
భారత్–చైనా కలిసికట్టుగా పనిచేయాలి
చైనా అధినేత జిన్‌పింగ్ పిలుపు
భారత్–చైనా ద్వైపాక్షిక సంబంధాలకు 75 ఏళ్లు
బీజింగ్: భారత్, చైనా దేశాలు కలిసికట్టుగా పని చేయాలని చైనా అధినేత జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. ఉమ్మడి లక్ష్యాల సాధనకు మనమంతా చేతులు కలపాలని సూచించారు. ప్రాథమిక ప్రయోజనాల పరిరక్షణ కోసం ఏనుగు–డ్రాగన్ కలిసి ‘ట్యాంగో’డ్యాన్స్ చేయాలని ఆకాంక్షించారు. భారత్–చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మొదలై 75 ఏళ్లవుతున్న సందర్భంగా భారత్‌కు ఆయన మంగళవారం శుభాకాంక్షలు తెలియజేశారు. రెండు దేశాల నడుమ ద్వైపాక్షిక భాగస్వామ్యం మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు జిన్‌పింగ్ ఒక సందేశం పంపించారు. భారత్, చైనాలు ప్రాచీన నాగరికతలు కలిగిన దేశాలని గుర్తుచేశారు. ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద దేశాలుగా, గ్లోబల్ సౌత్‌లో ముఖ్యమైన సభ్యదేశాలుగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఆధునీకరణ ప్రయత్నాల్లో ఇరుదేశాలూ ఇప్పుడు కీలకమైన దశలో ఉన్నాయని తెలిపారు. ఈ మేరకు జిన్‌పింగ్ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. వ్యూహాత్మక పరస్పర విశ్వాసాన్ని మరింత పెంపొందించుకోవడానికి, భారత్–చైనా సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పడానికి భారత్‌లో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
కీలక రంగాల్లో పరస్పర సహకారం మరింత వృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. జిన్‌పింగ్ సందేశంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రతిస్పందించారు. స్థిరమైన సేŠన్‌హ సంబంధాలు, ద్వైపాక్షిక భాగస్వామ్యం మన రెండు దేశాలతోపాటు మొత్తం ప్రపంచానికి మేలు చేస్తాయని వివరించారు. భారత్–చైనా సంబంధాలను మరింత ఉన్నత స్థానానికి చేర్చడానికి ఈ సందర్భాన్ని ఒక అవకాశంగా ఉపయోగించాలని పేర్కొన్నారు. మరోవైపు చైనా ప్రధాని లీ ఖెకియాంగ్, భారత ప్రధాని నరేంద్ర మోదీ సైత పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.