
ఫ్లైఓవర్ నిర్మాణం వేగవంతం చేయాలి
అమలాపురం రూరల్: ఇటీవల నిలిచిపోయిన జొన్నాడ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ సృష్టి కాంట్రాక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో మంగళవారం జాతీయ రహదారుల అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు, గకాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించారు. రిటైనింగ్ వాల్, అప్రోచ్ రోడ్లు, మడికి, చొప్పెల్ల, చెముడు లంక వద్ద సర్వీస్ రోడ్ల నిర్మాణంపై సమీక్షించారు. పాసర్లపూడి – మామిడికుదురు బైపాస్ రోడ్డు నిర్మాణ పనులపై మాట్లాడారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రిటైనింగ్ వాల్‌ను మట్టితో నింపుతూ పటిష్ట పరచాలని, దానికి సమాంతరంగా గడ్డర్ల కాస్టింగ్, అప్రోచ్ సర్వీస్ రోడ్లు నిర్మాణాలను చేపడుతూ ఒప్పందం మేరకు సెప్టెంబర్ నాటికి నిర్మాణ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. పాసర్లపూడి – మామిడికుదురు బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు, భూసేకరణ పనులు చేపట్టాలని ఇంజినీర్లను ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నిషాంతి, డీఆర్‌ఓ రాజకుమారి, ఆర్డీవో కె.మాధవి, జాతీయ రహదారులు అథారిటీ ఆఫ్ ఇండియా పథక సంచాలకులు సురేంద్రనాథ్, జాతీయ రహదారులు 216 సహాయ ఇంజినీర్ వెంకట రమణ, సృష్టి కాంట్రాక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కాంట్రాక్టర్ రామకృష్ణ, ల్యాండ్ సెక్షన్ సూపరింటెండెంట్ ఏసుబాబు పాల్గొన్నారు.
భూ సమస్యలను పరిష్కరించాలి
రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన భూ సమస్యలను దరఖాస్తుదారుడు నూరు శాతం సంతృప్తి చెందేలా పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశించారు. ప్రభుత్వ భూముల ఆక్రమణ రక్షణ, భూముల తొలగింపు, పీజీఆర్‌ఎస్ దరఖాస్తుల పెండింగ్, మూడు కేటగిరీలలో భూముల క్రమబద్ధీకరణ, నీటి తీరువా వసూలుపై రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి, భూపరిపాలన ముఖ్య కమిషనర్ జయలక్ష్మి.. జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమం అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వంతులవారీ విధానాల ద్వారా రబీలో సాగునీటి వినియోగాన్ని గరిష్టతరం చేస్తూ, నిర్దేశిత ఆయకట్టులో ఏ ఒక్క ఎకరం ఎండిపోకుండా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి, డీఆర్వో రాజకుమారి, ఆర్డీవో కె.మాధవి, ఎస్‌డీసీ కృష్ణమూర్తి, డీటీ శివరాజ్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ మహేష్ కుమార్
రోడ్ల పనులపై సమీక్ష
క్రీడల్లో ప్రతిభ చాటాలి
క్రీడలపై ఆసక్తిని కనబరుస్తూ ప్రతిభను చాటాలని ఇంజినీర్లకు కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ సూచించారు. జిల్లా స్థాయిలో ఇంజినీరింగ్ అసిస్టెంట్లకు డీమ్స్ 2కే 25 పేరిట స్పోర్డ్స్ మీట్ నిర్వహించారు. ఆ విజేతలకు అమలాపురం మండలం నడిపూడి బాబూ జగ్జీవన్‌రామ్ కమ్యూనిటీ హాలులో బహుమతులు అందించారు. కలెక్టర్ మహేష్ కుమార్, జిల్లా పంచాయతీరాజ్ పీఆర్‌ఎస్‌ఈ రామకృష్ణారెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. పంచాయతీరాజ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అన్యంరాంబాబు మాట్లాడుతూ ఇంజినీరింగ్ అసిస్టెంట్లు సహాయ ఇంజినీర్లుగా పదోన్నతి పొందడానికి డిప్లొమా ఇంజినీర్స్ అసోసియేషన్ తరఫున కృషి చేస్తానన్నారు. పీఆర్ డీఈఈ పీఎస్ రాజకుమార్, గ్రామీణ నీటి సరఫరా పారిశుధ్య విభాగం కార్యనిర్వాహక ఇంజినీరింగ్ సీహెచ్ ఎన్వీ కృష్ణారెడ్డి, ఇంజినీరింగ్ అసిస్టెంట్ల జిల్లా అధ్యక్షుడు కాళే సురేష్, కార్యదర్శి సెలంరాజు తదితరులు పాల్గొన్నారు.