
పెద్దపల్లి జిల్లాలో పరువు హత్య
రెండేళ్లుగా యువతితో ప్రేమలో సాయికుమార్.. కులాలు వేరు కావడంతో ఒప్పుకోని యువతి తండ్రి
తన కుమార్తెతో మాట్లాడొద్దని హెచ్చరిక.. అయినా ఆమెతో కలిసి బర్త్‌డే జరుపుకోవడంతో ఆగ్రహం
రాత్రికి స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటుండగా వెంటాడి హతమార్చిన వైనం
సాక్షి, పెద్దపల్లి: కుమార్తెను ప్రేమిస్తున్నాడనే కోపంతో ఓ యువకుడిని యువతి తండ్రి కిరాతకంగా హతమార్చిన దారుణ ఘటన గురువారం రాత్రి పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోటలో కలకలం సృష్టించింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పూరెల్ల సాయికుమార్ (20), అదే గ్రామానికి చెందిన ఓ యువతి రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కులాలు వేరుకావడంతో వారి ప్రేమకు యువతి తండ్రి ముత్యం సదయ్య అడ్డుచెప్పాడు. తొమ్మిదో తరగతిలోనే చదువు మానేసిన సాయికుమర్‌ను ఇకపై తన కూతురితో మాట్లాడొద్దని పలుమార్లు హెచ్చరించాడు. అయినా యువతీయువకులు తరచూ మాట్లాడుకోవడంతోపాటు గురువారం ఉదయం కలిసే సాయికుమార్ బర్త్‌డే వేడుకలు జరుపుకున్నారు. ఈ సమాచారం తెలియడంతో రగిలిపోయిన యువతి తండ్రి ముత్యం సదయ్య గురువారం రాత్రి 10 గంటలకు సాయికుమార్‌ను గొడ్డలితో నరికి చంపాడు.
పుట్టినరోజు వేడుకల్లోనే..
పెద్దపల్లిలోని హాస్టల్‌లో ఉంటూ డిగ్రీ సెకండియర్ చదువుతున్న యువతిని సాయికుమార్ గురువారం కలిశాడు. ఆమెతో కలిసి బర్త్‌డే వేడుకలు చేసుకున్నాడు. రాత్రికి గ్రామంలో నలుగురు స్నేహితులు పూరెల్ల అఖిల్, చిలుమల హన్సిక్, కామెర అభిషేక్, చెవుల రాకేశ్‌తో కలిసి కేక్ కట్ చేశాడు. ఆపై స్నేహితులంతా మద్యం తాగేందుకు సిద్ధమయ్యారు. స్నాక్స్ కోసం రాకేశ్, అభిషేక్ కిరాణా దుకాణానికి వెళ్లగా.. అదే సమయంలో అక్కడికి చేరుకున్న యువతి తండ్రి వెంట తెచ్చుకున్న గొడ్డలితో సాయికుమార్‌పై దాడి చేశాడు. సాయికుమార్ ప్రాణభయంతో పరుగులు తీసినా సుమారు 200 మీటర్లు వెంటాడి గొడ్డలితో వేటు వేశాడు. ఈ క్రమంలో స్నేహితుడు అఖిల్ సదయ్యను అడ్డుకొని అతన్నుంచి గొడ్డలిని లాక్కున్నాడు.
రక్తపుమడుగులో సాయికుమార్ కొట్టుమిట్టాడుతుండటంతో సదయ్య అక్కడి నుంచి నుంచి పారిపోయాడు. దాడి విషయాన్ని స్నేహితులు సాయికుమార్ తండ్రి పర్శరాములుకు తెలియజేశారు. కుటుంబ సభ్యులతో కలిసి సాయికుమార్‌ను సుల్తానాబాద్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. శుక్రవారం పోస్ట్‌మార్టం అనంతరం ముప్పిరితోటలో అంత్యక్రియలు నిర్వహించారు. పర్శరాములు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సదయ్య కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. అయితే నిందితుడు జూలిపల్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడని సమాచారం. సదయ్యగా భావిస్తున్న వ్యక్తి పోలీసుల అదుపులో ఉన్నట్లు ఓ వీడియో క్లిప్ వైరల్‌గా మారింది.
వెంటాడిన మృత్యువు..
గురువారం తెల్లవారుజామున బాబాయ్ భరత్‌కు కిడ్నీలో నొప్పి వస్తోందని చెప్పడంతో సాయికుమార్ ఆయన్ను తీసుకొని కారులో కరీంనగర్ ఆస్పత్రికి బయల్దేరాడు. మార్గమధ్యలో దుబ్బపల్లి వద్ద కారు బోల్తాపడి రెండు పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో భరత్‌కు స్వల్ప గాయాలవగా సాయికుమార్ సురక్షితంగా బయటపడ్డాడు. కానీ రాత్రికి మాత్రం దారుణ హత్యకు గురయ్యాడు. సాయికుమార్ చెల్లెలు 2016లో డెంగీతో మరణించగా ప్రస్తుతం కొడుకు సైతం మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
పథకం ప్రకారమే హత్య..
నా కొడుకు, ఆ యువతి రెండేళ్లుగా ప్రే మించుకుంటున్నారు. దీంతో మాకు టుంబాల మధ్య గొడవలయ్యాయి. నా కొడుకును చంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసి గతేడాది ఆగస్టు 23న పోలీసులకు ఫిర్యాదు చేశా. యువతి తల్లితో హరీశ్ అనే వ్యక్తి వివాహేతర సంబంధం కొనసాగిస్తుండటాన్ని నా కొడుకు చూశాడు. ఇది అందరికీ చెబుతా డనే భయంతో హరీశ్, యువతి తల్లిదండ్రులతో కలిసి చంపినట్లు అనుమానంగా ఉంది. – పర్శరాములు, మృతుడి తండ్రి