Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Chandrababu TDP coalition govt Fake Case On Sakshi Editor Dhanunjay Reddy1
పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు

సాక్షి, అమరావతి: చంద్రబాబు రెడ్‌బుక్‌ అరాచకాలను వెలుగులోకి తెస్తున్న ‘సాక్షి’ పత్రికపై టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు తెగబడుతోంది. నిజాన్ని నిర్భయంగా ఎత్తి చూపడంతో భరించలేక తప్పుడు కేసులకు ఒడిగడుతూ కుట్ర రాజకీయాలు చేస్తోంది. పల్నాడు జిల్లాలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తను టీడీపీ గూండాలు హత్య చేసిన ఉదంతాన్ని వెల్లడించడంపై అక్రమ కేసు నమోదు చేయించడమే ఇందుకు నిదర్శనం. సాక్షి పత్రికపై మాచర్ల టీడీపీ మండలాధ్యక్షుడు ఎన్‌.వీరస్వామి అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే ఆనంద్‌­బాబు, ఇతర టీడీపీ నేతలు మంగళవారం సాయంత్రం ఇక్కడ డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఆ వెంటనే డీజీపీ స్పందించి పల్నాడు జిల్లా ఎస్పీని ఆదేశించడం.. వెనువెంటనే రాత్రికి రాత్రే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం అంతా పక్కా పన్నాగంతో చకచకా సాగిపోయింది. దీంతో సాక్షి పత్రిక ఎడిటర్‌ ఆర్‌.ధనుంజయ్‌రెడ్డితోపాటు ఇదే పత్రికకు చెందిన ఆరుగురు పాత్రికేయులపై బీఎన్‌ఎస్‌ సెక్షన్లు 196(1), 352, 353,(2), 61(1) రెడ్‌విత్‌ 3(5) కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఈ అక్రమ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పింఛన్‌ కోసం వస్తే కడతేర్చారన్నది వాస్తవంపల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని పశువేములకు చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త హరిశ్చంద్ర టీడీపీ గుండాలకు భయపడి కుటుంబంతో సహా పొరుగున తెలంగాణలోని నల్కొండ జిల్లా కనగల్‌లో పది నెలలుగా తల దాచుకుంటున్నారు. ప్రతి నెల పింఛన్‌ తీసుకునేందుకు వచ్చి వెంటనే వెళ్లిపోతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన టీడీపీ వర్గీయులు పక్కా పన్నాగంతో ఆయన్ను హత్య చేశారు. ఏప్రిల్‌ నెల ఫించన్‌ తీసుకునేందుకు ఈ నెల 3న రాష్ట్ర సరిహద్దుల్లోని నాగార్జునసాగర్‌ హిల్‌ కాలనీ వద్దకు వచ్చి.. తమ గ్రామం పశువేములకు చెందిన ఒకరికి ఫోన్‌ చేశారు. సామాజిక పింఛన్లు ఇస్తున్నారా.. లేదా.. అని అడిగారు. అతను ఆ విషయాన్ని టీడీపీ వర్గీయులకు చేరవేశాడు. వెంటనే టీడీపీ గూండాలు వచ్చి హిల్‌ కాలనీలో ఉన్న హరిశ్చంద్రను కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లారు. అనంతరం ఆయనపై దాడి చేసి, హత్య చేసి.. మృతదేహాన్ని పశువేములలోని ఆయన పొలంలోనే పడేశారు. హరిశ్చంద్ర భార్య నిర్మల తన భర్తను కిడ్నాప్‌ చేశారని తెలంగాణలోని విజయపురి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు.. పశువేములలో దారుణ హత్యకు గురైన హరిశ్చంద్ర మృతదేహాన్ని ఈనెల 4న గుర్తించారు. కర్రలతో కొట్టి.. గొంతుకోసి.. ముఖంపై యాసిడ్‌ పోసి మరీ దారుణంగా హత మార్చినట్టు నాగార్జున సాగర్‌ పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. హిల్‌ కాలనీలోని ఓ దుకాణం వద్ద ఉన్న సీసీ టీవీ కెమెరాల నుంచి పుటేజీ సేకరించారు. హరిశ్చంద్రను కిడ్నాప్‌ చేసి తీసుకువెళుతున్న దృశ్యాలు అందులో స్పష్టంగా కనిపించాయి.పూర్తి అవగాహనతోనే వార్త ప్రచురితంహరిశ్చంద్ర హత్య సమాచారం తెలియగానే ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు. తమపై టీడీపీ గూండాలు కక్ష కట్టిన తీరును హరిశ్చంద్ర భార్య నిర్మల, కుమారుడు మురళి వివరించారు. ఇది టీడీపీ గూండాల పనేనని కన్నీటి పర్యంతమయ్యారు. పల్నాడు జిల్లాలో నెలకొన్న పరిస్థితులు క్షణ్ణంగా తెలుసుకుని పూర్తి వివరాలతో సాక్షి పత్రిక ఏపీ ఎడిషన్‌లో వార్తను ప్రచురించింది. తెలంగాణలోని విజయపురి పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కేసు వివరాలతోపాటు మృతుని కుటుంబ సభ్యుల ఆవేదన, పశువేములలోని నెలకొన్న వాస్తవ పరిస్థితులను సమగ్రంగా వివరించింది. కాగా, తెలంగాణలో పాత్రికేయులు కేవలం అక్కడి పోలీసులు తెలిపిన ప్రాథమిక సమాచారాన్ని మాత్రమే వార్తగా ఇచ్చారు. హరిశ్చంద్రను సమీప బంధువులే హత్య చేశారని సాక్షి పత్రిక ఏపీ ఎడిషన్‌లోనూ, తెలంగాణ ఎడిషన్‌లోనూ ప్రచురించింది. కాగా, ఆ సమీప బంధువులు టీడీపీ గూండాలేనన్నది ఏపీలోని పాత్రికేయులకు పూర్తి సమాచారం, అవగాహన ఉంది కాబట్టి మరింత సమగ్రంగా వార్తను ప్రచురించారు. అంతేతప్ప సాక్షి పత్రిక ఏపీ, తెలంగాణ ఎడిషన్లలో ప్రచురితమైన వార్తలోని అంశాల మధ్య వ్యత్యాసం లేదు. ఈ హత్యపై తెలంగాణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఏ ఎండకాగొడుకు పచ్చ ముఠా నిర్వాకమే ప్రజల్ని మోసగించేందుకు పరస్పర విరుద్ధ వాదనలు, కథనాలు, పత్రికా ప్రకటనలు ఇవ్వడం పచ్చ ముఠా పన్నాగం. ఏపీ, తెలంగాణ ఎడిషన్లలో పరస్పర విరుద్ధంగా ఈనాడుతోపాటు ఎల్లో మీడియా లెక్కకు మించి కథనాలు ప్రచురించిన విషయాన్ని పాత్రికేయ సంఘాలు గుర్తు చేస్తున్నాయి. టీడీపీ.. ప్రజల్ని మోసగించేందుకు ఏపీలోనే ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో పరస్పర విరుద్ధంగా పత్రికా ప్రకటనలు జారీ చేసిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఎన్నికల ముందు టీడీపీ, ఈనాడుతోపాటు ఇతరత్రా ఎల్లో మీడియాలో ఇచ్చిన ప్రకటనలే అందుకు నిదర్శనం. ‘కలల రాజధాని అమరావతి’అని విజయవాడ ఎడిషన్‌లో ప్రకటనలు ఇచ్చిన టీడీపీ.. అదే రోజు విశాఖపట్నం ఎడిషన్‌లో మాత్రం ‘ఆంధ్రప్రదేశ్‌ వికాసానికి గ్యారంటీ’ అని ప్రకటనలు జారీ చేయడం గమనార్హం. టీడీపీ, ఎల్లో మీడియా కుయుక్తులకు ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలుగా ఉన్నాయి.

