
నేపిడా: మయన్మార్‌లో శుక్రవారం (మార్చి 28) ఉదయం భూకంపం(Earthquake) విధ్వంసం సృష్టించింది. ఇదిమరువకముందే రాత్రి మరోమారు భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో జనం భయంతో పరుగులు తీశారు. మళ్లీ పెను భూకంపం వచ్చిందేమోనంటూ వణికిపోయారు. అయితే ఇది అంత శక్తివంతమైనది కాకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు.

జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం మార్చి 28న రాత్రి 11.56 గంటలకు మయన్మార్(Myanmar)లో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.2గా నమోదైంది. ఈ భూకంప కేంద్రం భూమికి 10 మీటర్ల లోతులో ఉంది. ఈ భూకంపానికి ముందు పగటిపూట వరుసగా సంభవించిన రెండు భూకంపాలలో 150 మందికి పైగా జనం మరణించారని ప్రభుత్వం అధికారికంగా తెలిపింది. శుక్రవారం ఉదయం సంభవించిన భూ ప్రకంపనలు చాలా బలంగా ఉన్నాయి. పొరుగు దేశమైన థాయిలాండ్‌పై కూడా భూకంపం తీవ్ర ప్రభావం చూపింది. భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం ఉదయం భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. మయన్మార్‌లో తీవ్ర భూకంపం సంభవించిన దరిమిలా ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.