యువ కథ: సింహాసనం | sakshi funday special story | Sakshi
Sakshi News home page

యువ కథ: సింహాసనం

Published Sun, Apr 13 2025 12:27 PM | Last Updated on Sun, Apr 13 2025 12:27 PM

sakshi funday special story

‘లైట్స్‌.. కెమెరా.. యాక్షన్‌!’ అన్నాడు డైరెక్టర్‌ బాలరాజ్‌ వర్మ. ట్రైన్‌ సెట్‌లో హీరోయిన్‌ సనుష దాస్‌ను చుట్టుముట్టిన రౌడీల బారి నుంచి హీరో నితీష్‌ కాపాడే సన్నివేశం చిత్రీకరణ జరుగుతోంది. ఒకే షాట్‌లో తీయాల్సిన కీలకమైన సన్నివేశం కావటంతో సినిమా యూనిట్‌ మొత్తం చాలా ఏకాగ్రతతో ఎవరి పని వారు చేస్తున్నారు. ఇంతలో గేదెల అరుపులకు షాట్‌ ఫెయిల్‌ అయింది. ఆ షాట్‌ బాగా రావటం కోసం చాలా ప్రాక్టీస్‌ చేసిన నితీష్‌కు పట్టరాని కోపం వచ్చింది. అ కోపంలో నితీష్‌ ‘ఎవడ్రా! ఆ గేదెలను ఇక్కడికి తీసుకువచ్చింది?’ అంటూ గట్టిగా అరిచాడు.‘గేదెల దొడ్లో గేదెలు కాక గాడిదలు ఉంటాయా? అడ్డ గాడిద!’ అని అరుస్తూ కుడితి నీళ్ళు నితీష్‌ మొఖం మీద కొట్టి నిద్రలేపాడు నూకరాజు.‘

మంచి కల పాడు చేశావ్‌ కదా నాన్నా! నా జీవితంలో నిద్రలో వచ్చే కలలు కూడా పూర్తి అవ్వవు. ఛీ!’ అంటూ లేచాడు నితీష్,‘ఏడిసావులే గాని గేదెలను తోలుకుపోయి, అందరికీ పాలు పోసి రా! లేట్‌ అయిందని నాకు మాట వస్తే నిన్ను బిందెట్టుకు కొడతా’ అన్నాడు నూకరాజు.బద్ధకంగా లేచి కాలకృత్యాలు తీర్చుకున్నాడు నితీష్‌.సైకిల్‌ స్టాండ్‌ తీసి, ప్రతి రోజులాగానే గేదెలను తీసుకుని ప్రతి ఇంటికి వెళ్ళి పాలు పోశాక మేనమామ సుంకరరాజు ఇంటికి వచ్చాడు. ‘ఏరా! ఈ మధ్య కనపడటం లేదు. బొత్తిగా ఇంటికి రావటం మానేశావ్‌?’ అన్నాడు సుంకరరాజు. 

‘అదేంలేదు.. కొత్త ఇల్లు కడుతున్నాము కదా! అక్కడే దగ్గర ఉండి చూసుకుంటున్నా మావయ్య!’ అన్నాడు నితీష్‌. ‘దానితో పాటు ఏదో ఒక ఉద్యోగం చూసుకోవచ్చు కదరా! యాక్టర్, ట్రాక్టర్‌ అంటూ ఖాళీగా ఎన్నాళ్లు ఉంటావ్‌?’ అన్నాడు సుంకరరాజు. ఆ ఉచిత సలహా విన్న నితీష్‌ కాసేపు మౌనంగా ఉండిపోయాడు.  ‘అన్నట్టు చెప్పటం మర్చిపోయా. నిన్ననే స్నేహకి ఒక సంబంధం కుదిరింది. అబ్బాయి వాళ్ళది చాలా పెద్ద కుటుంబం. హైదరాబాద్‌లో ఉంటారు. అబ్బాయి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. నెలకి లక్షన్నర జీతం. రెండు నెలలలో పెళ్లి అనుకుంటున్నాము. నువ్వే దగ్గర ఉండి చూసుకోవాలి’ అన్నాడు సుంకరరాజు. 

