అనుకోకుండా హ్యాపీ'షెఫ్‌' | Chef Anu Hasan Special Story on Lifestyle | Sakshi
Sakshi News home page

అనుకోకుండా హ్యాపీ'షెఫ్‌'

Published Sat, Feb 15 2020 10:48 AM | Last Updated on Sat, Feb 15 2020 10:48 AM

Chef Anu Hasan Special Story on Lifestyle - Sakshi

షెఫ్‌ అను హసన్‌

ఆత్మీయుల్ని చూడగానే నేత్రాలుసజలాలైనట్టుగా ఆత్మకింపైన భోజనంఅగుపించగానే నోరు నీరూరుతుంది.ఆత్మారాముణ్ణి సంతృప్తిపరచేఆహారాన్ని లోనికి ఆహ్వానించి...అతిథికి నీళ్లిచ్చినట్టుగానే
లాలాజలంతో అభిషేకించిమరీ గౌరవిస్తుంది.అంతటి గౌరవం పొందాలంటేవంట రుచిగా ఉండాలి.చవులూరించే ఎన్నో వంటల్నిచెవులు పట్టుకు లాక్కొచ్చే పనిలో ఉంది అను హసన్‌.  

సాధారణ ఇల్లాలి నుంచి సెలెబ్రిటీ మహిళ దాకా.. వంట చేయడాన్నే అభిరుచిగా మలచుకుంటున్నవారెందరో అనూ హసన్‌తో సహా. పాకశాస్త్రానికున్న పాపులారిటీ అది. సుహాసిని దర్శకత్వంలో వచ్చిన ఇందిర సినిమాతో నటిగా పరిచయమైంది అను హసన్‌. తర్వాత జేఎఫ్‌డబ్ల్యూ (జస్ట్‌ ఫర్‌ విమెన్‌) మ్యాగజైన్‌లో ‘సన్నీ సైడ్‌ అప్‌’ అనే పేరుతో కాలమ్‌ రాసింది. ఆపేరుతోనే పుస్తకాన్నీ తెచ్చింది. ఇప్పుడు అదే జెఎఫ్‌డబ్ల్యూ యూట్యూబ్‌ చానెల్‌కు షెఫ్‌గా మారి ‘గెట్‌ సెట్‌ కుక్‌’ కార్యక్రమాన్ని హోస్ట్‌ చేస్తోంది అను హసన్‌. 

‘జీవితం చిన్నది.. ప్రపంచం విశాలమైంది. అందుకే నన్ను నేను ఒక్క పనికే పరిమితం చేసుకోవడానికి ఇష్టపడను. కాబట్టి సినిమాకే ముడిపడి లేను. నా శక్తి సామర్థ్యాల మేరకు వీలైనన్ని రంగాల్లో నైపుణ్యం పెంచుకోవడానికి ప్రయత్నిస్తాను. చిత్రలేఖనం, సంగీతం, జనాలతో ఇంటరాక్ట్‌ అవడం, ట్రావెల్, ఫుడ్‌.. ఏదైనా సరే.. వీలైనన్నింటిలో ప్రవేశం కోసం ప్రయత్నిస్తాను. వాటిలో ఒకటే జేఎఫ్‌డబ్లు్య వారి షో కూడా. చాలా సంతోషాన్నిస్తోంది ఈ కొత్త ఉద్యోగం’ అంటూ వంట.. ఆహారంతో ముడిపడి ఉన్న తన జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం మొదలుపెట్టింది అను. 

ప్రేమనుపంచడమే..‘ముందు ఈ కుకరీ షోలో అవకాశం ఎలా వచ్చిందో రెండు మాటల్లో చెబుతా. కిందటేడు అక్టోబర్‌లో బీనా సుజిత్‌ ( ఈ షో నిర్వాహకురాలు) నన్ను కలిసి ‘‘మీతో ఒక కుకరీ షో స్టార్ట్‌ చేస్తే ఎలా ఉంటుందోని ఆలోచిస్తున్నా’’ అంది. ఆ మాట వినగానే ఉత్సాహపడ్డా.. పైగా చిన్నప్పటి నుంచి వండడం, వండినదాన్ని పదిమందికి వడ్డించడమంటే మహా ఇష్టం. దాంతో ఆ ఆఫర్‌ను వెంటనే ఒప్పేసుకున్నా. గెట్‌ సెట్‌ కుక్‌ అంటూ వంట మొదలుపెట్టేశాను. నన్నడిగితే యాంత్రికంగా చేసేది కాదు వంట. ఇది జీవితంలోని భావోద్వేగాలను రిఫ్లెక్ట్‌ చేస్తుంది. చక్కటి రుచికి కావల్సిన దినుసులు తగిన మోతాదులో ఎలా పడాలో జీవితానికీ సెట్‌ ఆఫ్‌ ఎమోషన్స్‌ అంతే అవసరం. నా ఈ షో.. వంట చేయడం ఎంత తేలికో లైఫ్‌ను హ్యాండిల్‌ చేయడమూ అంతే తేలిక అనే సందేశాన్నిస్తుంది. అంతేకాదు వంట చేయడం పట్ల విముఖంగా ఉన్న వాళ్లలో దానిపట్ల ఆసక్తినీ రేకెత్తిస్తుంది. కుగింగ్‌ అంటే ప్రేమను పంచడమే. ఇందుకు నా జీవితంలోని సంఘటనే మంచి ఉదాహరణ.

