
ఎలాన్ మస్క్.. ఈ పేరు ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. ఆయన టెస్లా, స్పేస్ ఎక్స్ వంటి కంపెనీలకు అధిపతి. ఒక వ్యాపారవేత్తగానే కాకుండా ఆవిష్కరణ వేత్తగా కూడా పేరు సంపాదించారు. ప్రపంచ కుబేరుల్లో ఒకరు మస్క్. అయితే తన వారసత్వం తనతో ఆగిపోకూడదనే తపన కూడా ఆయనలో ఎక్కువగానే ఉంది. ప్రపంచానికి తనలాంటి మేధావులు మళ్లీ మళ్లీ పరిచయం కావాలంటే ఏం చేయాలనే ఆలోచన కూడా ఆయనకు ఎప్పుడో వచ్చిందట. దీనిలో భాగంగా తన తర్వాత తరాన్ని తయారు చేసే పనిలో పడ్డారట ఎలాన్ మస్క్.
ప్రపంచ జనాభా పెంచే పనిలో మస్క్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) క్యాబినెట్ లో కీలక పదవిలో ఉన్న ఎలాన్ మస్క్.. తన వీర్యాన్ని దానం చేసే పనిలో ఉన్నారని తాజా కథనాల సారాంశం. ఒకవైపు డొనాల్డ్ ట్రంప్ తన కాస్ట్ కటింగ్ లతో ప్రపంచానికి నిద్రపట్టనివ్వకుండా చేస్తుంటే.. మస్క్ మాత్రం తన వీర్యాన్ని పంచి ప్రపంచ జనాభాను పెంచే పనిలో ఉన్నారట. దీనికి సంబంధించి అమెరికన్ వార్త పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనాన్ని ప్రచురించింది.
మస్క్ కు బాగా తెలిసిన వాళ్లకు ఈ ఆఫర్ చేస్తూ ఉంటాడని, ఒకవేళ తెలియక పోయినా వారితో పరిచయం పెంచుకుని మరీ వారికి దగ్గరవుతూ ఉంటాడట. మేధావి వర్గం అనేది తర్వాత తరాలకు కూడా అందుబాటులో ఉండాలనే పదునైన సంకల్పంతో ఉన్న మస్క్ దీనికి పూనుకున్నట్లు పేర్కొంది. ’ఎక్స్’లో మహిళలకు దగ్గరవుతూ వారిని పిల్లల్ని కనమని ఆఫర్లు ఇస్తున్నాడని స్పష్టం చేసింది. ఇలా మస్క్ పిల్లల సంఖ్య పెరుగుతూ పోతూ ఉందని తెలిపింది.
జనాభా సమతుల్యతను కాపాడే పనిలో..
ఇప్పటికే 14 మంది పిల్లలకు తండ్రిగా ఉన్న ఎలాన్ మస్క్.. తన వారసత్వ సంపదగా ఒక దండునే తయారు చేయాలనే సంకల్పంతో ఉన్నాడని డబ్యూఎస్జే తెలిపింది. తగ్గిపోతున్న జనన రేట్ల మానవ నాగరికతను అస్తిత్వంలో పడేస్తాయని మస్క్ బలంగా నమ్ముతున్నాడని, ఇది కూడా తన వీర్యాన్ని దానం చేస్తూ జనాభా సమతుల్యతను కాపాడుకునే క్రమంలో సాధ్యమైనంత మేర తన వంతు ప్రయత్నం చేస్తున్నాడనేది ఆ కథనం సారాంశం. ఇప్పటికే ఎంతోమంది మహిళలకు తన వీర్యాన్ని డోనర్ రూపంలో దానం చేసినట్లు తెలిపింది. దీనికి సంబంధించి వ్యవహారాలపై సీక్రెట్ ఒప్పందాలు మస్క్ చేసుకున్నట్లు ప్రచురించింది.
జపనీస్ మహిళను ఇలా కలిసి..?