ఇంతలో నితీష్‌ మరదలు స్నేహ ఇంటి డాబాపై నుంచుని సిగ్గు పడుతూ, సెల్‌ ఫోన్‌లో మాట్లాడటం చూశాడు నితీష్‌. ఆమె ఎవరితో మాట్లాడుతోందో అర్ధం చేసుకున్న నితీష్, ‘సరే మావయ్య! ఉంటాను’ అని వెనుదిరిగాడు.పని పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చిన నితీష్‌ తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. నెమ్మదిగా అద్దం ముందుకు వచ్చి నిలబడి తనని తాను ఒక నిమిషం పాటు చూసుకుంటూ ఉండిపోయాడు. నితీష్‌ కళ్ళు ఎర్రబడ్డాయి. కుడి చేతి పిడికిలి బిగుసుకుంది. తుఫాను ముందు వచ్చే నిశ్శబ్దంలా ఉంది ఆ ఒక్క నిమిషం. తనలో పీకల వరకు నిండిపోయిన బాధని, కోపాన్ని, నిస్సహాయతను దిగమింగుకున్నాడు. రోజూలాగే తనకు ఇష్టమైన నటులు ఎన్టీఆర్, విక్రమ్‌ నటించిన సినిమాలు అన్నీ అదే పనిగా చూసి, వాటినే తనదైన శైలిలో సాధన చేయటంతో ఎప్పటిలాగే సమయం తెలియకుండానే గడిచిపోయింది.

సాయంత్రం సుమారు ఐదు గంటలకి స్నేహితుడు జాన్‌బాబుతో కలిసి వీధి చివర టీ షాపుకి వచ్చి కూర్చున్నాడు. నితీష్‌ ఏమీ మాట్లాడకుండా అలా మౌనంగా కూర్చోడం గమనించిన జాన్‌బాబు మళ్ళీ ఏదో జరిగిందని అర్థం చేసుకున్నాడు. ‘ఇదిగోరా టీ..’ అని టీ గ్లాసు చేతికి అందించాడు. ఇంతలో గట్టునాని, అతని స్నేహితులు వచ్చి ఎదురు బెంచీ మీద కూర్చున్నారు. నానికి, నితీష్‌కు స్కూల్‌లో చదువుకునే రోజుల నుంచి వైరం ఉంది. అది తెలిసిన జాన్‌ అక్కడి నుంచి త్వరగా టీ తాగి నితీష్‌ను తీసుకుని వెళ్ళిపోదాం అనుకున్నాడు.కానీ నివురుగప్పిన నిప్పులా లోపల రగిలిపోతూ బయటకి ప్రశాంతంగా కనిపిస్తున్న నితీష్‌తో ‘ఏరా! ఆ సర్పంచ్‌ బావమరిది సినిమాలో వేషం ఇస్తా అని రెండు లక్షలు దొబ్బేశాడంటగా?’ అన్నాడు నాని. చేతిలోని టీ గ్లాసుని చూస్తూ మౌనంగా ఉండిపోయాడు నితీష్‌. ‘అయినా నీ మొఖానికి సినిమాలు ఎందుకురా? మా ఫెర్టిలైజర్స్‌ కంపెనీ యాడ్‌కి కూడా పనికిరావు’ అన్నాడు నాని వెటకారంగా. 