Ys Jagan Tweet On Chandrababu Negligence Over Aqua Farmers Problems2
పబ్లిసిటీ కాదు బాబూ.. మేలు ముఖ్యం: వైఎస్‌ జగన్‌ ట్వీట్

సాక్షి, తాడేపల్లి: ఆక్వా రైతుల సమస్యల పట్ల సీఎం చంద్రబాబు నిర్లక్ష్యంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి మండిపడ్డారు. ‘‘చంద్రబాబూ.. ఆక్వా రైతుల కష్టాలపై మా పార్టీ నాయకుల ఆందోళన, నా ట్వీట్‌ తర్వాత ఎట్టకేలకు మీరు ఒక సమావేశం పెట్టినందుకు ధన్యవాదాలు. కాని, మీరు పెట్టిన సమావేశం ఫలితాలు క్షేత్రస్థాయిలో ఎక్కడా కూడా కనిపించడం లేదని ఆయా జిల్లాలకు చెందిన నాయకులు నా దృష్టికి తీసుకు వచ్చారు. మీ సమావేశాలు, మీరు చేస్తున్న ప్రకటనలు ప్రచారం కోసం కాకుండా ఆక్వా రైతులకు నిజంగా మేలు చేసేలా ఉండాలి’’ అంటూ వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.‘‘ఆక్వా రైతుల పెట్టుబడిలో రొయ్యలకు వేసే మేత ప్రధానమైనది. గతంలో ఈ ఫీడ్‌పై 15 శాతం సుంకం విధించినప్పుడు కంపెనీలన్నీ కిలోకు రూ.6.50లు చొప్పున పెంచారు. ఫీడ్‌ తయారు చేసే ముడిసరుకులపై ఇప్పుడు సుంకం 15 శాతం నుంచి 5 శాతంకి తగ్గింది. అలాగే సోయాబీన్‌ రేటు కిలోకు గతంలో రూ.105లు ఉంటే ఇప్పుడు రూ.25లకు పడిపోయింది. మరి ముడిసరుకుల రేట్లు ఇలా పడిపోయినప్పుడు ఫీడ్‌ రేట్లు కూడా తగ్గాలి కదా? ఎందుకు తగ్గడంలేదు? ఈ దిశగా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?’’ అని వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు.‘‘అమెరికాకు ఎగుమతయ్యే రొయ్యలన్నీకూడా 50 కౌంట్‌ లోపువే. అమెరికాకూడా మన దేశంపై విధించిన టారిఫ్‌లను 90 రోజులపాటు వాయిదా వేసిన నేపథ్యంలో ఈ మేరకు ధరలు పెరగాలి కదా? ఎందుకు పెరగడంలేదు? టారిఫ్‌ సమస్యతో సంబంధం లేని యూరప్‌ దేశాలకు 100 కౌంట్ రొయ్యలు ఎగుమతి అవుతాయి. వీటి రేటుకూడా పెరగడంలేదు. ప్రభుత్వం నిర్ణయించిన రూ.220ల రేటు కూడా రైతులకు రావడంలేదు. 100 కౌంట్‌ రొయ్యలకు రూ.270ల రేటు వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి..మా ప్రభుత్వం హయాంలో ఆంధ్రప్రదేశ్‌ ఆక్వాకల్చర్‌ డెవలప్‌మెంట్ అథారిటీ కింద ఎంపెవరింగ్‌ కమిటీ ఉండేది. ఈ కమిటీ ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తూ రైతులకు అండగా నిలిచేది. ఇలాంటి వ్యవస్థలను ఇప్పుడు అచేతనంగా మార్చేశారు. వెంటనే దీన్ని పునరుద్ధరిస్తూ రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలి’’ అని వైఎస్‌ జగన్‌ డిమాండ్‌ చేశారు. 1. @ncbn గారూ.. ఆక్వా రైతుల కష్టాలపై మా పార్టీ నాయకుల ఆందోళన, నా ట్వీట్‌ తర్వాత ఎట్టకేలకు మీరు ఒక సమావేశం పెట్టినందుకు ధన్యవాదాలు. కాని, మీరు పెట్టిన సమావేశం ఫలితాలు క్షేత్రస్థాయిలో ఎక్కడా కూడా కనిపించడం లేదని ఆయా జిల్లాలకు చెందిన నాయకులు నా దృష్టికి తీసుకు వచ్చారు. మీ సమావేశాలు,…— YS Jagan Mohan Reddy (@ysjagan) April 10, 2025

AP High Court Fires On Police Department For Fake Cases3
హైకోర్టన్నా లెక్కలేదా? ఇది ధిక్కారమే

హైకోర్టు ఆదేశాలంటే పోలీసులకు లెక్కే లేకుండా పోయింది. సెక్షన్‌ 111ను ఎప్పుడు, ఎలాంటి సందర్భాల్లో వాడాలో స్పష్టంగా చెప్పాం. అయినా ఉద్దేశపూర్వకంగా ఆ సెక్షన్‌ కింద కేసులు నమోదు చేయడమంటే మా ఆదేశాలను ధిక్కరిస్తున్నట్లే. ఎప్పుడో నమోదు చేసిన కేసులో మీ ఇష్టం వచ్చినట్లు ఇప్పుడు అదనపు సెక్షన్లు ఎలా చేరుస్తారు? అంటే ఉద్దేశపూర్వకంగా చేస్తున్నట్లు కాదా? ఇది ఎంత మాత్రం ఆమో­దయోగ్యం కాదు. సూళ్లూరు­పేట ఇన్‌స్పెక్టర్‌ చర్యలు న్యాయ వ్యవస్థను తక్కువ చేసి చూపేలా ఉన్నాయి. దీన్ని మేం తీవ్రంగా పరిగణిస్తూ ఆ ఇన్‌స్పెక్టర్‌కు కోర్టు ధిక్కార చట్టం కింద ఫాం 1 నోటీసు జారీ చేస్తున్నాం. – హైకోర్టు న్యాయమూర్తి సాక్షి, అమరావతి: సోషల్‌ మీడియా పోస్టులను వ్యవస్థీకృత నేరంగా పరిగణిస్తూ బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 111 కింద అడ్డగోలుగా కేసులు పెడుతున్న పోలీసులపై హైకోర్టు మరోమారు నిప్పులు చెరిగింది. పోలీసుల చర్యలు కోర్టు ధిక్కారం కిందకు వస్తాయని తేల్చి చెప్పింది. కోర్టులన్నా.. కోర్టులిచ్చి­న ఆదేశాలన్నా పోలీసులకు లెక్కేలేదంటూ తీవ్రంగా ఆక్షేపించింది. కోర్టు అధికారాన్ని, న్యాయ పాల­నను పోలీసులు సవాలు చేస్తున్నారంది. పరిధి దాటి వ్యవహరిస్తున్నారని మండిపడింది. తమ ఆదేశాలున్నా కూడా సినీ నటుడు పోసాని కృష్ణ మురళిపై పోలీసులు అదనపు సెక్షన్ల కింద కేసు పెట్టడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని స్పష్టం చేసింది. సెక్షన్‌ 111ను చాలా అరుదుగానే ఉపయోగించాలని, అవసరమైన సందర్భాల్లో మాత్రమే దానిని ఉప­యోగించాలని తాము గతంలో ఓ కేసులో ఇచ్చిన తీర్పులో చాలా స్పష్టంగా చెప్పామంది. అయినా కూడా పోలీసులు సెక్షన్‌ 111 కింద కేసులు పెడుతూనే ఉన్నారంటూ ఆక్షేపించింది. ఇలా ఉద్దేశ పూర్వకంగా చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. పోసాని కృష్ణ మురళిపై తమ ఆదేశాలకు విరుద్ధంగా అదనపు సెక్షన్లు చేర్చడాన్ని తప్పు పట్టింది. తిరుపతి జిల్లా సూళ్లూరు­పేట ఇన్‌స్పెక్టర్‌ మురళీకృష్ణ ఉద్దేశ పూర్వకంగానే ఇలా చేశారంది. తద్వారా ఆయన పరిధి దాటి వ్యవహరించారని తేల్చింది. మురళీకృష్ణ చర్య­లు కోర్టు ధిక్కారమేనని తెలిపింది. ఇందుకు గాను ఎందుకు చర్యలు తీసుకోరాదో స్వయంగా తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని మురళీకృష్ణను హైకోర్టు ఆదేశించింది. పోసానిపై సూళ్లూరుపేట పోలీసులు నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నీ నిలిపేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ నూనెపల్లి హరినాథ్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. బీఆర్‌ నాయుడిని తిట్టారంటూ ఫిర్యాదు టీటీడీ చైర్మన్, టీవీ 5 యజమాని బొల్లినేని రాజగోపాల్‌ నాయుడుని పోసాని కృష్ణ మురళి దూషించారని, వాటిని సోషల్‌ మీడియాలో వ్యాప్తి చేశారంటూ టీవీ 5 ఉద్యోగి బొజ్జా సుధాకర్‌ గత ఏడాది నవంబర్‌ 14న సూళ్లూరుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పోసాని కృష్ణమురళిపై కేసు నమోదు చేశారు. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లన్నీ కూడా ఏడేళ్ల కన్నా తక్కువ శిక్ష పడేవే కావడంతో, పోసానికి బీఎన్‌ఎస్‌ఎస్‌ సెక్షన్‌ 35(3) నోటీసు ఇచ్చి, వివరణ తీసుకోవాలని సూళ్లూరు­పేట పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఇదిలా ఉంటే సూళ్లూరుపేట ఇన్‌స్పెక్టర్‌ మురళీకృష్ణ ఈ నెల 7న పోసాని కృష్ణమురళికి సెక్షన్‌ 35(3) కింద నోటీసులు జారీ చేశారు. అయితే ఈ నోటీసుల్లో గతంలో నమోదు చేసిన సెక్షన్నే కాకుండా బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 111తో పాటు పలు ఇతర సెక్షన్లను కూడా జత చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నింటినీ కొట్టేయాలంటూ పోసాని హై­కోర్టును ఆశ్ర­యించారు. ఈ వ్యా­జ్యంపై గురువారం న్యాయ­మూర్తి జస్టిస్‌ హరినాథ్‌ విచారణ జరిపారు.పోలీసుల చర్యలు న్యాయ వ్యవస్థను తక్కువ చేస్తున్నాయి..ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, పోలీసుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ‘సెక్షన్‌ 111ను దురుద్దేశ పూర్వకంగా, ఎలాపడితే అలా వాడటానికి వీల్లేదని ఇదే హైకోర్టు ఇప్పటికే పప్పుల చలమారెడ్డి కేసులో చాలా స్పష్టంగా చెప్పింది. సెక్షన్‌ 111ను ఏ సందర్భాల్లో వాడాలో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే పోసాని కృష్ణమురళిపై గతంలో నమోదు చేసిన కేసులో తాజాగా జారీ చేసిన నోటీసులో అదనపు సెక్షన్లు చేర్చడం, అందులోనూ సెక్షన్‌ 111ను చేర్చడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. ఇన్‌స్పెక్టర్‌ చర్యలు కోర్టు ఆదేశాలను అణగదొక్కే విధంగా ఉన్నాయి. అంతేకాక కోర్టు ఆదేశాలను సైతం ఇన్‌స్పెక్టర్‌ అతిక్రమించారు. అతని చర్యలు న్యాయ వ్యవస్థను తక్కువ చేసేలా కూడా ఉన్నాయి. కేసు దర్యాప్తు విషయంలో పోలీసులు ఏ విధంగా వ్యవహరించాలన్న దానిపై అర్నేష్‌ కుమార్‌ కేసులో సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ మార్గదర్శకాలకు విరుద్ధంగా పోసానికి జారీ చేసిన నోటీసుల్లో అదనపు సెక్షన్లు చేర్చారు. ఉద్దేశ పూర్వకంగానే ఇలా చేశారు. అందువల్ల ఇన్‌స్పెక్టర్‌కు కోర్టు ధిక్కార చట్టం కింద ఫాం 1 నోటీసు జారీ చేస్తున్నాం’ అని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నెల 25న స్వయంగా తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఇన్‌స్పెక్టర్‌ను ఆదేశించారు. తదుపరి విచారణను ఈ నెల 25కి వాయిదా వేశారు.ఇప్పుడు అదనపు సెక్షన్లు విస్మయకరంపిటిషనర్‌ తరఫు న్యాయవాది పాపిడిప్పు శశిధర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, గతంలో సెక్షన్‌ 35(3) కింద నోటీసులిచ్చి, వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించిందన్నారు. ఆ ఆదేశాలకు అనుగుణంగా సెక్షన్‌ 35(3) కింద పోసానికి నోటీసులు జారీ చేశారని, అయితే విస్మయకరంగా ఆ నోటీసుల్లో పలు అదనపు సెక్షన్లను జత చేశారని చెప్పారు. మహిళలను కించ పరిచారంటూ కూడా కేసు పెట్టారన్నారు. టీటీడీ చైర్మన్‌ను దూషించారంటూనే మహిళలకు ఉద్దేశించిన చట్టం కింద కేసు నమోదు చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పోలీసుల తరఫున అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (ఏపీపీ) సాయిరోహిత్‌ వాదనలు వినిపిస్తూ, హైకోర్టు ఆదేశాల మేరకు పోసానికి సెక్షన్‌ 35(3) కింద నోటీసులు ఇచ్చామన్నారు. అదనపు సెక్షన్ల నమోదు వెనుక ఎలాంటి దురుద్దేశాలు లేవన్నారు. దీనిపై పూర్తి వివరాలు సమరి్పంచేందుకు కొంత సమయం ఇవ్వాలని కోరారు.

