యద్ నసీర్ అహ్మద్, మహ్మద్ అవైజ్, మహ్మద్ మతీన్, సయ్యద్ యూసుఫ్ హక్, ఆనంద్‌జైన్, శాంతిలాల్ సురేశ్‌కుమార్‌జైన్, ఉత్తమ్ జైన్ పరారీలో ఉన్నట్టు అధికారులు తెలిపారు.
ఆర్థిక మూలాలను దెబ్బ తీస్తేనే డ్రగ్స్ కట్టడి
డ్రగ్స్ దందా మొత్తం ఆర్థిక లావాదేవీలతోనే ముడిపడి ఉంది. ఈ ముఠాల ఆర్థిక మూలాలను దెబ్బకొడితేనే డ్రగ్స్ కట్టడి సాధ్యం. డ్రగ్స్ వల్ల భారత యువత బానిసలుగా మారుతున్నారు. చదువుకోసం నైజీరియా సహా పలు దేశాల నుంచి వచ్చే యువత డ్రగ్స్ దందాలోకి దిగి చెడిపోతున్నారు. డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న ధనికులు సైతం డ్రగ్స్ వాడకాన్ని మానుకోవాలి.
టీజీఏఎన్‌బీ సాంకేతికంగా, నైపుణ్యం పరంగా ఎంతో పటిష్టంగా మారింది. డ్రగ్స్ దందా చేసేవారిని వదిలే ప్రసక్తే లేదు. 2020 నుంచి 260 మంది డ్రగ్ పెడ్లర్లను అరెస్టు చేసి జైలుకు పంపాం. విదేశీయులకు ఇల్లు, అపార్టమెంట్లు అద్దెకు ఇచ్చేముందు ఫారినర్స్ రీజినల్ రిజి్రస్టేషన్ ఆఫీసర్స్ (ఎఫ్‌ఆర్‌ఆర్‌ఎ)కు ఫామ్–సీలో, అదేవిధంగా స్థానిక పోలీస్ స్టేషన్‌లో వారి వివరాలు ఇవ్వాలి. – సందీప్ శాండిల్య, టీజీఏఎన్‌బీ డైరెక్టర్.