
బియ్యపు గింజపై రామాష్టకం
కొత్తపేట: స్థానిక కమ్మిరెడ్డిపాలెం ప్రాంతానికి చెందిన పెద్దింటి కృష్ణవంశీ బియ్యం గింజలపై శ్రీరామ అష్టకం లిఖించి తన భక్తిని చాటుకున్నాడు. గతంలో బియ్యం గింజలపై వందేమాతరం, విద్యుత్ బల్బులో బొమ్మలు, వాటర్ బాటిల్‌లో అగ్గిపెట్టెలు అమర్చడం వంటి వివిధ ప్రయోగాలు చేసి కృష్ణవంశీ 20 ప్రపంచ రికార్డులు సాధించాడు. తాజాగా ఆదివారం శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీరామ అష్టకాన్ని 151 బియ్యం గింజలపై రాసాడు. అతనిని పలువురు స్థానికులు అభినందించారు.
8 నుంచి ఇండో – అమెరికా సైనిక విన్యాసాలు
కాకినాడ రూరల్: భారత్ – అమెరికా దేశాల సైనిక దళాల సంయుక్త విన్యాసాలకు కాకినాడ సాగర తీరం మరోసారి వేదిక కానున్నది. ఇరు దేశాల మధ్య సైనిక సహకారం, పరసర్ప నైపుణ్యం పెంపొందించుకునే లక్ష్యంతో టైగర్ ట్రయాంఫ్–2025 పేరిట 13 రోజుల పాటు ఈ విన్యాసాలు జరగనున్నాయి. ఈ నెల 1న విశాఖ సాగర తీరంలో ఈ విన్యాసాలు ప్రారంభమయ్యాయి. దీనికి కొనసాగింపుగా ఈ నెల 8 నుంచి కాకినాడ తీరంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. విన్యాసాలు ఈ నెల 13న కాకినాడలో ముగియనున్నాయి. తూర్పు నౌకాదళంతో పాటు ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ బలగాలు, అమెరికా సైనిక దళాలు ఈ విన్యాసాల్లో పాల్గొంటున్నాయి. కాకినాడ సూర్యారావుపేటలోని నేవల్ ఎన్‌క్లేవ్ వద్ద ఇరు దేశాల ఉమ్మడి విన్యాసాల నిర్వహణకు చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే విశాఖ నుంచి వచ్చిన నావికా దళాలు గుడారాలు ఏర్పాటు చేసుకుని తమ పనిలో నిమగ్నమయ్యాయి. ప్రస్తుతం తూర్పు నౌకాదళ పరిధిలోని విశాఖ, కాకినాడ తీర ప్రాంతంలోని సముద్ర జలాల్లో ఐఎన్‌ఎస్ జలాశ్వ, యూఎస్‌ఎస్ కామ్‌స్టాక్ ద్వారా ఇండో, అమెరికా నావికా దళాలు విన్యాసాలు కొనసాగిస్తున్నాయి.
కిటకిటలాడిన శృంగార
వల్లభుని ఆలయం
పెద్దాపురం: వేలాదిగా తరలి వచ్చిన భక్తులతో తొలి తిరుపతి గ్రామంలో స్వయంభువుగా వెలసిన శృంగార వల్లభస్వామి ఆలయం శనివారం కిటకిటలాడింది. సుమారు 30 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామిని అర్చకులు పెద్దింటి నారాయణాచార్యులు, పురుషోత్తమాచార్యులు విశేషంగా అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ సేవల ద్వారా రూ.3,25,934 ఆదాయం సమకూరిందని ఈఓ వడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఐదు వేల మంది భక్తులకు ప్రసాద వితరణ, అన్నదానం ఏర్పాటు చేశామన్నారు.

బియ్యపు గింజపై రామాష్టకం