CM Revanth Reddy at inauguration of Young India Police School4
యంగ్‌ ఇండియా నా బ్రాండ్‌: సీఎం రేవంత్‌

సాక్షి, హైదరాబాద్‌: ‘గతంలో ప్రధాన మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారికి ఒక్కొక్కరికి ఒక్కో బ్రాండ్‌ ఉందని, అధికారంలోకి వచ్చి 16 నెలలైనా ఏ బ్రాండ్‌ సృష్టించుకోలేదని కొందరు అంటున్నారు. విమర్శకులకు నా సమాధానం ఇదే..నా బ్రాండ్‌ యంగ్‌ ఇండియా..మహాత్మాగాంధీ స్ఫూర్తితో యంగ్‌ ఇండియా బ్రాండ్‌ను తెలంగాణలో క్రియేట్‌ చేసుకున్నాం. ఎడ్యుకేషన్, ఎంప్లాయ్‌మెంట్‌ అనేది మా బ్రాండ్‌. విద్య, వైద్యం, ఉపాధికే మా ప్రాధాన్యం..’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో నిర్మించిన యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించారు. రూ.100 కోట్లతో కార్పస్‌ ఫండ్‌ ‘దేశ భవిష్యత్‌ తరగతి గదుల్లోనే ఉందని నేను విశ్వసిస్తా. నిత్యం విధుల్లో ఉండే పోలీసులు వారి పిల్లల చదువుల విషయంలో ఆందోళనతో ఉండొద్దన్న ఉద్దేశంతోనే యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌ ఏర్పాటు చేశాం. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చాం. సైనిక్‌ స్కూల్‌కు దీటుగా పోలీస్‌ స్కూల్‌ను తీర్చిదిద్దాలి. పోలీసు స్కూల్‌లో చదివామన్న ఒక బ్రాండ్‌ను క్రియేట్‌ చేసేలా తయారు చేయాలి. కావాల్సిన నిధులు, అనుమతులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కేజీ నుంచి పీజీ వరకు తీర్చిదిద్దుకోండి. హైదరాబాద్‌ చుట్టుపక్కల ఉన్న ఎన్నో కంపెనీలకు పోలీసులు రక్షణ కల్పిస్తున్నారు. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కింద కొన్ని నిధులను అందించాల్సిన బాధ్యత ఆ సంస్థలకు ఉంది. పోలీస్‌ స్కూల్‌ కోసం రూ.100 కోట్లతో కార్ఫస్‌ ఫండ్‌ ఏర్పాటు చేసుకోవాలని డీజీపీని ఆదేశిస్తున్నా. ఇందుకు అవసరమైన అనుమతులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది..’ అని సీఎం చెప్పారు. రైతు బాంధవుడిగా వైఎస్సార్‌ ఎప్పటికీ గుర్తుంటారు.. ‘దేశ చరిత్రలో ఎంతోమంది ప్రధానులు, ముఖ్యమంత్రులు అయ్యారు. కానీ అందులో కొద్దిమంది మాత్రమే చరిత్రలో గుర్తుండిపోయారు. ఆ కొద్దిమంది తీసుకున్న నిర్ణయాలు చరిత్రను మలుపు తిప్పాయి. జలయజ్ఞం, వ్యవసాయాన్ని ప్రాధాన్యతగా తీసుకుని ఉచిత కరెంటు ఇవ్వడం, సాగునీటి ప్రాజెక్టులు నిర్మించడం మొదలు రైతుల సమస్యలను చర్చించినప్పుడు రైతు బాంధవుడిగా డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి గుర్తుకు వస్తారు. రూ.2 కిలో బియ్యంతో ఎన్టీఆర్‌ ప్రతి పేదవాడి మనసులో స్థానం సంపాదించుకున్నారు. చంద్రబాబు హైదరాబాద్‌లో ఐటీని అభివృద్ధి చేశారు. సంస్కరణలతో భారతదేశాన్ని ప్రపంచంతో పోటీపడే స్థాయిలో నిలిపిన ఘనత తెలంగాణ బిడ్డ పీవీ నర్సింహారావుది. ఆనాడు పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ ఎడ్యుకేషన్, ఇరిగేషన్‌కు ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన దార్శనికతతోనే మన దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడే స్థాయికి చేరింది. అయితే తెలంగాణ ప్రదాతలం, ఉద్యమకారులమని కొందరు బ్రాండ్‌లు క్లెయిమ్‌ చేసుకుంటుంటారు. వారి గురించి నేను చర్చించను..’ అని రేవంత్‌ పేర్కొన్నారు. మన విద్యా విధానం ప్రాథమిక స్థాయిలోనే లోపం ‘ప్రభుత్వ పాఠశాలల్లోనూ ప్రీ స్కూల్‌ విధానం ప్రవేశపెట్టాలనే ఆలోచనలో ఉన్నాం. రాష్ట్రంలో 29 వేల ప్రభుత్వ స్కూళ్లు ఉంటే, వాటిల్లో 18.50 లక్షల మంది పిల్లలు చదువుతున్నారు. ప్రైవేటులో 11,500 స్కూళ్లు ఉంటే వాటిల్లో 30 లక్షల మంది విద్యార్థులున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ అర్హతలు ఉన్న వారు పని చేస్తున్నప్పటికీ విద్యార్థులు చేరడం లేదంటే మన విద్యా విధానంలో ఉన్న లోపాలు ఏమిటనే ఆలోచన చేశాం. ప్రాథమిక స్థాయిల్లోనే అస్పష్టత ఉందనే విషయం గమనించాం. నిపుణులతో చర్చించిన తర్వాత ప్రభుత్వ బడుల్లోనూ ప్రైవేటు పాఠశాలల మాదిరిగా ప్రీస్కూల్‌ విధానం ప్రవేశపెట్టాలని, నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ అందుబాటులోకి తేవాలనే ఆలోచన చేశాం. ప్రైవేటు స్కూళ్లల్లో పిల్లలకు ఎలాగైతే రవాణా సౌకర్యం ఉంటుందో అదే తరహాలో నిరుపేదల పిల్లలకు ఉచితంగా రవాణా సదుపాయాలు కల్పించి వారికి ఉత్తమమైన ప్లే స్కూల్‌ విద్యను అందించాలని నిర్ణయించాం..’ అని ముఖ్యమంత్రి వెల్లడించారు. స్కిల్స్‌ యూనివర్సిటీ విద్యార్థులు ప్రతి ఒక్కరికీ ఉద్యోగ భద్రత ‘విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు పెద్ద పెద్ద కంపెనీల భాగస్వామ్యంతో యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకున్నాం. ఈ వర్సిటీలో చేరే ప్రతి విద్యారి్థకి ఉద్యోగ భద్రత లభిస్తుంది. ఈ యూనివర్సిటీతో పాటు, యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీ, యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ అకాడమీ మొదలు పెట్టాం. ఇవి కాకుండా 58 నియోజకవర్గాల్లో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లను చేపట్టాం..’ అని రేవంత్‌ వివరించారు. పోలీసులకు ఎంత చేసినా తక్కువే: మంత్రి శీధర్‌బాబు దేశంలో ఎక్కడా లేని విధంగా పోలీసుల పిల్లల కోసం ప్రత్యేకంగా పాఠశాల ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణకే దక్కుతుందని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ప్రజల ప్రశాంత జీవనం కోసం ఎన్నో త్యాగాలు చేసే పోలీసుల కోసం ఎంత చేసినా తక్కువే అని అన్నారు. డీజీపీ జితేందర్‌ మాట్లాడుతూ.. పోలీసుల పిల్లల పరిస్థితులు అర్థం చేసుకుని ప్రత్యేకంగా పాఠశాలను ఏర్పాటు చేసిన సీఎం రేవంత్‌రెడ్డికి పోలీస్‌శాఖ తరఫున ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ మాట్లాడుతూ..ఈ స్కూల్‌లో ఫీజులు ఎక్కువగా ఉన్నాయన్న అంశంపై దృష్టి పెట్టామని, తగ్గింపుపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపారు. విద్యార్థులకు కిట్లు స్కూలు విద్యార్థులకు యూనిఫాం, ఇతర వస్తువులు ఉన్న కిట్లను సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు అందజేశారు. పోలీస్‌ స్కూల్‌ ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతగా పోలీస్‌ అధికారులు, సిబ్బంది తమ క్యాప్‌లను చేతపట్టుకుని ఊపుతూ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. స్కూల్‌ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన విశాల్‌ గోయల్, శరత్, ఎస్పీ రెడ్డిలను సీఎం జ్ఞాపికలతో సత్కరించారు. గోల్‌ కొట్టిన ముఖ్యమంత్రి పోలీస్‌ స్కూల్‌ను ప్రారంభించిన తర్వాత సీఎం పాఠశాలను పరిశీలించారు. కాసేపు విద్యార్థులతో ముచ్చటించడంతో పాటు వారితో సరదాగా ఫుట్‌బాల్‌ ఆడారు. పది మంది చిన్నారులు తన నుంచి బాల్‌ను తీసుకునేందుకు పోటీ పడుతున్నా, వారిని తప్పించుకుని గోల్‌ కొట్టి అబ్బుర పరిచారు. సామాజిక బాధ్యత కింద విరాళాలు పోలీస్‌ స్కూల్‌కు సీఎస్‌ఆర్‌ కింద ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి రూ.30 లక్షలు, ఎసీ రెడ్డి రూ.కోటి, జీజీఎస్‌ ఇంజనీరింగ్‌కు చెందిన ప్రవీణ్‌రెడ్డి రూ. 50 లక్షలు, తేజస్వి డెవలపర్స్‌కు చెందిన నిరంజన్‌ రూ.50 లక్షలు విరాళం ప్రకటించారు. కార్యక్రమంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, కాలే యాదయ్య, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా, ఇంటెలిజెన్స్‌ డీజీ శివధర్‌రెడ్డి, సీఐడీ డీజీ శిఖాగోయల్, జైళ్లశాఖ డీజీ సౌమ్యా మిశ్రా, గ్రేహౌండ్స్‌ అడిషనల్‌ డీజీ స్టీఫెన్‌ రవీంద్ర, ఇతర పోలీస్, జైళ్ల శాఖల అధికారులు, కుటుంబసభ్యులు పాల్గొన్నారు. చిన్నారులతో సందడి చేసిన సీఎం మణికొండ: గండిపేట మండలం, మంచిరేవులలో యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌ ప్రారంభోత్సవానికి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిన్నారులతో కలిసి సందడి చేశారు. విద్యార్థులతో కలిసి ఫుట్‌ బాల్‌ ఆడి వారిని ఉత్తేజ పరిచారు. పది మంది చిన్నారులు సీఎం నుంచి బాల్‌ను తీసుకునేందుకు పోటీ పడుతున్నా వారిని ఏ మార్చి గోల్‌ కొట్టి వారిని అబ్బుర పరిచారు. పాఠశాలలో ఉన్న సౌకర్యాలు, ఇంకా ఏర్పాటు చేయాల్సిన వాటి గురించి చిన్నారులను అడిగి తెలుసుకున్నారు. వారి కోరికలు విని పాఠశాలను వారి ఆశలకు అనుగుణంగా తీర్చి దిద్దాలని పోలీసు అధికారులకు సూచనలు చేశారు.

