
పాకిస్తాన్ కూతురును కావచ్చు
కానీ ఇప్పుడు భారత్ కోడలిని
మోదీకి సీమా హైదర్ విజ్ఞప్తి
‘నేను పాకిస్తాన్ కుమార్తెను, కానీ ఇప్పుడు నేను భారతదేశ కోడలిని. నాకు పాకిస్తాన్‌కు వెళ్లడం ఇష్టం లేదు. నన్ను ఇక్కడే ఉండనివ్వండి. నన్ను భారతదేశంలో ఉండడానికి అనుమతివ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగిలకు విజ్ఞప్తి చేస్తున్నాను’ఇది పాకిస్తాన్ పౌరురాలైన... ప్రస్తుతం యూపీలో ఉంటున్న సీమా హైదర్ చేసిన విజ్ఞప్తి. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ పౌరుల వీసాలను కేంద్రం రద్దు చేసిన విషయం తెలిసిందే. తనను కూడా పంపించేస్తారేమోనన్న ఆందోళనతో సీమ చేసిన వీడియో విజ్ఞప్తి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఎవరీ సీమా హైదర్. పాకిస్తాన్ పౌరురాలు యూపీ కోడలు ఎలా అయ్యింది?
సీమా హైదర్... పాకిస్తాన్ సింధ్ ప్రావిన్స్‌కు చెందిన మహిళ. 2019లో ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతుండగా ఆమెకు యూపీకి చెందిన సచిన్ మీనాతో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. అయితే.. అప్పటికే సీమాకు పెళ్లయ్యింది. భర్త గులాం హైదర్‌తో ఆమెకు నలుగురు పిల్లలు కూడా. అయితే సచిన్ మీద ప్రేమతో.. నలుగురు పిల్లలను తీసుకుని ఆమె భారత్‌కు వచ్చేసింది. నేపాల్ మీదుగా సరిహద్దు నుంచి అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించింది.
యూపీలోని సచిన్‌ను పెళ్లి చేసుకుంది. గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలోని రబుపుర ప్రాంతంలో నివసిస్తోంది. వీరి విషయం 2023 జూలైలో బయటకు వచ్చింది. అక్రమంగా ప్రవేశించినందుకు సీమాను, ఆశ్రయం కల్పించినందుకు సచిన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తరువాత ఇద్దరూ బెయిల్‌పై విడుదలయ్యారు. ఆమె కేసును ఏటీఎస్ విచారిస్తోంది.
పహల్గాం ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో పాకిస్తాన్ పౌరుల వీసాలను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విష యం తెలిసిందే. నిబంధనల ప్రకారం సీమా సైతం భారత్‌ను వీడి వెళ్లాలి. కాని తాను పాక్‌కు వెళ్లనని, ఇక్కడే ఉంటానని, అందుకు తనకు అనుమతి ఇవ్వాలని సీమా విజ్ఞప్తి చేస్తోంది. తానిప్పుడు సీమా హైదర్‌ను కాదని, సీమా మీనానని, సచిన్‌ను పెళ్లి చేసుకున్నా తరువాత హిందూ మతాన్ని స్వీకరించానని చెబుతోంది. అయితే ఆమె భారత్‌లో నివసించడానికి అర్హురాలని ఆమె తరపు న్యాయవాది ఏపీ సింగ్ సైతం వాదిస్తున్నారు. సచిన్ మీనాతో పెళ్లి తరువాత ఆ దంపతులకు కూతురు పుట్టింది.
ఆ చిన్నారి ఇప్పుడు భారతీయురాలు. అంతర్జాతీయ న్యాయస్థానం, సంరక్షణ చట్టాల ప్రకారం చిన్నారి సంరక్షణ బాధ్యత తల్లిది. తల్లి సీమా మీనా భారత్‌ను వీడితే.. చిన్నారిని కూడా వెంట తీసుకెళ్లాల్సి వస్తుంది. భారతీయ పౌరురాలిని పాక్‌కు ఎలా పంపిస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు. పాకిస్తాన్ పౌరులందరూ దేశం విడిచి వెళ్లాలనే ఆదేశం నుంచి ఆమెకు మినహాయింపు ఉంటుందని ఆయన భావిస్తున్నారు. సీమ కేసు భిన్నమైనదని, ఈ విషయమై రాష్ట్రపతి దగ్గర పిటిషన్ కూడా ఉందని ఆయన వాదిస్తున్నారు. అంతేకాదు.. బెయిల్‌పై ఉన్న సీమను అత్తమామల ఇల్లు తప్ప రబుపురా దాటరాదని జెవార్ కోర్టు ఆదేశాలు కూడా ఉన్నందున.. వీసా రద్దు ఉత్తర్వులు ఆమెకు వర్తించవని చెబుతున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్