
గువాహటి/ఇంఫాల్: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహదారు ముహమ్మద్ యూనుస్ భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలనుద్దేశించి చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా నేతలంతా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేశారు. దీంతో, మరోసారి రెండు దేశాల మధ్య రాజకీయంగా ప్రాధాన్యత చోటుచేసుకుంది.
చైనా పర్యటన సందర్భంగా యూనుస్ ఈశాన్య రాష్ట్రాలపై పలు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా యూనుస్.. ‘సెవన్ సిస్టర్స్‌గా పిలిచే ఏడు ఈశాన్య రాష్ట్రాలకు సముద్రమార్గం లేదు. సముద్ర తీరమున్న బంగ్లాదేశ్ ఒక రకంగా ఈ ఏడు రాష్ట్రాలకు సాగర రక్షకుడిగా ఉంది. ఈ ప్రాంతానికి సముద్రమార్గం లేకపోవడం చైనాకు ఒక సువర్ణావకావం. ఈ ప్రాంతంపై చైనా తన ఆర్థిక సత్తాను చాటొచ్చు. ఇక్కడ విస్తరించి, ఉత్పత్తులు తయారుచేసి మార్కెటింగ్ చేసుకోవచ్చు’ అని అన్నారు.
దీంతో, పార్టీలకు అతీతంగా ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘చైనాతో దోస్తీకి అర్రులు చాచే యూనుస్ ఏ అర్హతతో ఈశాన్య రాష్ట్రాల ప్రస్తావన తెస్తారు?’ అని నేతలు మండిపడ్డారు. త్రిపురలో ముఖ్యమైన తిప్రా మోతా పార్టీ చీఫ్, రాజవంశీకుడు ప్రద్యోత్ దేబర్మా మాణిక్య ఘాటుగా స్పందించారు. ‘ఇరుకైన చికెన్ నెక్ కారిడార్‌లో భారత సైన్యం మోహరింపు, పటిష్టమైన భద్రతపై దృష్టిపెట్టడంతోపాటు ఈసారి ఏకంగా బంగ్లాదేశ్‌ను నిలువుగా చీల్చి ఈశాన్య రాష్ట్రాలకు సముద్రమార్గాన్ని ఏర్పాటుచేయాలి. అసలు 1947 బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ నౌకాశ్రయం మన చేతికొచ్చినా త్యజించడం ఆనాడు చేసిన పెద్ద తప్పు’ అని ప్రద్యోత్ అన్నారు.
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సైతం ఆగ్రహం వ్యక్తంచేశారు. తీవ్ర పరిణామాలు ఊహించకుండా ఏది పడితే అది మాట్లాడొద్దని యూనుస్‌కు మణిపూర్ మాజీ ముఖ్యమంత్రి ఎన్.బీరెన్ సింగ్ హితవు పలికారు. ‘భారత విదేశాంగ విధానం ఈ స్థాయికి దిగజారడం శోచనీయం. ఏ దేశం విమోచన కోసం భారత్ పోరాడింతో ఇప్పుడు అదే దేశం శత్రుదేశంతో చేతులు కలపడం దారుణం’ అని అస్సాం జాతీయ పరిషత్(ఏజేపీ)అధ్యక్షుడు, జొర్హాట్ ఎంపీ లురిన్ జ్యోతి గొగోయ్ అన్నారు. భారత విదేశాంగ విధానం ఎంత బలహీనపడిందో యూనుస్ వ్యాఖ్యలను బట్టి తెలుస్తోందని మోదీ సర్కార్‌పై కాంగ్రెస్ విమర్శించింది.