
ఆంక్షలు, టారిఫ్‌ల యోచన
సోషల్ మీడియాలో పోస్టు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యాకు ఊహించని షాక్ ఇచ్చారు. ఉక్రెయిన్–రష్యా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం, శాంతి ఒప్పందం కుదిరేదాకా రష్యాపై భారీ స్థాయిలో ఆంక్షలు, టారిఫ్‌లు విధించాలని తీవ్రంగా యోచిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం సోషల్ మీడియాలో పోస్టు చేశారు. రష్యా, ఉక్రెయిన్ వెంటనే శాంతి చర్చలకు శ్రీకారం చుట్టాలని స్పష్టంచేశారు. ఆలస్యం కాకముందే ఆ పని ప్రారంభిస్తే బాగుంటుందని హితవు పలికారు.
నిన్నటిదాకా రష్యా పట్ల సానుకూలంగా మాట్లాడిన ట్రంప్ హఠాత్తుగా స్వరం మార్చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే, రష్యాకు ట్రంప్ హెచ్చరికలు జారీ చేయడం కొత్తేమీ కాదు. ఈ ఏడాది జనవరిలో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రష్యాను ఉద్దేశించి కఠిన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని నిలిపివేయకపోతే మరిన్ని ఆంక్షలు విధిస్తామని, రష్యా ఉత్పత్తులపై అధికంగా టారిఫ్‌లు వసూలు చేస్తామని తేల్చిచెప్పారు.
ఆయన తన వైఖరికి కట్టుబడి ఉన్నట్లు తెలుస్తోంది. యుద్ధాన్ని ముగించే దిశగా రష్యాపై ఒత్తిడి పెంచడానికి ఆంక్షలు, టారిఫ్‌లను మరోసారి తెరపైకి తెచి్చనట్లు సమాచారం. ఉక్రెయిన్‌కు సైనిక సాయాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ ట్రంప్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. యూరప్ దేశాలు వ్యతిరేకిస్తున్నా ఆయన వెనక్కి తగ్గడం లేదు. ఒకవైపు ఉక్రెయిన్‌ను, మరోవైపు రష్యాను ఏకకాలంలో దారికి తీసుకురావాలన్నదే ట్రంప్ వ్యూహంగా కనిపిస్తోంది. రష్యాపై కొత్తగా ఎలాంటి ఆంక్షలు విధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. పుతిన్ ప్రభుత్వం వాటికి తలొగ్గుతుందా? అనేది చూడాలి.