చుట్టూ ఉన్న అందరూ నవ్వడం చూసి జాన్, నితీష్‌ భుజం మీద చేయి వేసి ‘పద వెళ్దాం’ అన్నాడు. నితీష్‌ ఇంకా ఆ టీ గ్లాస్‌నే చూస్తూ అలా ఉండిపోయాడు.‘అవును స్నేహ నిన్ను వదిలేసిందంటగా! మంచిపని చేసిందిరా బాబు. నీలాంటి వాడిని పెళ్లి చేసుకుంటే అడుక్కు తినాలి’ అన్నాడు నాని. నితీష్‌ చేయి బిగుసుకుంది. చేతిలో ఉన్న టీ నాని మొఖం మీద కొట్టి, రెప్పపాటులో నాని చేయి వెనక్కి వంచి పక్కనే ఉన్న నారింజ మిఠాయి సీసాతో తల పగలగొట్టాడు. వెంటనే నాని స్నేహితులు నితీష్, జాన్‌ మీద పడి, పిడిగుద్దులు కురిపించారు. నితీష్‌ దొరికినవాడినిదొరికినట్టు కొడుతూ పక్కనే ఉన్న పంట కాలువలోకి తోసి జాన్‌తో కలిసి ఆరోజుకి అక్కడి నుంచి తప్పించుకున్నాడు.రాత్రికి ఇంటికి చేరుకున్న నితీష్, కాళ్ళు చేతులు కడుక్కుని భోజనానికి కూర్చున్నాడు. పక్కనే కూర్చున్న నూకరాజు, నితీష్‌ చేతి మీద మొఖం మీద గాయాలు చూశాడు. ‘మళ్ళీ దెబ్బలు తిన్నావా?’ అన్నాడు నూకరాజు అనుమానంగా చూస్తూ.

‘లేదు ..ఈసారి వాడి బుర్ర పగలగొట్టా’ నసిగాడు నితీష్‌ కోపంగా.‘అబ్బో! చాలా గొప్ప పని చేశావ్‌. థూ.. ఏం బతుకురా నీది? ముడ్డి కిందకి పాతికేళ్లు వచ్చినా, వయసు మళ్లిన నాన్న గురించి గాని, మంచం పట్టిన అమ్మ గురించి గాని ఏరోజైనా ఆలోచించావా? అదిగో బయట దొడ్డిలో గేదెల దగ్గర పడుకుంటావు కదా! అవి కనీసం పెట్టిన తిండికి తిరిగి పాలైనా ఇస్తాయి. నీ కన్నా అవే నయం. ‘అమ్మకి ఏమయింది?’ అని చిన్నప్పటి నుంచి అడుగుతున్నావు కదరా. ఇప్పుడు విను.. నీ చిన్నప్పుడు నువ్వు బావిలో పడబోతుండగా నిన్ను కాపాడి తలకి దెబ్బ తగిలించుకుని మంచం పట్టింది. ఆరోజు నిన్ను కాపాడకపోయినా బాగుండు’ అని కోపంగా తింటున్న కంచంలో చేయి కడుక్కుని లేచి వెళ్లిపోయాడు నూకరాజు.మరుసటి రోజు ఉదయం నూకరాజు లేచి చూసేసరికి, నితీష్‌ ఇంట్లో ఎక్కడా కనపడలేదు. ఊరంతా వెతికినా ప్రయోజనం లేకపోయింది. చివరికి జాన్‌ ఫోన్‌కి నితీష్‌ నుంచి మెసేజ్‌ వచ్చింది. ‘నేను హైదరాబాద్‌ వెళుతున్నాను. నన్ను వెతుక్కుంటూ ఎవరూ రాకండి. 

సినిమా హీరో అయ్యాకనే మళ్ళీ అనకాపల్లిలో అడుగు పెడతా. లేకపోతే నా శవం కూడా ఎవరికీ దొరకదని నాన్నకి చెప్పు’ అని ఉంది.నితీష్‌ తన సైకిల్‌ అమ్మేయగా వచ్చిన మూడువేల రూపాయిలు, రెండే జతల బట్టలతో మర్నాడు సికింద్రాబాద్‌  రైల్వే స్టేషన్‌లో దిగాడు. ఫిల్మ్‌ నగర్‌ దగ్గరలో జూనియర్‌ ఆర్టిస్టులు ఉండే ఒక అతి చవక హాస్టల్‌లో దిగాడు. రోజులు నిమిషాల్లా గడిచిపోతున్నాయి. నితీష్‌ హాజరు కాని స్టూడియో లేదు. ముట్టుకోని డైరెక్టర్‌ ఇంటి గేట్‌ లేదు. ఎంత నిరాశ ఎదురు వచ్చినా అది నితీష్‌ ముఖంలో కనపడలేదు. ఆరోజు అర్జున స్టూడియోస్‌లో డైరెక్టర్‌ రాజకుమార్‌ పూర్తిగా కొత్త నటీ నటులతో ఒక సినిమా కోసం ఆడిషన్‌ చేయబోతున్నాడని తెలిసింది నితీష్‌కి. తన వివరాలు, నటించిన వీడియోలు, ఫొటోలు పంపించాడు. ఈసారి నిరాశ ఎదురవలేదు.

