
మనం ఎంతో ఇష్టపడే వ్యక్తులను కలిసినా..వారికి ఆతిథ్యం ఇచ్చే అవకాశం దొరికినా..ఎంతో ఖుషీగా ఫీలవుతాం. అలాంటిది మనం కలలో కూడా కలిసే అవకాశం లేని ఓ ప్రముఖ సెలబ్రిటీ లేదా క్రికెట్‌స్టార్ లాంటి వాళ్లైతే ఇక ఆ మధుర క్షణాలు జన్మలో మర్చిపోం. మళ్లీ మళ్లీ ఆ క్షణాలు కళ్లముందు కదలాడుతూనే ఉంటాయి. అలాంటి అరుదైన అనుభవమే ఈ మాస్టర్ చెఫ్‌కి ఎదురైంది. తనెంతో ఇష్టపడే ప్రముఖ క్రికెటర్‌ని కలిసే అవకాశం రావడమే కాదు, అతనికి తన ప్రాంతం వంటకాలను రుచి చూపించే ఛాన్స్‌కొట్టేసింది. అసలు తాను ఇలాంటి ఓ అద్భుతం జరుగుతుందని ఎన్నడు అనుకోలేదంటూ ఉబ్బితబ్బిబవుతోందామె.
ఆ చెఫ్ మేఘాలయకి చెందిన నంబీ మారక్. ఆమె మాస్టర్ చెఫ్ రన్నరప్ కూడా. ఆమె షిల్లాంగ్‌లోని తన ఇంటి గోడలపై సచిన్ టెండూల్కర్ పోస్టర్‌లను చూస్తూ పెరింగింది. అలాంటి ఆమెకు అనుకోని అవకాశం వరంలా వచ్చిపడింది. తనెంతో ఇష్టపడే ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తమ రాష్ట్రాన్ని పర్యటించడానికి రావడం ఓ ఆశ్చర్యం అయితే..ఆయనకు స్వయంగా తన చేతి వంటే రుచిచూపించడం మరో విశేషం.
చెఫ్ నంబీ సచిన్‌కి తన ప్రాంత గారో సంప్రదాయ వంటకాలతో ఆతిధ్యం అందించింది. తన క్రికెట్ హీరోకి వండిపెట్టే ఛాన్స్ దొరికిందన్న సంబరంతో..ఎంతో శ్రద్ధపెట్టి మరీ వెజ్, నాన్‌వెజ్ వంటకాలను తయారు చేసింది. అవన్నీ ఇంటి వంటను మరిపించేలా రుచికరంగా సర్వ్ చేసింది. ఆ రెసిపీలలో.. వెటెపా (అరటి ఆకులలో ఉడికించిన మృదువైన చేప), కపా అండ్ గారో, గుమ్మడికాయ చికెన్(డూ'ఓ గోమిండా)..పితా అనే స్టిక్కీ రైస్ తదితరాలను అమిత ఇష్టంగా ఆరగించాడు సచిన్.
వాటిన్నింటిలో సచిన్ మనసును మెప్పించని వంటకం మాత్రం గుమ్మడికాయ చికెన్ కర్రీనే కావడం విశేషం. ఇక చివరగా చెఫ్ నంబీ మాట్లాడుతూ.."గారో వంటకాలు కేవలం ఆహారం మాత్రమే కాదు. ఇవి మా ప్రాంతంలోని ఒక్కో ఇంటి సంప్రదాయానికి సంబంధించిన ప్రసిద్ధ వంటకాలు. ఈ రెసిపీలని నిప్పుల మీద ఎంతో శ్రమ కోర్చి వండుతారు. అలాంటి అపురూపమైన వంటకాలను నా కిష్టమైన క్రికెటర్ సచిన్‌కి వండిపెట్టడం ఓ కలలా ఉంది. నిజంగా ఇది ఓ ట్రోఫీ గెలిచిన దానికంటే ఎక్కువ. "అని ఆనందపారవశ్యంతో తడిసిముద్దవుతోంది చెఫ్ నంబీ.
(చదవండి: World Health Day: వ్యాధులకు చెక్‌పెట్టి.. ఆరోగ్యంగా జీవిద్దాం ఇలా..!)