Delhi beat Royal Challengers Bangalore by 6 wickets5
రాహుల్‌ గెలిపించాడు

బెంగళూరు: ఐపీఎల్‌ 18వ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు అజేయ ప్రదర్శన కొనసాగుతోంది. ఓటమి లేకుండా సాగుతున్న జట్టు వరుసగా నాలుగో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. గురువారం జరిగిన పోరులో ఢిల్లీ 6 వికెట్లతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టును ఓడించింది. సొంత మైదానంలో ఆడిన రెండో మ్యాచ్‌లోనూ ఆర్‌సీబీకి పరాజయం ఎదురుకాగా... తన సొంత నగరంలో మ్యాచ్‌ను గెలిపించిన అనంతరం ‘ఇది నా అడ్డా’ అన్నట్లుగా రాహుల్‌ విజయనాదం చేయడం విశేషం. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. టిమ్‌ డేవిడ్‌ (20 బంతుల్లో 37 నాటౌట్‌; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఫిల్‌ సాల్ట్‌ (17 బంతుల్లో 37; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడారు. అనంతరం ఢిల్లీ 17.5 ఓవర్లలో 4 వికెట్లకు 169 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కేఎల్‌ రాహుల్‌ (53 బంతుల్లో 93 నాటౌట్‌; 7 ఫోర్లు, 6 సిక్స్‌లు) చెలరేగిపోగా, ట్రిస్టన్‌ స్టబ్స్‌ (23 బంతుల్లో 38 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌) అండగా నిలిచాడు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 55 బంతుల్లో అభేద్యంగా 111 పరుగులు జోడించారు. ఒకే ఓవర్లో 30 పరుగులు... ఇన్నింగ్స్‌లో తొలి 22 బంతులు ఆర్‌సీబీ విధ్వంసంతో 61 పరుగులు... చివరి 12 బంతుల్లో అదే తరహా దూకుడుతో 36 పరుగులు... మధ్యలో మిగిలిన 86 బంతుల్లో ఢిల్లీ బౌలర్ల ఆధిపత్యం... పేలవ బ్యాటింగ్‌తో బెంగళూరు చేసిన పరుగులు 66 మాత్రమే... జట్టు ఇన్నింగ్స్‌ ఇలా భిన్న పార్శ్వాలలో సాగింది. తొలి ఓవర్లో స్టార్క్‌ 7 పరుగులే ఇవ్వగా, అక్షర్‌ వేసిన రెండో ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 16 పరుగులు వచ్చాయి. అయితే అసలు విధ్వంసం మూడో ఓవర్లో సాగింది. స్టార్క్‌ బౌలింగ్‌లో సాల్ట్‌ ఊచకోత కోశాడు. అతను 2 సిక్స్‌లు, 3 ఫోర్లు బాదగా, ఎక్స్‌ట్రాల రూపంలో మరో 6 పరుగులు వచ్చాయి. సాల్ట్‌ వరుసగా 6, 4, 4, 4 (నోబాల్‌), 6తో చెలరేగిపోయాడు. అయితే తర్వాతి ఓవర్లో ఆట ఒక్కసారిగా మలుపు తిరిగింది. అనవసరపు సింగిల్‌కు ప్రయత్నించి వెనక్కి రాలేక సాల్ట్‌ రనౌటయ్యాడు. ఆ తర్వాత బెంగళూరు వరుసగా వికెట్లు కోల్పోవడంతో పాటు పరుగులు రావడం గగనంగా మారింది. అయితే అక్షర్‌ వేసిన 19వ ఓవర్లో డేవిడ్‌ 2 సిక్స్‌లు, ఫోర్‌ బాదడంతో 17 పరుగులు రాగా, ముకేశ్‌ వేసిన చివరి ఓవర్లోనూ అతను 2 సిక్స్‌లు, ఫోర్‌ కొట్టడంతో 19 పరుగులు వచ్చాయి. కీలక భాగస్వామ్యం... ఛేదనలో ఢిల్లీ ఆరంభంలో తడబడింది. డుప్లెసిస్‌ (2), ఫ్రేజర్‌ (7), పొరేల్‌ (7) విఫలం కాగా, అక్షర్‌ (15) కూడా ఎక్కువ సేపు నిలవలేదు. ఈ సమయంలో చక్కటి బౌలింగ్‌తో ఆర్‌సీబీ పైచేయి సాధించినట్లు కనిపించింది. అయితే రాహుల్, స్టబ్స్‌ భాగస్వామ్యంలో జట్టు గెలుపు దిశగా దూసుకుపోయింది. పిచ్‌ ఇబ్బందికరంగా ఉండటంతో నిలదొక్కుకునేందుకు కొంత సమయం తీసుకున్నా... ఆ తర్వాత వీరిద్దరు దూకుడు ప్రదర్శించారు.చివర్లో 6 ఓవర్లలో 65 పరుగులు అవసరం కాగా...రాహుల్, స్టబ్స్‌ కలిసి 7 ఫోర్లు 4 సిక్సర్లతో మ్యాచ్‌ను ముగించారు. హాజల్‌వుడ్‌ ఓవర్లో రాహుల్‌ 3 ఫోర్లు, సిక్స్‌తో 22 పరుగులు రాబట్టడం మ్యాచ్‌ను ఢిల్లీ వైపు తిప్పింది. స్కోరు వివరాలు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: సాల్ట్‌ (రనౌట్‌) 37; కోహ్లి (సి) స్టార్క్‌ (బి) నిగమ్‌ 22; పడిక్కల్‌ (సి) అక్షర్‌ (బి) ముకేశ్‌ 1; పాటీదార్‌ (సి) రాహుల్‌ (బి) కుల్దీప్‌ 25; లివింగ్‌స్టోన్‌ (సి) అశుతోష్‌ (బి) మోహిత్‌ 4; జితేశ్‌ (సి) రాహుల్‌ (బి) కుల్దీప్‌ 3; కృనాల్‌ (సి) అశుతోష్‌ (బి) నిగమ్‌ 18; డేవిడ్‌ (నాటౌట్‌) 37; భువనేశ్వర్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 163. వికెట్ల పతనం: 1–61, 2–64, 3–74, 4–91, 5–102, 6–117, 7–125. బౌలింగ్‌: స్టార్క్‌ 3–0–35–0, అక్షర్‌ 4–0–52–0, నిగమ్‌ 4–0– 18–2, ముకేశ్‌ 3–1–26–1, కుల్దీప్‌ 4–0–17–2, మోహిత్‌ 2–0–10–1. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: డుప్లెసిస్‌ (సి) పాటీదార్‌ (బి) దయాళ్‌ 2; ఫ్రేజర్‌ (సి) జితేశ్‌ (బి) భువనేశ్వర్‌ 7; పొరేల్‌ (సి) జితేశ్‌ (బి) భువనేశ్వర్‌ 7; రాహుల్‌ (నాటౌట్‌) 93; అక్షర్‌ (సి) డేవిడ్‌ (బి) సుయాశ్‌ 15; స్టబ్స్‌ (నాటౌట్‌) 38; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (17.5 ఓవర్లలో 4 వికెట్లకు) 169. వికెట్ల పతనం: 1–9, 2–10, 3–30, 4–58. బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4–0–26–2, దయాళ్‌ 3.5–0– 45–1, హాజల్‌వుడ్‌ 3–0–40–0, సుయాశ్‌ 4–0–25 –1, కృనాల్‌ 2–0–19–0, లివింగ్‌స్టోన్‌ 1–0–14–0. ఐపీఎల్‌లో నేడుచెన్నై X కోల్‌కతావేదిక: చెన్నై రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

Stock market rebounds strongly as hundreds of shares hit ceiling6
టారిఫ్‌ ‘రిలీఫ్‌’ ర్యాలీ..!

న్యూఢిల్లీ: చైనా మినహా మిగతా దేశాలపై ప్రతీకార సుంకాలు 90 రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటనతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు బలంగా పుంజుకున్నాయి. బుధవారం రాత్రి అమెరికా నాస్‌డాక్‌ ఇండెక్స్‌ 12.16%, ఎస్‌అండ్‌పీ సూచీ 9.52%, డోజోన్స్‌ ఇండెక్స్‌ 8% లాభపడ్డాయి. యూఎస్‌ నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న ఆసియా, యూరప్‌ మార్కెట్లు గురువారం రాణించాయి. జపాన్‌ నికాయ్‌ 9%, దక్షిణ కొరియా కోస్పీ 7%, సింగపూర్‌ స్ట్రెయిట్‌ టైమ్స్‌ 5%, హాంగ్‌కాంగ్‌ హాంగ్‌ సెంగ్‌ 2%, చైనా షాంఘై ఒకశాతం పెరిగాయి. యూరప్‌లో జర్మనీ డాక్స్‌ 5%, ఫ్రాన్స్‌ సీఏసీ 5%, బ్రిటన్‌ ఎఫ్‌టీఎస్‌ఈ నాలుగు శాతం పెరిగాయి. కాగా బుధవారం భారీగా ర్యాలీ చేసిన అమెరికా మార్కెట్‌లో గురువారం లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. దీంతో అమెరికా మార్కెట్లు మళ్లీ భారీ గా పడ్డాయి. నాస్‌డాక్‌ 5% క్షీణించి 16,292 వద్ద, డోజోన్స్‌ 3% పడి 39,184 వద్ద, ఎస్‌అండ్‌పీ 4% నష్టంతో 5,243 వద్ద ట్రేడవుతోంది. భారత మార్కెట్‌ భారీ గ్యాప్‌అప్‌..? అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూలతల కారణంగా శుక్రవారం దేశీయ మార్కెట్‌ భారీ గ్యాప్‌అప్‌తో ప్రారంభం కావచ్చని మార్కెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నాయి. ఇందుకు సంకేతంగా దలాల్‌ స్ట్రీట్‌ను ప్రతిబింబించే గిఫ్ట్‌ నిఫ్టీ 3% (680 పాయింట్లు) పెరిగింది. శ్రీ మహావీర్‌ జయంతి సందర్భంగా భారత మార్కెట్‌ గురువారం పనిచేయలేదు. భారత్‌తో సహా 60 దేశాల నుంచి అమెరికా దిగుమతి చేసుకునే వస్తువులపై ఏప్రిల్‌ 2 నుంచి ట్రంప్‌ భారీగా పన్నులు వడ్డించారు. దీంతో అంతర్జాతీయంగా ప్రపంచ వాణిజ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. నాటి (ఏప్రిల్‌ 2)నుంచి సెన్సెక్స్‌ 2,770 పాయింట్లు(3.61%), నిఫ్టీ 933 పాయింట్లు(4%) క్షీణించాయి. ఇన్వెస్టర్ల సంపద రూ.19.15 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయి రూ.393.82 లక్షల కోట్లకు దిగివచి్చంది.మన మార్కెట్‌లోనూ దూకుడు...! నిఫ్టీ సుమారు 700 పాయింట్లు లాభంతో ట్రేడింగ్‌ ప్రారంభించవచ్చు. షార్ట్‌ కవరింగ్‌తో మార్కెట్‌ భారీగా పెరిగే అవకాశం ఉంది. విస్తృత స్థాయిలో కొనుగోళ్ల పర్వం కొనసాగొచ్చు. ఐటీ షేర్లు బౌన్స్‌బ్యాక్‌ అయ్యే వీలుంది. ఫార్మా షేర్లు డిమాండ్‌ లభించవచ్చు. లార్జ్‌ క్యాప్‌ బ్యాంకులు, ఫైనాన్షియల్స్‌ షేర్లు ర్యాలీ చేయొచ్చు. అమెరికా–చైనా ట్రేడ్‌ వార్‌ ముదరడంతో విదేశీ ఇన్వెస్టర్లు త్వరలో భారత ఈక్విటీల కొనుగోళ్లకు ఆసక్తి చూపొచ్చు. – వీకే విజయ్‌కుమార్, జియోజిత్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ చీఫ్‌ స్ట్రాటజిస్ట్‌

Tabu to Join Vijay Sethupathi In Puri Jagannadh Next Movie7
ఈసారి కొత్తగా ప్లాన్‌ చేస్తున్న పూరీ

వరుసగా లైగర్‌, డబుల్‌ ఇస్మాట్‌ చిత్రాలతో ప్లాప్‌ కొట్టిన దర్శకుడు పూరీ జగన్నాద్‌(Puri Jagannadh) ఈ సారైనా గట్టిగా హిట్‌ కొట్టాలని ప్లాన్‌ చేస్తున్నాడు. ఇటీవలే విజయ్‌ సేతుపతి(Vijay Sethupathi)తో సినిమాను ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచిన పూరీ, ఆ చిత్రానికి ఫీమేల్‌ లీడ్‌గా నటి 'టబు'ను తీసుకున్నారు. ఈ రోజు అధికారికంగా ఆ విషయాన్ని వెల్లడించారు. అల్లు అర్జున్‌తో కలిసి 'అల వైకుంఠపురము'లో చిత్రం తరువాత టబు తెలుగులో అంగీకరించిన సినిమా ఇదే కావడం విశేషం. అంటే దాదాపు ఐదు సంవత్సరాల విరామం తరువాత 'టబు' మరో తెలుగు చిత్రంలో నటిస్తోందన్నమాట. కేవలం మంచి పాత్రలు దొరికితేనే నటిస్తానన్న టబు(Tabu) పూరీ సినిమాలో తన పాత్ర చాలా కొత్తగా, వైవిద్యంగా, బలంగా ఉంటుందని తెలిపింది. ఇక ఈ చిత్ర రెగ్యులర్‌ షూట్‌ జూన్‌లో మొదలుకానుంది. తెలుగుతో పాటు హింది, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. చూస్తుంటే ఈ సారి పూరీ ఏదో కొత్తగా ప్లాన్‌ చేసినట్టే ఉన్నాడు.