‘వచ్చే ఆదివారం మీరు తప్పక హాజరు కాగలరు’ అని సమాధానం వచ్చింది. ఈ అవకాశం ఎటువంటి పరిస్థితుల్లోనూ చేజార్చుకోకూడదు అని నిర్ణయించుకున్నాడు.చివరికి ఆడిషన్‌కు హాజరయ్యి రంగస్థలం మీద అడుగు పెట్టాడు. అందరూ అనుకుంటున్నట్టు డైరెక్టర్‌ ఆ క్యారెక్టర్‌కి రాసిన డైలాగులు చూసి తనదైన శైలిలో చెప్పమని అడగలేదు. ‘ఇప్పటిదాకా నీ జీవితాన్ని, కొన్ని మరచిపోలేని సంగతులని నీ శైలిలో చెప్పు’ అన్నాడు డైరెక్టర్‌. అలా చేయటం నితీష్‌కి కొత్త అయినప్పటికీ రెండు నిమిషాలు ఆగి గట్టిగా శ్వాస తీసుకుని నోరు విప్పాడు.‘నాకు ఊహ తెలిసినప్పటి నుండి నన్ను కన్న తల్లి ఎందుకు మంచం పట్టిందో నిన్నటి వరకు తెలుసుకోలేని మూర్ఖుడిని. వయసు మళ్లిన, అనారోగ్యంతో ఉన్న తండ్రిని ఆనందంగా చూసుకోకపోగా, నాన్న కష్టపడి సంపాదించిన డబ్బుని నా వయసు ఉన్న మిగతా అబ్బాయిల్లాగా జీవితాన్ని ఎంజాయ్‌ చేయాలని, నా తరఫు నుంచి ఒక్క రూపాయి సంపాదన లేకపోయినా, పందికొక్కులా మొత్తం గుల్ల చేస్తున్న నీచమైన కొడుకుని నేను. 

ప్రాణంగా ప్రేమించి తనతో ఒక జీవితాన్ని ఊహించుకున్న అమ్మాయి, డబ్బు పరపతి లేకపోతే ముఖం కూడా చూడదని గ్రహించలేకపోయిన మూర్ఖపు ప్రేమికుడిని. కాని, ఒక్కటి మాత్రం బలంగా చెప్పగలను. ఎదురుదెబ్బ ఎటువైపు నుంచి అయినా రానీ, ఎలాగైనా రానీ వాటిని వంచి ఈ సినిమా అనే సింహాసనం మీద ఎక్కి కూర్చుంటా!’ అన్నాడు నితీష్‌ ఉద్వేగంగా.నితీష్‌ ప్రదర్శన చూసి డైరెక్టర్‌తో సహా మిగతా సభ్యులు కూడా చలించిపోయారు. అందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టి అభినందించారు. మరుసటి రోజు ఉదయం అసిస్టెంట్‌ డైరెక్టర్‌ బాబీ నుంచి కాల్‌ కోసం చూస్తూ కూర్చున్నాడు.ఏకంగా డైరెక్టర్‌ రాజకుమార్‌ నుంచే కాల్‌ రావటంతో నితీష్‌ రెట్టించిన ఉత్సాహంతో ‘హలో! సర్‌!’ అన్నాడు. ‘గుడ్‌ మార్నింగ్‌ నితీష్‌! మనం ఈ సినిమా చేస్తున్నాం.. ప్రొడ్యూసర్‌కి నీ బాడీ లాంగ్వేజ్‌ బాగా నచ్చింది. నీ ఆటిట్యూడ్,  డైలాగ్‌ డెలివరీ, మేము అనుకుంటున్న విలియమ్‌ పాత్రకి వంద శాతం కుదురుతుంది’ అన్నాడు డైరెక్టర్‌ రాజకుమార్‌.