క్రిస్మసే నీ దగ్గరకు..నా తల్లిదండ్రులు ఒకరి తర్వాత ఒకరు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లారు. దాంతో యేడాది కిందటి క్రిస్మస్‌ నాకు విషాదంగానే గడిచింది. ఆ పండగరోజు.. ఇంట్లో  (యూకేలో) ఒక్కదాన్నే దిగులుగా కూర్చున్నా. నా ఫ్రెండ్‌ ఫోన్‌ చేసింది.. వాళ్ల దగ్గరకు రమ్మని. వెళ్లడం ఇష్టంలేక ఏవేవో బహుమానాలు ఇవ్వసాగాను. సరే నువ్వు మా దగ్గరకు రాకపోతే క్రిస్మసే నీ దగ్గరకు వస్తుంది అని అప్పటికప్పుడు నా ఫ్రెండ్‌ వచ్చేసింది మా ఇంటికి తన భర్త, పిల్లలను తీసుకొని. వాళ్లే ఇంటినంతా అలంకరించి.. వంట చేసి.. పిల్లలతో సందడి చేశారు. ఆ వంటలో వాళ్లు ప్రేమతో పెట్టిన తాలింపు నా ఒంటరితనాన్ని మాయం చేసింది. నిజంగానే ఆరోజు  క్రిస్మస్‌ నా దగ్గరకు వచ్చినట్టే అనిపించింది. ఇదొక్కటే కాదు వంటతో ముడిపడ్డ జ్ఞాపకాలు ఇంకా చాలానే ఉన్నాయి.

శివాజీ గణేషన్‌ ఇంటి నుంచి..బిర్యానీ, రొయ్యల తొక్కు అంటే పిచ్చి ఇష్టం.. అదీ శివాజీ గణేషన్‌ వాళ్లింటిది. కమల్‌ అంకుల్‌ కూతుళ్లు శ్రుతి, అక్షరలకు కూడా. ప్రతి ఆదివారం శివాజి గణేశన్‌ వాళ్లింటి నుంచి బిర్యాని, రొయ్యల తొక్కు వచ్చేది మా ఇంటికి. ఆ టిఫిన్‌ క్యారేజ్‌ కోసం శ్రుతి, అక్షరల దగ్గర్నుంచి మేమంతా ఎదురు చూసేవాళ్లం ఆకలితో. భలే ఉండేది ఆ వంటల రుచి. ఇంతకీ గెట్‌ సెట్‌ కుక్‌ షోలో నేను ఫస్ట్‌ వండిన వంటకం ఏంటో తెలుసా? మష్రూమ్‌ బిర్యానీ(నవ్వుతూ).

జనాలకు కావల్సింది.. ఎప్పుడూ డిమాండ్‌లో ఉండేవి మూడే మూడు.. రోటీ, కపడా ఔర్‌ మకాన్‌.  ఈ మూడింట్లో ఫుడ్‌ ఎంత ముఖ్యమైందో వేరే చెప్పక్కర్లేదు కదా. ఆహారం విషయంలో మనమెప్పుడూ కొత్త రుచులకోసం అన్వేషిస్తూనే ఉంటాం. చాలా మంది అడుగుతుంటారు.. అంతర్జాతీయంగా కుకింగ్‌కు సంబంధించి మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియాలో కూడా ప్రఖ్యాత మాస్టర్‌ షెఫ్స్‌తో వంటల కార్యక్రమాలు టెలికాస్ట్‌ అవుతున్నాయి. జాతీయస్థాయిలో కూడా తక్కువేం లేవు. వాళ్లతో మీరు పోటీ పడగలరా అని . నేను మాస్టర్‌ షెఫ్‌ను కాను. కాని..  షెఫ్‌నే. హ్యాపీ షెఫ్‌ను. ప్రెజెంటర్‌గా.. చాలా కాన్ఫిడెంట్‌గా ఈ షోను నిర్వహిస్తున్నాను అని మాత్రం చెప్పగలను’ అంటూ  ముగించింది సుహాసినికి చెల్లెలి వరుసయ్యే అను హాసన్‌.              

రుక్మిణీతో అన్నం..కుకర్‌ అంటే భయం
నాకు తొమ్మిదేళ్లనుకుంటా.. అప్పడు మేం ట్రిచీలో ఉండేవాళ్లం. మా పెరట్లో రెండు కొబ్బరి చెట్లు, ఒక మామిడి చెట్టు.. త్రికోణాకారంలో ఉండేవి. సెలవుల్లో ఒకరోజు ఆ మూడు చెట్ల  మధ్య ఇటుకలతో పొయ్యి పేర్చి.. నా ఫ్రెండ్‌తో వంటల కార్యక్రమం పెట్టా. ఆ టైమ్‌లో మట్టి పొయ్యి మీద అన్నం వండడానికి రుక్మిణీ అనే పేరున్న రాగి పాత్ర ఉండేది. అంటే ప్రెషర్‌ కుకర్‌ లాంటిది.. దాంట్లో అన్నం వండాను. పచ్చడీ చేసుకున్నాం. అయితే భయంకరమైన ఎక్స్‌పీరియెన్సూ ఉంది అదీ నా చిన్నప్పటిదే. ఒకసారి మా ఇంట్లో ప్రెషర్‌ కుకర్‌ పేలి.. అన్నమంతా గోడలకు.. పైకప్పుకీ చిమ్మింది.. అక్కడే ఉన్న నా ఒంటికీ అతుక్కున్నాయి కొన్ని మెతుకులు. దాంతో కేకలేస్తూ అక్కడినుంచి పరుగో పరుగు. అందుకే ప్రెషర్‌ కుకర్‌ అంటే ఇప్పటికీ నాకు భయమే.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement