
మధ్యవర్తిత్వంతో మరోసారి కీలకంగా మారిన ఒమన్
మస్కట్: ఆకాశహర్మ్యాలు, హంగూ ఆర్భాటాలు కనిపించని ప్రశాంతమైన తీరప్రాంత మస్కట్ నగరం పశ్చిమాసియా భౌగోళిక రాజకీయాల్లో భాగమైన కీలక చర్చలకు మరోసారి వేదికగా మారనుంది. తమ అణు కార్యక్రమంపై ఒమన్ మధ్యవర్తిత్వంతో ఇరాన్ శనివారం అమెరికాతో చర్చలు జరపనుంది. రెండు దేశాల మధ్య అణు కార్యక్రమంపై ఒప్పందం కుదిరే అవకాశాలు పెద్దగా కనిపించకున్నా ఈ చర్చలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఒక అంగీకారానికి రాని పక్షంలో ఇరాన్ అణు కార్యక్రమం లక్ష్యంగా వైమానిక దాడులు తప్పవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు చేస్తుండటం.. అణ్వాయుధాల తయారీకి అవసరమైన యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని మాత్రం ఆపేది లేదని ఇరాన్ కరాఖండిగా చెబుతుండటంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ సమయంలో రెండు దేశాలకు సన్నిహితంగా ఉండే ఒమన్ కల్పించుకోవాల్సి వచ్చింది. ట్రంప్ కూడా చర్చలకు ఒమన్ మధ్యవర్తిత్వంపై అనూహ్యంగా సానుకూలత ప్రకటించారు.
ఒమన్ వైపు మొగ్గు ఎందుకు?
ఒమన్ కీలకంగా వ్యవహరించిన సందర్భాలు గతంలోనూ ఉన్నాయని వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే ‘గల్ఫ్ స్టేట్ అనాలిటిక్స్’సీఈవో జార్జియో కెఫియెరో అంటున్నారు. దౌత్యపరంగా ఒమన్ పాత్ర ఎంతో కీలకమైందని పేర్కొన్నారు. చారిత్రకంగా చూసినా ప్రపంచ రాజకీయాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించిన గత అనుభవం ఒమన్‌కు ఉందని హైడెల్‌బర్గ్ యూనివర్సిటీ చరిత్ర ప్రొఫెసర్ మార్క్ అంటున్నారు. ఒమన్ ప్రజల్లో అత్యధికులు ఇబాదీ ముస్లింలు.
ఇది సున్నీ–షియా విభజనకు ముందు నుంచీ ఉన్న ఉదారవాద ఇస్లాం శాఖ అని వివరించారు. ఇరాన్‌తో వ్యవహరించే విషయంలో గత కొన్నేళ్లుగా అమెరికా ప్రధానంగా ఒమన్‌పైనే ఆధారపడుతోందని ఆయన అన్నారు. 2015లో ఇరాన్‌తో అణు ఒప్పందం కుదరటానికి అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామాకు రహస్య చర్చల్లో ఒమన్ ఎంతో సాయపడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే, ఆ దేశం ఎప్పుడూ వార్తల్లో ప్రధానంగా కనిపించేందుకు ప్రయతి్నంచలేదని, కేవలం తెరవెనుక ప్రభావవంతమైన పాత్ర పోషించిందన్నారు.
అమెరికాతో నేరుగా చర్చలు జరపం: ఇరాన్
అమెరికాతో తాము నేరుగా చర్చల్లో పాల్గొనేది లేదని ఇరాన్ అంటోంది. అణు కార్యక్రమంపై ఒప్పందం విషయంలో ముందుగా ఒమన్ విదేశాంగ మంత్రితో మాట్లాడుతామని, తమ సందేశాన్ని ఆయనే అమెరికా ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్‌కు అందజేస్తారని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ బద్ర్ తెలిపారు. 2015లో కుదిరిన అణు ఒప్పందం ప్రకారం ఇరాన్ 3.67 శాతం శుద్ధి చేసిన యురేనియంను కొద్ది మొత్తంలో మాత్రమే నిల్వ ఉంచుకునేందుకు అవకాశముంది. అయితే, ఆ దేశం వద్ద ప్రస్తుతం 60 శాతం వరకు శుద్ధి చేసిన యురేనియం పెద్ద మొత్తంలో నిల్వ ఉన్నట్లు చెబుతున్నారు.
దీంతో, ఇరాన్‌తో కుదిరిన ఒప్పందం నుంచి ఏకపక్షంగా బయటికి వస్తూ ట్రంప్ మొదటిసారి అధ్యక్ష పదవిలో ఉండగా ప్రకటించారు. ప్రస్తుతం అణ్వాయుధం తయారీ దిశగా సాంకేతికంగా ఇరాన్ అతి సమీపంలో ఉన్నట్లు లెక్క. ఈ నేపథ్యంలోనే ఇరాన్ అణు సదుపాయాలపై దాడులు తప్పవని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర హెచ్చరికలు చేస్తున్నారు. ఆ దేశంపై ఒత్తిడి తెచ్చే చర్యల్లో భాగంగా హిందూ మహా సముద్రంలోని డీగో గార్సియా మిలటరీ స్థావరానికి ఆరు బీ2 బాంబర్లను తరలించారు. చమురు అన్వేషణ, అణు కార్యక్రమంపై మరిన్ని ఆంక్షలు తప్పవని కూడా ట్రంప్ అంటున్నారు. ఇలాంటి హెచ్చరికలు సుహృద్భావ వాతావరణాన్ని దెబ్బతీస్తున్నాయని, ఐరాస అణు పరిశీలకులను దేశం నుంచి బహిష్కరించడానికి కైనా వెనుకాడబోమని ఇరాన్ అంటోంది.