‘కానీ సర్‌! నేను ఆడిషన్‌ ఇచ్చింది హీరో క్యారెక్టర్‌కి కదా సర్‌?’ అన్నాడు నితీష్‌.‘హహ.. నువ్వు స్క్రిప్ట్‌ చదివాక విలియమ్‌ క్యారెక్టరే చేస్తాను అని అడుగుతావ్‌’ అన్నాడు రాజకుమార్‌.‘సరే సర్‌!’ అన్నాడు నితీష్‌ ‘నీకు ఆకామడేషన్, కారు ప్రొడ్యూసర్‌గారు అరేంజ్‌ చేశారు. ఈవెనింగ్‌ షిఫ్ట్‌ అయిపో. నెక్స్‌›్టవీక్‌ నుంచి షూట్‌ చేయటానికి ప్లాన్‌ చేస్తున్నారు’ అన్నాడు రాజకుమార్‌.‘సరే సర్‌! థాంక్‌ యు సో మచ్‌’ అన్నాడు నితీష్‌ ఆనందంగా. అవతల ఫోన్‌ డిస్‌కనెక్ట్‌ అయ్యింది. వెంటనే నితీష్‌ వాళ్ళ నాన్న నూకరాజుకు ఫోన్‌ చేసి ‘అమ్మని తీసుకు వచ్చేయమని జాన్‌కి చెప్పు‘ అన్నాడు. ‘పెద్ద నటుడిని అయినప్పుడే వస్తా అని మాట ఇచ్చి వెళ్లిపోయావుగా? అది పూర్తిచేసి తిరిగి వచ్చి మమ్మల్ని తీసుకొని వెళ్ళు’ అని కాల్‌ కట్‌ చేశాడు నూకరాజు. రెండు నిమిషాలు బాధ పడినా నితీష్‌ మళ్ళీ తన యాక్టింగ్‌ సాధన కొనసాగించాడు. ఆరోజు ఏప్రిల్‌ 2, అర్జున స్టూడియోస్‌లో  రెగ్యులర్‌ షూట్‌ డే1. అదే రోజు స్నేహకి  మరొకరితో అనకాపల్లిలో పెళ్లి కూడా. 

నితీష్‌ తన కారు నుంచి బయటకి రాగానే  డ్రైవరు గొడుగు పట్టుకున్నాడు. మరో పక్క స్నేహని పెళ్లికి ముస్తాబు చేసి బాజా భజంత్రీలతో కళ్యాణమండపం వైపు తీసుకువెళుతున్నారు.. యాక్షన్‌ సీన్‌ చిత్రీకరణలో ఉంది. నితీష్‌ తన వైపు తరుముతూ వస్తున్న వ్యక్తిని తన చేతిలో ఉన్న చైన్‌తో మెడకు కట్టి ఐదో అంతస్తు నుంచి తోసి ఉరివేసి వేలాడతీసే సీన్‌. మరో పక్క స్నేహ పెళ్లి పీటల మీద తల వంచి తాళి కట్టించుకుంటోంది. నితీష్‌ ఆ రోజు షూటింగ్‌లో ఎంతగా నిమగ్నం అయ్యాడంటే స్నేహ పెళ్లి రోజు కూడా మర్చిపోయేంత. సంవత్సరం గడిచింది సినిమా విడుదలై రెండు రోజులు అయింది, ఏ టీవీ చానల్‌ చూసినా, సోషల్‌ మీడియా చానల్‌ చూసినా నితీష్‌ గురించి, నితీష్‌ నటన గురించే చర్చ. ఒక్కసారిగా టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌ అయిపోయాడు. నాలుగు రోజుల వ్యవధిలో వరుసగా ఐదు సినిమాలలో హీరోగా నటించేందుకు సంతకం చేశాడు. 

