
ఏ23ఏ ఐస్‌బర్గ్ అంతిమయాత్ర?
వెచ్చని సముద్రజలాల వైపు పయనం
త్వరలో పూర్తిగా కరిగి కనుమరుగు
ఏ23ఏ. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఐస్‌బర్గ్. తాజా కొలతల ప్రకారం దాని విస్తీర్ణం 3,672 చదరపు కిలోమీటర్లు! చూపు తిప్పుకోనివ్వని ఆర్చిలు, అందమైన గుహలతో పర్యాటకులకు ఎంతగానో ఆకర్షిస్తూ ఉంటుంది. ఇది 1986లో ఫిల్‌క్నర్ రోన్ మంచుఫలకం నుంచి విడివడింది. కొన్నాళ్లపాటు కాస్త దూరం కదిలాక అంటార్కిటికాలోని వెడ్‌డెల్ సముద్ర ఉపరితలంపై సెటిలైపోయింది.
30 ఏళ్లపాటు అక్కడే స్తబ్ధుగా ఉండిపోయింది. అందులోని అందమైన గుహలను, దాని పొడవునా ఏర్పడే రకరకాల ఆకృతుల మంచు ఆర్చిలను చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచీ ఏటా పర్యాటకులు పోటెత్తుతుంటారు. అలాంటి ఏ23ఏ 2020లో స్వల్పంగా కరిగిపోవడంతో మళ్లీ కదలడం మొదలు పెట్టింది. అంటార్కిటికాలోని టైలర్ కాలమ్‌లో ఉపరితలానికి తాకడంతో కొద్ది నెలలుగా అక్కడే నిలిచిపోయింది.
మంచు కరుగుతుండటంతో కొద్ది రోజులుగా అది మళ్లీ కదలడం మొదలుపెట్టినట్టు బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వే (బీఏఎస్) బృందం వెల్లడించింది. ‘‘ఏ23ఏ ఐస్‌బర్గ్ సముద్ర ప్రవాహాల తాకిడికి క్రమంగా వెచ్చని జలాలవైపు సాగుతోంది. సౌత్ జార్జియాలోని మారుమూల దీవుల గుండా వెళ్తూ క్రమక్రమంగా కరిగి కొన్నాళ్లలో పూర్తిగా కనుమరుగవుతుంది’’అని ప్రకటించింది. దాంతో సైంటిస్టులందరి దృష్టీ దానిమీదే కేంద్రీకృతమైందిప్పుడు.
ఏ23ఏను సైంటిస్టులు 1986లో తొలిసారిగా గమనించారు. అప్పట్లో అది 3,900 చ.కి.మీ. పై చిలుకు విస్తీర్ణంతో ఉండేది. నాటినుంచీ చాలాకాలం పాటు ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఐస్‌బర్గ్‌గా నిలుస్తూ వచ్చింది. మధ్యలో దానికంటే పెద్ద పరిమాణంలో ఏ68 (2017లో), ఏ76 (2021లో) వంటివి పుట్టుకొచ్చినా అవన్నీ చూస్తుండగానే కరిగి చిన్నవైపోయాయి.
ఏ23ఏ దర్జా మాత్రం అలాగే కొనసాగుతూ వచ్చింది. తాజా కదలికల పుణ్యమా అని అది ఇక మూణ్నాళ్ల ముచ్చటేనంటున్నారు సైంటిస్టులు. అయితే అది కరగడం వల్ల సముద్రమట్టం పెరగడం వంటి ముప్పు ఉండకపోవచ్చని వాళ్లు చెబుతున్నారు. ఏ23ఏ కరుగుదలకు గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పులే కారణమని వాపోతున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్