
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి(Vivek Ramaswamy) తాజాగా ఒక వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ఇటీవల చెప్పులు లేకుండా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీటిని చూసిన కొందరు రామస్వామిని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఆయనను అమెరికన్ వ్యతిరేకి అని, మొరటువాడని వ్యాఖ్యానిస్తున్నారు. కొందరైతే వివేక్ రామస్వామికి మద్దతు పలుకుతున్నారు.
గత ఏడాది వివేక్ రామస్వామి ఒక లైవ్ స్ట్రీమింగ్ రికార్డింగ్(Live streaming recording) సమయంలో చెప్పులు లేకుండా ఇంటర్యూలో పాల్గొన్నారు. ఈ రికార్డింగ్ వివేక్ రామస్వామి ఇంట్లో జరిగింది. సోషల్ మీడియాలో దీని గురించి చర్చ జరుగుతోంది. కొందరు ‘వివేక్ రామస్వామి ఎప్పటికీ ఒహియో గవర్నర్ కాలేరు’ అని వ్యాఖ్యానించగా, మరికొందరు ‘అమెరికాలో ఇది ఆమోదయోగ్యం కాదని’ అన్నారు. మరికొందరు ‘ఇంటర్వ్యూ సమయంలో వివేక్ కనీసం సాక్స్ అయినా ధరించి ఉండాల్సిందని’ పేర్కొన్నారు. మరొక యూజర్ ‘వివేక్ రామస్వామి విద్యాభివృద్ధిపై ఉపన్యాసాలు ఇస్తారని, అయితే ఇంటర్వ్యూలో చెప్పులు లేకుండా కనిపించారని, ఇది చాలా అసభ్యకరమైనదని’ వ్యాఖ్యానించారు.
వివేక్ రామస్వామికి సోషల్ మీడియాలో మద్దతు పలికినవారు కూడా ఉన్నారు. భారతదేశంతో పాటు దక్షిణ, తూర్పు ఆసియాలో ఇంట్లో పాదరక్షలు(Footwear) తొలగించడం సర్వసాధారణమని కొందరు కామెంట్ బాక్స్‌లో రాశారు. దాదాపు భారతీయులంతా తమ ఇళ్లలో చెప్పులు లేకుండా ఉంటారని ఒక యూజర్ పేర్కొన్నారు. ఇందులో తప్పేమీ లేదని, ఇది అక్కడి సంస్కృతిలో భాగమని పేర్కొన్నవారు కూడా ఉన్నారు. అయితే వివేక్ రామస్వామి ఈ చర్చకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు.
ఇది కూడా చదవండి: చెఫ్ అవతారంలో సోనూసూద్.. దోశ రేటు రెట్టింపు చేసి..