
ప్రపంచమంతా ప్రతిష్టాత్మకంగా భావించే టైమ్ మ్యాగజైన్(Time Magazine List 2025) జాబితా 2025 విడుదలైంది. వంద మంది పేర్లతో కూడిన జాబితాను విడుదల చేసింది. అయితే అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితాలో ఈ ఏడాది భారతీయులెవరికీ చోటు దక్కకపోవడం గమనార్హం.
2025కి గానూ మోస్ట్ ఇన్ఫ్లూయెన్షియల్ పీపుల్ జాబితాను టైమ్ మ్యాగజైన్ విడుదల చేసింది. ఇందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, యూకే ప్రధాని కీర్ స్టార్మర్, నోబెల్ బహుమతి గ్రహీత.. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, టెస్లా సీఈవో ఇలాన్ మస్క్ తదితరులకు చోటు దక్కింది. జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్, పాపులర్ సింగర్ ఈద్ షరీన్, ఏఐ దిగ్గజం డెమిస్ హస్సాబిస్(Demis Hassabis) తదితరుల పేర్లు ఉన్నాయి.
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. భారత్ నుంచి ఈ ఏడాది జాబితాలో ఒక్కరికి కూడా చోటు దక్కలేదు. గతంలో.. షారూఖ్ ఖాన్, అలియా భట్, సాక్షి మాలిక్(రెజ్లర్) పేర్లు ఈ జాబితాకు ఎక్కిన సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్య సంవత్సరాల్లో ఇలా భారతీయుల పేర్లు లేకపోవడం ఇదే తొలిసారి. ఈసారి విశేషం ఏంటంటే.. నేరుగా భారతీయులకు చోటు దక్కకపోయినా భారత సంతతికి చెందిన వర్టెక్స్ ఫార్మాసూటికల్స్ సీఈవో రేష్మా కేవలరమణి(Reshma Kewalramani) పేరు ఈ జాబితాలోకి ఎక్కింది. రేష్మ ముంబైలో పుట్టారు. ఆమెకు 11 ఏళ్ల వయసున్నప్పుడు ఆ కుటుంబం అమెరికాకు వలస వెళ్లి స్థిరపడింది.

రేష్మా కేవలరమణి(52)
టైమ్ జాబితాకు ప్రాధాన్యత ఎందుకు?
టైమ్ మ్యాగజైన్ అనేది న్యూయార్క్ కేంద్రంగా నడిచే వార్త ప్రచురణ సంస్థ. 1923 మార్చి 3వ తేదీన ఇది ప్రారంభమైంది. సమకాలీన వార్తలకు పాఠకులకు అందించే ఉద్దేశంతో హెన్రీ లూస్, బ్రిటన్ హాడెన్ దీనిని స్థాపించారు. కాలక్రమేణా దీనికి ప్రపంచస్థాయి ఆదరణ లభించింది. అనేక రంగాలను మలుపు తిప్పిన వ్యక్తుల పేర్లతో ప్రతీ ఏటా జాబితా విడుదల చేస్తూ వస్తోంది టైమ్స్ మ్యాగజైన్. అలా..
అత్యంత ప్రభావశీలురైన వ్యక్తుల జాబితాను 1999లో తొలిసారి రిలీజ్ చేసింది టైమ్ మ్యాగజైన్. మేధావులు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు ఈ జాబితా గురించి విస్తృతంగా చర్చించుకోవడం మొదలుపెట్టారు. అయితే 2004 నుంచి క్రమం తప్పుకుండా ప్రతీ ఏడాది జాబితాను విడుదల చేస్తూ వస్తోంది టైమ్ మ్యాగజైన్.