స్నేహ సీమంతం జరుగుతోంది. నితీష్‌ తండ్రి హడావుడిగా అటు ఇటు తిరుగుతున్నాడు. ఇంటికి వచ్చే జనాల తాకిడి ఎక్కువ అయింది. ‘బహుశా అల్లుడుగారు ఎక్కువ మందిని పిలిచి ఉంటారు’ అనుకున్నాడు సుంకరరాజు. ‘ఎవరయ్యా రెండు సింహాసనాలు తెచ్చింది? ఇది సీమంతం. పెళ్లి కాదు. ఒకటి సరిపోతుంది .రెండోది తీసుకుపొండి’ అన్నాడు. సుంకరరాజు. చూస్తూ ఉండగానే సుంకరరాజు ఇల్లు ఉండే ప్రాంతం అంతా ఇసుక వేస్తే రాలనంత జనంతో జనసంద్రం అయిపోయింది. అప్పటికి గాని అర్థంకాలేదు వాళ్ళు అందరూ సుంకర రాజు మేనల్లుడు హీరో నితీష్‌ని చూడటానికి వచ్చిన జనం అని.ఇంతలో ఒక వోల్వో కారు సుంకరరాజు ఇంటి ముందు ఆగింది. సూట్‌ వేసుకుని కారు దిగుతున్న నితీష్‌ని చూసి నూకరాజు, సుంకరరాజుల నోటి వెంట మాట రాలేదు. మేనల్లుడికి ఎదురెళ్లి దగ్గర ఉండి లోపలకి తీసుకు వస్తూ ‘నువ్వు వస్తావ్‌ అనుకోలేదు రా! చెప్పి ఉండాల్సింది కదరా!’ అన్నాడు.

‘ఇలా వస్తా అని నేనూ అనుకోలేదు మావయ్య!’ అని నవ్వుతూ వెటకారంగా అన్నాడు నితీష్‌. ఆ మాటలకి ఎలా స్పందించాలో తెలియని సుంకరరాజు ఒక అర నవ్వు నవ్వి, ఏమీ మాట్లాడకుండా ఉండిపోయాడు. జనంలో నుండి ఇంటి లోపలికి వచ్చిన నితీష్‌ స్నేహకి ఎదురుగా రెండో సింహాసనంలో కూర్చున్నాడు. అక్షింతలు వేస్తూ రెండు లక్షల రూపాయల చెక్‌ అందిస్తూ ‘పుట్టబోయే బిడ్డ అవసరాలకి ఉపయోగపడతాయి’ అన్నాడు నితీష్‌. అక్కడ నుండి నితీష్‌తో కలిసి వెళ్లిపోతున్న జాన్‌ గేట్‌ వరకు వెళ్ళి వెనక్కి వచ్చి ‘అల్లుడుగారికి నెలకి లక్షన్నర అంటగా జీతం. మా వాడికి నెలకి కార్‌ పెట్రోల్‌కే రెండు లక్షలైపోతోంది. పెట్రోల్‌ రేట్‌ బాగా పెరిగిపోయింది’ అని చురక అంటించాడు.‘ఆడు నా మేనల్లుడు. ఆడెప్పుడూ నాకు అల్లుడే రా! ఆడంత గొప్పోడవుతాడని, ఏదోరోజు సింహాసనం మీద కూచుంటాడని నాకు ముందే తెలుసురా జాన్‌ బాబు! మా స్థాయి సరిపోదనే పిల్లని ఆడికివ్వలేదు’ అన్నాడు సుంకరరాజు తెలివిగా! తన తెలివికి తనే మురిసిపోతూ.    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement