
గతవారం యూరప్‌లో కనువిందు
‘ఫాల్కన్’ వాహకనౌక శకలాలే కారణం
ఈ ఫొటోలోని వింత వలయాలను చూశారుగా! ఎస్ ఆకారంలో మొదలై క్రమంగా వలయాలుగా మారుతూ కొట్టొచ్చినట్టుగా కన్పించాయి. గత వారం యూరప్‌లో పలు ప్రాంతాల నుంచి ఆకాశ వీధిలో కనువిందు చేశాయి. జనమంతా వాటిని ఆసక్తిగా వీక్షించారు. ఇందులో వింతేమీ లేదని సైంటిస్టులు చెబుతున్నారు. ‘‘ఉపగ్రహ ప్రయోగాల సందర్భంగా ఇలాంటివి మామూలే.
గత వారం యూరప్‌లో కన్పించిన ఆ వలయాలకు స్పేస్ ఎక్స్ తాలూకు ఫాల్కన్ 9 ఉపగ్రహ ప్రయోగమే కారణం’’ అని వారు వివరించారు. ‘‘అమెరికా సైనిక నిఘా ఉపగ్రహాన్ని మోసుకెళ్లిన అనంతరం ఫాల్కన్ వాహకనౌక తాలూకు శకలాలు భూ వాతావరణంలోకి ప్రవేశించి సురక్షితంగా సముద్రంలో పడిపోయాయి. అంతరిక్షం నుంచి భూ వాతావరణంలోకి ప్రవేశించే క్రమంలో వాహక నౌక తనలో మిగిలిపోయిన ఇంధనాన్ని భద్రతా కారణాల రీత్యా విడుదల చేసేస్తుంది. ఆ క్రమంలో అది ఒక్కసారిగా వలయాకృతిలో సుడులు తిరుగుతుంది. ఫాల్కన్ వాహకనౌక విషయంలోనూ అదే జరిగింది’’ అని నాసా సైంటిస్ట్ మెక్‌డొవెల్ చెప్పారు.
– సాక్షి, నేషనల్ డెస్క్