Crop damage with Unseasonal Rains8
అకాల వర్షం.. ఆగమాగం

సాక్షి, నెట్‌వర్క్‌: క్యుములోనింబస్‌ మేఘాల ప్రభావంతో పలు జిల్లాల్లో అకాలవర్షం కురిసింది. గురువారం గాలి దుమారంతో ప్రారంభమై.. ఓ మోస్తరు వర్షం కురిసింది. వడగండ్లతో రైతులకు కడగండ్లు మిగిలాయి. కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. మూడుచోట్ల పిడుగులు పడి ముగ్గురు చనిపోయారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలు మండలాల్లో కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం తడిసింది. వడగండ్ల వానకు మామిడి కాయలు నేలరాలాయి. వరి చేలు నేలకొరిగాయి. ఆత్మకూర్‌(ఎం)లో కరెంట్‌ తీగలు తెగిపడడంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. గాలి దుమారానికి పలుచోట్ల ఇళ్ల పైకప్పు రేకులు లేచిపోయాయి. గుండాలలో బండపై రైతులు ఆరబెట్టిన ధాన్యం కొట్టుకుపోయింది. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా: ఎడపల్లి మండలం బాపూనగర్‌లో వడగండ్లు పడ్డాయి. విద్యుత్‌ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. బలమైన గాలులకు ధాన్యం కుప్పలపై కప్పిన టార్పాలిన్లు ఎగిరిపోయాయి. రైతులు ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. ఈదురు గాలులతో వరితోపాటు మొక్కజొన్న, జొన్న పంటలు నేలవాలాయి. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా: పలు మండలాల్లో ఈదురుగాలులు, వర్షానికి ధాన్యం పొలాల్లోనే రాలిపోయింది. మొక్కజొన్న నేలవాలింది. గంభీరావుపేట మండలం గజసింగవరంలో కొనుగోలు కేంద్రంలోని ధాన్యం తడిసి ముద్దయ్యింది. వేములవాడ మండలం నాగాయపల్లి శివారులో గాలివానకు పడిపోయిన చెట్లను బ్లూ కోల్ట్స్‌ తొలగించారు. జనగామ జిల్లా: జనగామ వ్యవసాయ మార్కెట్‌లో 600 బస్తాల వరకు ధాన్యం తడిసిపోగా, రఘునాథపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలాల్లో కోతకు సిద్ధంగా ఉన్న పంట దెబ్బతింది. గాలి దుమారంతో 11 కేవీ విద్యుత్‌ లైన్లపై చెట్లు విరిగి పడిపోవడంతో కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సిద్దిపేట జిల్లా : సిద్దిపేట జిల్లా నంగునూరు, చిన్నకోడూర్‌ మండలాల్లోని పలు గ్రామాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఈదురు గాలుల ధాటికి కొన్ని గ్రామాల్లో చెట్లు నేలకూలగా, పొలాల్లోనే గింజలు రాలడంతో వరి మొక్కకు పిలకలే మిగిలాయి. మొక్కజొన్న, మిర్చి, టమాట, కూరగాయ పంటలు నేలకొరిగాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా : దేవరకద్ర మార్కెట్‌లో వేలం వేసిన ధాన్యం కుప్పలు తడిపోయాయి. రైతులు కవర్లు కప్పినా.. అప్పటికే చాలా ధాన్యం తడిసి ముద్దయ్యిది. కొల్లాపూర్‌లో ఈదురుగాలులకు మామిడికాయలు నేలరాలాయి. నిర్మల్‌ జిల్లా: పలు మండలాల్లో ఈదురు గాలులతోపాటు రాళ్ల వర్షం కురిసింది. దీంతో కోతకు వచ్చిన పంటలు నేలవాలాయి. ఇప్పటికే కోసి కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసింది. మొక్కజొన్న తడిసి ముద్దయ్యింది.కల్లాల్లో అరబెట్టిన మక్కలు కొంత మేరకు తడిసిపోయాయి. రైతు ఆత్మహత్యాయత్నం ములుగు జిల్లా మొట్లగూడెం గ్రామానికి చెందిన యాలం నర్సింహారావు తనకున్న ఐదెకరాలతోపాటు మరో 15 ఎకరాలు కౌలుకు తీసుకొని వరి, మొక్కజొన్న, మిర్చి పంటలు సాగు చేశాడు. మరో మూడు రోజుల్లో వరి పంట కోయాల్సి ఉండగా.. ఈనెల 7న సాయంత్రం వడగళ్ల వాన పడింది. దీంతో వరి చేనులో గింజకూడా లేకుండా రాలిపోవడంతో తీవ్ర నష్టం జరిగింది. అప్పులు తీర్చే మార్గం లేక నర్సింహారావు బుధవారం రాత్రి తన ఇంటికి సమీపాన ఉన్న పొలం వద్దకు పురుగుల మందుతాగాడు. ఉదయాన్నే స్థానికులు గుర్తించి ఏటూరునాగారం ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హనుమకొండలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అకాల వర్షాలపై అప్రమత్తంగా ఉండండి : సీఎం రేవంత్‌రెడ్డి ఆకాల వర్షాలు పడుతున్న నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయని, రైతులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని సూచించారు. మరో రెండు రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు వివిధ జిల్లాల్లో కురిసే అవకాశముందన్న వాతావరణ శాఖ సూచనలను పరిగణనలోకి తీసుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను సీఎం అప్రమత్తం చేశారు. ముగ్గురి ప్రాణం తీసిన పిడుగులు వేర్వేరు జిల్లాలో పిడుగులు పడి ముగ్గురు మృత్యువాత పడ్డారు. జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం నేలపోగుల గ్రామానికి చెందిన రైతు మందాడి రవీందర్‌రెడ్డి(55) రోజు మాదిరిగానే గురువారం గేదెలను మేపడానికి వెళ్లాడు. సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన కుమారుడు సంకీర్తరెడ్డి వ్యవసాయబావి వద్దకు వెళ్లి చూడగా విగతజీవుడై పడి ఉన్నాడు. సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో పిడుగు పడిందని, దీంతో అక్కడికక్కడే మృతి చెందినట్టు గుర్తించారు. – సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌ మండలం గంగారాం గ్రామానికి చెందిన సంపత్‌కుమార్‌ అలియాస్‌ సతీశ్‌(19), జశ్వంత్, కార్తీక్‌లు సదాశివపేట మండల పరిధిలోని గొల్లగూడెంలోన ఓ కాలేజీలో ఐటీఐ చదువుతున్నారు. క్లాస్‌లు ముగిశాక ఒకేపై ముగ్గురూ స్వగ్రామానికి బయలు దేరారు. వర్షం ఎక్కువ కావడంతో సిద్దాపూర్‌–గొల్లగూడెం శివారులోని మైసమ్మ కట్ట వద్ద బైక్‌ను నిలిపి సంపత్‌కుమార్, జశ్వంత్‌ చింత చెట్టు కింద నిల్చున్నారు. కార్తీక్‌ మరో చెట్టు కింద నిలబడ్డాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా పిడుగుపడి సంపత్‌కుమార్‌ అక్కడికక్కడే మృతి చెందగా, జశ్వంత్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. – నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం ఆమలూరు గ్రామానికి చెందిన గొర్రెల కాపరి మేకల రాములు(55) గ్రామ సమీపంలో తన గొర్రెలను మేపుతుండగా.. అకస్మాత్తుగా గాలి దుమారంతో వర్షం కురిసింది. రాములు పక్కనే పిడుగుపడడంతోఅక్కడికక్కడే మృతిచెందగా ఆయన కుమారుడు నరసింహకు తీవ్ర గాయాలయ్యాయి. ఆలేరు మండలం మంతపురిలో పిడుగుపాటుకు గేదె మృతి చెందింది.