క్రిప్టో కరెన్సీ ఇన్ఫ్లూయెన్సర్ అయిన జపాన్ మహిళ టిఫనీ ఫాంగ్ కు కూడా మస్క్ నేరుగా మెస్సేజ్ చేసి తన బిడ్డ (వీర్యం దానం చేయడం ద్వారా) కావాలా అని అడిగినట్టు డబ్యూఎస్ జే పేర్కొంది. ఇది జరిగి ఏడాది అవుతుందని, మస్క్ ఆమెను ఎక్స్ లో ఫాలో అవ్వడం మొదలైన తర్వాత ఈ ఆఫర్ ఇచ్చాడట. ఆమెను మస్క్ ఫాలో అవ్వడంతో టిఫనీ ఫాంగ్ కు ఫాలోవర్స్ సంఖ్య కూడా గణనీయంగా పెరిగి రెండు వారాల్లోనే 21 వేల డాలర్లను సంపాదించినట్లు ఆ కథనంలోని మరొక విషయం. అయితే మస్క్ ఆఫర్ ను టిఫనీ ఫాంగ్ తిరస్కరించిందని, ఆమెకు అప్పటికే ఉన్న పిల్లల ఫోటోలను కూడా చూపించిందట.
ఆష్లీ సెయింట్ క్లెయిర్ సంచలన ఆరోపణలు
ఇటీవల రచయిత్రి, ఇన్ఫ్లూయెన్సర్ ఆష్లీ సెయింట్ క్లెయిర్.. మస్క్‌పై సంచలన ఆరోపణలు చేశారు. తన బిడ్డకు మస్క్ తండ్రి అంటూ సోషల్ మీడియాలో వేదికగా పోస్టు పెట్టారు. ఆమె పోస్టుపై మస్క్ సమాధానం ఇస్తూ ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
ఆ చిన్నారికి తండ్రి మస్క్ అని ఎక్స్‌లో పోస్టు చేశారు. తన బిడ్డ మస్క్‌కు 13వ సంతానమని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో.. తమ బిడ్డ భద్రతను, గోప్యతను దృష్టిలో ఉంచుకుని ఇన్ని రోజులు ఈ విషయం బయటపెట్టలేదని, మా ప్రైవసీకి ఎవరూ భంగం కలిగించవద్దంటూ కామెంట్స్ చేశారు.
గతేడాది న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది. తనకు పుట్టిన పిల్లలను, మాజీ భాగస్వామ్యులు ఉండేందుందుకు 14 వేల 400 స్క్వేర్ ఫీట్ కాంపౌడ్ లో ఒక పెద్ద భవనాన్ని నిర్మించి వారు బాగోగులు చూస్తున్నట్లు కూడా పేర్కొంది. ఆ ఇంటిని నిర్మించడం కోసం సుమారు 300 కోట్ల రూపాయిలు అయినట్లు తెలిపింది.
ఏం లేదు.. అంతా గాసిప్: మస్క్
జపాన్ మహిళకు వీర్యం ఆఫర్ చేసినట్టు వచ్చిన కథనాల్ని మస్క్ కొట్టిపారేస్తున్నారు. ఇందులో ఎటువంటి వాస్తవం లేదని అంటున్నారు. డబ్యూఎస్‌జే వెబ్‌సైట్ అనేది ఒక గాసిప్ వెబ్ సైట్ అని, అందులో గాసిప్ తప్పితే ఏమీ ఉండదని అంటున్నారు. అయితే స్పెర్మ్ డోనర్ అనే అంశం చాలా సీక్రెట్‌గానే ఉంచుతారు. మరి అటవంటప్పుడు మస్క్ ఎవరికైనా వీర్యాన్ని దానం చేసినా దానిని బహిరంగంగా చెప్పుకునే అవకాశం ఉండదు. ఇటీవల కాలంలో తన బిడ్డకు తండ్రి మస్క్ అంటూ బహిరంగంగా పలువురు వ్యాఖ్యానించిన క్రమంలోనే ఈ వార్తను డబ్యూఎస్‌జే పరిశోధానాత్మక కోణంలో ప్రచురించినట్లు తెలుస్తోంది.