
కారు ఢీకొని ఇద్దరు మహిళల దుర్మరణం; మరో ఇద్దరికి గాయాలు
పెద్దపల్లి రూరల్: కూలీ పనులు చేస్తూ పొట్టపోసుకునే ఇద్దరు అభాగ్యులను కారు రూపంలో వచ్చిన మృత్యువు కబళించింది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రంగంపల్లి శివారులో మంగళవారం వేకువజామున ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. రంగంపల్లిలోని ఓ ఫంక్షన్ హాల్‌కు సోమవారం రాత్రి ఓ విందు పనికి వెళ్లిన కుక్క భాగ్య (46), కుక్క అమృత (48), కుక్క పద్మ, కుక్క కాంత పని ముగించుకుని మంగళవారం వేకువజామున తమ ఇళ్లకు బయలుదేరారు.
కాలినడకన రాజీవ్ రహదారి పక్కనుంచి వస్తుండగా వేగంగా వచ్చిన కారు వారిని ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భాగ్య, అమృత ఘటనా స్థలంలోనే చనిపోయారు. తీవ్రంగా గాయపడిన పద్మ పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. కాంత గాయాలతో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. వీరంతా పెద్దపల్లి ఉదయ్‌నగర్‌కు చెందిన పాలెవాళ్లుగా పోలీసులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
భాగ్యకు నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. వారిలో ముగ్గురికి వివాహమవగా, దివ్యాంగురాలైన మరో కూతురు నవ్య ఇంటి వద్దే ఉంటోంది. భర్త కనకయ్య హమాలీగా పనిచేస్తున్నాడు. అమృత భర్త నర్సయ్య కూడా హమాలీగా పనిచేస్తున్నాడు. వారికి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. ఘటనా స్థలాన్ని ఏసీసీ గజ్జి కృష్ణ, సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సై లక్ష్మణ్‌కుమార్ సందర్శించారు.