Sakshi Guest Column On Donald Trump USA9
మూర్ఖత్వం

1. ‘మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగైన్‌’ మద్దతుదారులలో చాలామంది, బహుశా ట్రంప్‌ కూడా, అమెరికాకు వస్తువులను ఎగుమతి చేసే దేశాలే అధిక సుంకాలను చెల్లిస్తాయని నమ్ముతున్నట్లుంది. వాస్తవం ఏమిటంటే, సుంకాలను దిగుమతి దారులు చెల్లిస్తారు. వారు ఆ ఖర్చును వినియోగదారులకు, ఈ సందర్భంలో, అమెరికన్‌ ప్రజలకు బదిలీ చేస్తారు.2. సుంకాల విధింపు అనేది చర్చల వ్యూహంలో భాగమా? ట్రంప్‌ మొదటి పదవీకాలం విషయంలో అది నిజమే కావచ్చు. ఇప్పుడు అలా చేయడం కష్ట తరమైన ఆలోచన. కొన్ని దేశాలు తమ సుంకాలను తగ్గించుకోవచ్చు. కానీ చాలా దేశాలు ప్రతీకార సుంకాలను విధిస్తున్నాయి. తన మద్దతుదారులకు తాను బలంగా కనిపించాలని ట్రంప్‌ అనుకుంటున్నట్లుగానే, ఇతర దేశాల నాయకులు కూడా బలహీనంగా కనిపించడానికి ఇష్టపడకపోవచ్చు.3. ట్రంప్‌ మాంద్యాన్ని పెంచి పోషించడానికీ, తద్వారా అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ను వడ్డీ రేట్లను తగ్గించమని బలవంతం చేయడానికీ ప్రయత్నిస్తు న్నారని కూడా చెబుతున్నారు. తక్కువ వడ్డీ రేట్లు ఆర్థిక వృద్ధిని నడిపిస్తాయి. అలాగే 2026 మధ్యంతర ఎన్నికలలో రిపబ్లికన్‌ పార్టీకి సహాయపడ తాయి. అయితే, ఆర్థిక వ్యవస్థ కారు లాంటిది కాదు. కారు వేగాన్ని యాక్సిలరేటర్‌తోనూ, బ్రేక్‌ తోనూ సులభంగా నియంత్రించవచ్చు. ఇది సంక్లి ష్టమైన వ్యవస్థ. అమెరికా సుంకాలు అలాగే ఉంటే, అక్కడ రిటైల్‌ ద్రవ్యోల్బణం పెరుగుతుంది, వడ్డీ రేటు కోత అవకాశాలను తగ్గిస్తుంది. ఇంకొకటి: ప్రజలు పేదరికాన్ని అనుభూతి చెందుతూ సాధా రణంగా వారు చేసే దానికంటే తక్కువ ఖర్చు చేయడం వల్ల, వినియోగదారుల వ్యయం, ఆర్థిక వృద్ధి మందగిస్తాయి.4. దేశాలేవీ గతంలో సుంకాలను వేయలేదని దీని అర్థం కాదు. అవి వాటిని అస్త్రాలుగా వాడాయి. కానీ సార్వత్రిక సుంకాలు సాధారణంగా బలహీనంగా ఉండే ఆర్థిక ఫలితాలకు దారితీస్తాయి. 1930 జూన్‌లో అమెరికా ఆమోదించిన ట్యారిఫ్‌ చట్టం (లేదా స్మూట్‌–హాలీ చట్టం), 1929లో ప్రారంభ మైన మహా మాంద్యం తర్వాత దాని ఆర్థిక వ్యవస్థను రక్షించడానికి ఉద్దేశించబడింది. రక్షణ వాద ప్రభంజన కాలంలో ఈ చట్టం 20,000 పారి శ్రామిక, వ్యవసాయ వస్తువులపై సుంకాలను రికార్డు స్థాయికి పెంచింది. ఇతర దేశాలు తమ సొంత సుంకాలతో స్పందించాయి. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మరింత దెబ్బతీసి, మాంద్యాన్ని పొడిగించింది. దేశాలు రెండవ ప్రపంచ యుద్ధానికి ఖర్చులతో సిద్ధమై, పోరాడటం ప్రారంభించిన తర్వాత పరిస్థితి మారింది. నాటి ఈ పాఠాన్ని అమెరికా పాలనాయంత్రాంగం మరచిపోయింది. 5. పరస్పర సుంకాల రేట్లను చాలా మోటు సూత్రాన్ని ఉపయోగించి నిర్ణయించినట్లు అనిపి స్తుంది. భారతదేశం విషయంలో, ఈ సుంకం 26 శాతం వేశారు. 2024లో, అమెరికా భారతదేశంతో 45.7 బిలియన్‌ డాలర్ల విలువైన వాణిజ్య లోటును కలిగి ఉంది. అంటే భారతదేశం నుండి అమెరికా వస్తువుల దిగుమతులు భారతదేశానికి దాని వస్తువుల ఎగుమతుల కంటే చాలా ఎక్కువగా ఉన్నాయని ఇది సూచిస్తుంది. భారతదేశం నుండి అమెరికా సరుకుల దిగుమతులు 87.4 బిలియన్‌ డాలర్లు. ఈ 87.4 బిలియన్‌ డాలర్ల విలువైన దిగుమతుల్లో 45.7 బిలియన్‌ డాలర్ల అమెరికా లోటు 52 శాతానికి వస్తుంది. ఈ రేటును సగానికి తగ్గించినప్పుడు, 26 శాతం అవుతుంది.ఇక్కడ బహుళ సమస్యలు ఉన్నాయి. సేవల వాణిజ్యాన్ని పరిగణించలేదు. కరెన్సీ తారుమారు, వాణిజ్యేతర అడ్డంకులను పరిగణనలోకి తీసుకోలేదు. ఒక దేశం దాని సుంకాలను తగ్గించాలని నిర్ణయించుకున్నప్పటికీ, ఆ దేశంతో అమెరికా వాణిజ్య లోటు తగ్గకపోవచ్చు. ఎందుకంటే ఆ దేశానికి అమెరికా మరిన్ని ఎగుమతి చేయవలసి ఉంటుంది. మరిన్ని ఎగుమతి చేయడం అంటే తక్కువ సుంకాల రేటు గురించి మాత్రమే కాదు. అమెరికా ముందుగా వస్తువులను ఉత్పత్తి చేయాలి. అది కూడా ఇతర దేశాలకు ఆసక్తి కలిగించే ధరకు ఉత్పత్తి చేయాలి.తనకు తెలియదని తెలియదు!6. ట్రంప్‌ ఇలా సుంకాలు వేస్తున్నారంటే, తాను దాని గురించి క్షుణ్ణంగా ఆలోచించే ఉంటారని నమ్మే ఒక ఆలోచనా విధానం కూడా ఉంది. ఇది మన ముందున్న అతిపెద్ద ప్రమాదాన్ని వెల్లడిస్తుంది: ట్రంప్‌కు తనకు తెలియనిది తెలియదని తెలీకపోవచ్చు. ఆయన అందరి దృష్టీ తన వైపు ఉండటాన్ని ఇష్టపడు తున్నట్లు, తనను తాను నిర్ణయాత్మక వ్యక్తిగా చూపించుకుంటున్నట్లు అనిపిస్తుంది.7. విధించిన ఈ సుంకాలు దేశీయ మార్కెట్‌ కోసం అమెరికాలోనే ఉత్పత్తి చేయమని కంపెనీలపై ఒత్తిడి తెస్తాయనే నమ్మకాన్ని ట్రంప్‌ మాటలు సూచిస్తున్నాయి. కానీ అది అంత సులభం కాదు.ఎందుకంటే అమెరికాలో ఉత్పత్తి చేయడం ఖరీదైన ప్రతిపాదన కావచ్చు. అసలు అందుకే కంపెనీలు మొదటగా బయటకు వెళ్లాయి. ఇప్పుడు కంపెనీల సరఫరా గొలుసులు చాలా పరిణామం చెందాయి. ఒక ఉత్పత్తి దాని తయారీ ప్రక్రియలో అనేకసార్లు అమెరికా సరిహద్దులను దాటవచ్చు. అందుకే కంపె నీలు ట్రంప్‌ రెండవ పదవీ కాలం ముగిసేదాకా వేచి ఉండాలని నిర్ణయించుకునే అవకాశం కూడా ఉంది.8. ట్రంప్‌ ఈ సుంకాల విధింపు వ్యూహాన్ని ద్విగిణీకృతం చేసినట్లయితే, అది దేశాలను అమెరికా నుండి మరింత దూరం చేస్తుంది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికన్‌ డాలర్‌ కేంద్రంగా ఉద్భవించిన ప్రపంచ క్రమాన్ని అది చెదరగొడుతుంది.ఇప్పుడు దానికి మరొక వివరణాత్మక వ్యాసం అవసరం. కానీ ఒకే వాక్యంలో చెప్పాలంటే, గ్రాహమ్‌ గ్రీన్‌ 1978లో ప్రచురించిన ‘ది హ్యూమన్‌ ఫ్యాక్టర్‌’ నవలలో ఇలా రాశాడు: ‘మనకు చైనీయులు అవసరమయ్యే రోజు రావచ్చు’.వ్యాసకర్త ఆర్థిక అంశాల వ్యాఖ్యత, రచయిత ‘ (‘ద మింట్‌’ సౌజన్యంతో)

Sakshi Editorial On verdict given by Supreme Court bench10
నిజాయితీపరులకు న్యాయమెలా?

