
ఒకప్పుడు మంచి కాలక్షేపాన్ని అందించే నేస్తాలుగా, అలసిన జీవితాలకు ఆహ్లాదాన్నిచ్చే ఆప్తులుగా భావించిన నగరవాసులు.. ఇప్పుడు పెట్స్‌ను స్టేటస్ సింబల్‌గా చూస్తున్నారు. లక్షలు, కోట్లు వెచ్చించి ఖరీదైన బ్రీడ్స్‌ను కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో మన వాతావరణానికి నప్పని వాటిని ఎంచుకోవడం పొరపాటవుతుందని పెట్ స్పెషలిస్ట్‌లు హెచ్చరిస్తున్నారు.
గతంలో సింబా అనే ఒక సెయింట్ బెర్నార్డ్‌ను గతంలో బర్కత్‌పురాకు చెందిన జంతు కార్యకర్తలు రక్షించారు. దాన్ని ఒక కాంపౌండ్ లోపల బంధించి ఉంచారు. సరైన ఆహారం ఇవ్వకపోవడంతో, కంటి చూపు కోల్పోయి అనారోగ్యం భారిన పడిన సింబా ఆ తర్వాతు జంతు ప్రేమికుల సంరక్షణలో కోలుకుంది. అలా సింబా మాదిరిగానే, మరికొన్ని శునకాలనూ వాటిని తగిన విధంగా చూసుకోలేని యజమానులు వాటి ఖర్మానికి వదిలేస్తున్నారు.
కొంపల్లి హైవే పైన గ్రేట్ డేన్ ను రక్షించిన శునకాల బిహేవియర్ థెరపిస్ట్ పన్నీరు తేజ మాట్లాడుతూ, ఈ విదేశీ జాతి శునకాలను చాలా వరకూ అక్రమ పెంపకందారుల నుంచి కొనుగోలు చేస్తారని, అయితే అనారోగ్య పరిస్థితి ఏర్పడిన తర్వాత వదిలివేస్తారని తెలిపారు. ‘చాలా మంది పెంపుడు జంతువుల యజమానులు జాతి ఆహార నిర్వహణ అవసరాల గురించి అవగాహన లేకుండానే థోరోబ్రెడ్ శునకాలను కొనుగోలు చేస్తారు’ అని ఆయన చెప్పారు.
అవగాహన, సంరక్షణ అవసరం..
జర్మన్ షెపర్డ్ వంటి భారీ బ్రీడ్స్ అపార్ట్‌మెంట్‌లకే పరిమితం కాకూడదని, మన వాతావరణ పరిస్థితులకు అవి తగినవి కాదని నిపుణులు అంటున్నారు. ఇటువంటి శునకాలు అనేక అనారోగ్యాలకు గురవుతాయి, ‘కుక్కపిల్లని ఇంటికి తీసుకురావడం అంటే అది జీవితకాల బాధ్యత. బిడ్డకు ఎంత శ్రద్ధ, సంరక్షణ, సమయం అవసరమో వాటికీ అంతే అవసరం.
ఇటీవల, నగరవాసులు కొందరు చౌ చౌస్, సెయింట్ బెర్నార్డ్స్, సైబీరియన్ హస్కీలు, అలాస్కాన్ మాలమ్యూట్స్ వంటి బ్రీడ్స్‌ను పెట్స్‌గా ఎంచుకుంటున్నారు. అయితే ఇవి మన వాతావరణానికి సరిపోవు. ఇవి సున్నా కంటే తక్కువ ఉష్ణోగ్రతలలో మాత్రమే తగిన విధంగా పెరుగుతాయి. భారతీయ వాతావరణానికి ఎప్పటికీ సర్దుబాటు కావు’. అంటూ పెట్ నిపుణుడు మురళి చెబుతున్నారు.
సరిపడకపోతే.. అనారోగ్యాల వెతే..
నప్పని నగర వాతావరణం వల్ల కొన్ని బ్రీడ్స్ అనేక అనారోగ్యాలకు గురవుతాయి. గ్యాస్ట్రోఎంటిరైటిస్, హీట్ స్ట్రోక్, వైరల్ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు సులభంగా గురవుతాయి. కాబట్టి ఇండియన్ బ్రీడ్స్ లేదా దశాబ్దాల తరబడి భారతదేశంలో భాగమైన జాతులను దత్తత తీసుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇక్కడి వాటికి ఇన్ఫెక్షన్ల నిరోధకత కలిగి ఉంటాయి. కఠినమైన వాతావరణాన్ని తట్టుకోగలవు అని చెబుతున్నారు.
(చదవండి: పీరియడ్స్ వచ్చి వెయ్యి రోజులు.. అయినా తగ్గలేదు.. వైద్యులకే అంతుచిక్కని మిస్టరీ..!)