
న్యూఢిల్లీ: భవిష్యత్‌లో మహా భూకంపం (Mega quake) రానుందా? దీని తీవ్రతకు 3,00,000 మంది ప్రాణాలు కోల్పోనున్నారా? లెక్కలేనన్ని నగరాలు సముద్రంలో మునిగిపోతాయా? ఈ సామూహిక విధ్వంసానికి సమయం ఆసన్నమయ్యిందా?.. ఒళ్లు గగుర్పొడిచే ఈ ప్రశ్నలకు ‘అదే జరగవచ్చు’ అంటూ జపాన్ తన అంచనాలను, భవిష్యవాణిని వెల్లడించింది.

ఏజెన్సీ ఫ్రాన్స్-ప్రెస్ (Agence France-Presse) (ఏఎప్‌పీ) తెలిపిన వివరాల ప్రకారం జపాన్ ప్రభుత్వ సంస్థ భవిష్యత్‌లో మెగా భూకంపం రానున్నదని అంచనా వేసింది. ఈ భారీ భూకంపం భూమిపై అపరిమిత వినాశనాన్ని కలిగిస్తుందని, మూడు లక్షల మంది మరణానికి కారణమవుతుందని తెలిపింది. ఈ భారీ భూకంపం కారణంగా సునామీ సంభవిస్తుందని, ఇది అనేక నగరాలను సముద్రంలో కలిపేస్తుందని పేర్కొంది. ‘మెగా క్వేక్ అనేది చాలా శక్తివంతమైన భూకంపం. దీని తీవ్రత 8 లేదా అంతకన్నా అధిక తీవ్రతతో ఉంటుంది. ఇది భారీ విధ్వంసానికి కారణంగా నిలుస్తుంది. సునామీని కూడా సృష్టిస్తుంది.

ఇటీవల మయన్మార్ (Myanmar)లో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇది వేలాది మందిని పొట్టన పెట్టుకుంది. వేలాది మంది ప్రస్తుతం ఆస్పత్రులలో జీవన్మరణ సమస్యతో పోరాడుతున్నారు. లెక్క లేనంత మంది గల్లంతయ్యారు. పలు నగరాల్లో, ఎత్తైన భవనాలు, ఇళ్లు, దేవాలయాలు శిథిలమయ్యాయి. మయన్మార్‌లో సంభవించిన భూకంపం థాయిలాండ్‌లోనూ వినాశనాన్ని మిగిల్చింది. బ్యాంకాక్‌లో అత్యవసర పరిస్థితిని విధించాల్సి వచ్చింది. ఈ పరిస్థితులను మరువక ముందే జపాన్ మహాభూకంపం అంచనాలను చెప్పడంతో అందరూ ఆందోళనకు గురవుతున్నారు.

జపాన్ ప్రభుత్వం (Japanese Government) తమ దేశ పసిఫిక్ తీరంలో వినాశకరమైన మెగా క్వేక్ సంభవించవచ్చని తెలిపింది. దీని కారణంగా సునామీ వస్తుందని, ఇదే జరిగితే జపాన్‌లో లక్షలాది మంది ప్రజలు కొన్ని నిమిషాల్లోనే మృత్యువాత పడతారని పేర్కొంది. మృతదేహాలను లెక్కించడం కూడా కష్టమయ్యేంత విధ్వంసం జరుగుతుందని అంచనా వేసింది. జపాన్ ఆర్థిక వ్యవస్థ దాదాపు నాశనమవుతుందని పేర్కొంది. అందుకే మెగా భూకంపాన్ని ఎదుర్కొనేందుకు సన్నాహాలు ఇప్పటి నుంచే ప్రారంభించినట్లు వెల్లడించింది.
భూకంపాల పరంగా జపాన్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జోన్‌లో ఉంది. ఇక్కడి సముద్ర తీరప్రాంతంలో భూకంపం వచ్చే అవకాశం 80 శాతం ఉందని పలు నివేదికలు చెబుతున్నాయి. వార్తా సంస్థ ఏఎప్‌పీ నివేదిక ప్రకారం జపాన్‌లో 9 తీవ్రతతో భూకంపం సంభవిస్తే, 13 లక్షల మంది నిరాశ్రయులు కానున్నారు. భవనాలు కూలిపోవడం వల్ల సుమారు 3 లక్షల మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే జరిగితే జపాన్ ఆర్థిక వ్యవస్థ 2 ట్రిలియన్ డాలర్లు (అంటే రూ. 171 లక్షల కోట్లకు పైగా) నష్టపోతుంది. ఈ నష్టం నుండి కోలుకోవడం జపాన్‌కు చాలా భారంగా మారుతుంది.
ఇది కూడా చదవండి: చెలరేగిపోతున్న యూట్యూబర్లు.. కేదార్‌నాథ్‌లో కొత్త రూల్