షడ్రసోపేత విందు సాగుతుండగా హఠాత్తుగా ఎవరోవచ్చి పంక్తి నుంచి అమర్యాదగా మెడపట్టి గెంటేస్తే? కాళ్లకింది నేల ఒక్కసారిగా బద్దలై మింగేస్తే? పశ్చిమబెంగాల్‌లో పదేళ్లుగా కొలువులు చేస్తున్న వేలాది ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది స్థితి అలాంటిదే. 2016లో స్కూల్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) ద్వారా ఎంపికైన మొత్తం 25,752 మంది టీచింగ్, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది నియామకాలు చెల్లబోవని, వారిని తక్షణం తొలగించాలని గత వారం సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పుతో వారంతా రోడ్డున పడ్డారు. కేన్సర్‌ బారినపడిన ఒకే ఒక్క ఉపాధ్యాయురాలిని మాత్రం ధర్మాసనం మినహాయించింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మొదలుకొని అందరూ ఉద్యోగాలు కోల్పోయినవారిపై సానుభూతి ప్రకటిస్తున్నారు. మమత అయితే తీర్పును తప్పుబట్టారు. ఉద్యోగాలు కోల్పోయినవారు ఎప్పటిలాగే విధి నిర్వహణ చేయొచ్చని, వేరే ప్రభుత్వ ఉద్యోగాల్లో సర్దుతామని బింకంగా ప్రకటించారు. వారికోసం జైలుకు పోవటానికీ సిద్ధమేనన్నారు. రేపటి సమాజం తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుందంటారు. సగటు విద్యార్థులను సమున్నతంగా తీర్చిదిద్దటం, వారి సృజనాత్మకతను వెలికితీసి మెరికల్లా మార్చటం, పటుతర శక్తిగా మల చటం ఉపాధ్యాయులు చేసే పని. ఇంతటి మహత్కార్యాన్ని నిర్వర్తించాల్సినవారు కాస్తా ముడుపులు సమర్పించుకుని దొడ్డిదారిన వచ్చిచేరారంటే అంతకన్నా దారుణం మరొకటుండదు. ఈ రిక్రూట్‌ మెంట్‌పై ఆ రోజుల్లోనే తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. అభ్యర్థుల ర్యాంకులు తలకిందులు చేశారని, అధిక మార్కులు వచ్చినవారికి అన్యాయం జరిగిందని, అసలు మెరిట్‌ లిస్టులోగానీ, వెయిటింగ్‌ లిస్ట్‌లోగానీ లేనివారు చివరిలో విజేతల జాబితాకెక్కారని, మెరుగైన మార్కులతో ఉత్తీర్ణులై ఇంటర్వ్యూలో సైతం నెగ్గినవారికి ఉద్యోగాలు నిరాకరించారని ఆ ఆరోపణల సారాంశం. అయినా ప్రభుత్వం కిమ్మనలేదు. దీనిపై హైకోర్టు నియమించిన విశ్రాంత న్యాయమూర్తి ఆధ్వర్యంలోని నలుగురు సభ్యుల కమిటీ 2021లో ఎన్నో అవకతవకలు బయటపెట్టింది. అభ్యర్థుల ఓఎంఆర్‌ షీట్‌ల మూల్యాంకనానికి నియమించిన సంస్థ దాన్ని మరో సంస్థకు అప్పగించటమూ వెల్లడైంది. సీబీఐ దర్యాప్తులో కీలక సాక్ష్యాధారాలున్న మూడు హార్డ్‌ డిస్క్‌లు స్వాధీనమయ్యాయి. అయిదుగురు అరెస్టయ్యారు. అభ్యర్థుల ఓఎంఆర్‌ షీట్లు గల్లంతయినట్టు కనుక్కుంది. తమ అవకతవకలు కప్పి పుచ్చేందుకు నిబంధనల సాకుచూపి 2019లోనే వాటిని ధ్వంసం చేసినట్టు నిర్ధారణైంది. ఆ సంస్థ నివేదిక ఆధారంగా మొత్తం రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియను రద్దుచేస్తూ, తిరిగి నోటిఫికేషన్‌ ఇచ్చి నియామకాలు చేయాలని ఆదేశిస్తూ నిరుడు ఏప్రిల్‌లో కలకత్తా హైకోర్టు తీర్పునిచ్చింది. దీనిపై మొదట్లో సుప్రీంకోర్టు స్టే ఇచ్చినా హైకోర్టు తీర్పునే సమర్థిస్తూ ఈ నెల 3న తీర్పునిచ్చింది. మొత్తం రిక్రూట్‌మెంట్‌ రద్దు చేయటం భావ్యంకాదని, ఇందులో నిజాయితీగా ఎంపికైనవారూ ఉన్నారని ప్రభుత్వం చేసిన వాదనతో సుప్రీం ఏకీభవించలేదు. ఓఎంఆర్‌ షీట్లు లేకుండా ఆ సంగతెలా నిర్ధారిస్తామంది.హఠాత్తుగా ఉద్యోగాల నుంచి గెంటేయటం బాధాకరమనటంలో సందేహం లేదు. ఎందుకంటే ఎంపికైన వారంతా అవినీతిపరులు కాదు. వారి సంఖ్య 5,300 మించివుండదంటున్నారు. ఇలాంటి ఎంపికల్లో మొత్తం ప్రక్రియను భ్రష్టుపట్టించటం ఎంతటి అవినీతిపరులకైనా అసాధ్యం. కానీ సరైన మార్గంలో వచ్చినవారెవరో తెలిసేదెలా? ఇందుకు ప్రధానంగా నిందించాల్సింది ప్రభుత్వాన్నే. ఈ రిక్రూట్‌మెంట్‌ను సవాల్‌ చేస్తూ పిటిషన్‌ దాఖలు చేసిన సీపీఎం నేత, న్యాయవాది వికాస్‌రంజన్‌ భట్టాచార్యకు నోబెల్‌ బహుమతి ఇవ్వాలని మమత వ్యంగ్యంగా వ్యాఖ్యానించటం సరేగానీ... తన వంతు ఆమె చేసిందేమిటి? ఒకపక్క ఆరోపణలొస్తున్నప్పుడు ఓఎంఆర్‌ షీట్లు భద్రపరచటం వంటి కనీస చర్యనైనా ఎందుకు తీసుకోలేకపోయారు? ఉపద్రవం ముంచుకొస్తున్నదని తెలిసినా నిమ్మకు నీరెత్తినట్టు ఎలావున్నారు? ఓఎంఆర్‌ షీట్లుంటే అక్రమార్కుల నిర్ధారణ సులభమయ్యేది. నిజాయితీ పరులకు రక్షణ దొరికేది. అయినా తమ వద్ద కచ్చితంగా నిర్ధారించగల ఇతరేతర సాక్ష్యాలున్నాయని ఉన్నతాధికారులంటున్నారు.ఉద్యోగాలు కోల్పోయిన టీచింగ్, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది ఆగ్రహం అర్థం చేసుకోదగిందే. వారు ఇప్పటికే తమకంటూ గూడు నిర్మించుకుని వుంటారు. నెలవారీ వాయిదాల్లో చెల్లించేలా రుణాలు తీసుకుంటారు. అనారోగ్యం వల్లనో, మరే ఇతర కారణంతోనో దొరికినచోట అప్పుచేస్తారు. ఈ రుణవలయం నుంచి బయటపడేదెలా? అందరూ దొంగలు కాదు. అయినా కొలువు పోయింది... జీవనాధారం మాయమైంది, కానీ అదొక్కటే సమస్య కాదు తమ శిష్యుల ముందు చులకనై పోయారు. అవినీతిపరులన్న ముద్రపడింది. దీన్ని చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. విద్యా ర్థులది మరో సమస్య. వార్షిక పరీక్షలు దగ్గర పడుతుండగా గురువులు లేకపోవటం, కొన్నిచోట్ల సిబ్బంది కొరతతో యూనిట్‌ పరీక్షలు వాయిదా పడటం వారిని కలచి వేస్తోంది. అస్తవ్యస్త పాలనకు బెంగాల్‌ చిరునామాగా మారింది. నిరుడు ఆగస్టులో ఆర్‌జీ కార్‌ ఆస్పత్రిలో ఒక మహిళా వైద్యు రాలిపై అత్యాచార ఉదంతంలో సైతం స్పందన అంతంతమాత్రం. చివరకు సుప్రీంకోర్టు జోక్యం తప్పలేదు. ఇప్పుడు ఎస్‌ఎస్‌సీ స్కాంలోనూ అదే నిర్వాకం. ప్రస్తుతం నిజంగా అర్హులైన ఉపాధ్యాయులను గుర్తించి వారికి న్యాయం చేసేందుకు ఏయే అవకాశాలున్నాయో చూడటం, తమ దగ్గరున్న సాక్ష్యాధారాలివ్వటం తప్ప మరే మార్గమూ లేదు. దానికి బదులు కోర్టుల్ని నిందించి, మరొకరిని తప్పు బట్టి ప్రయోజనం లేదని మమతా బెనర్జీ గ్రహించాలి.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement