3 నిమిషాలకో మరణం | Indian roads are among the world deadliest | Sakshi
Sakshi News home page

3 నిమిషాలకో మరణం

Published Mon, Apr 28 2025 5:29 AM | Last Updated on Mon, Apr 28 2025 5:29 AM

Indian roads are among the world deadliest

మన రోడ్లు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరం

రోజూ ఉదయం పేపర్‌ తీయగానే రోడ్డు ప్రమాద వార్తలు. బస్సులు లోయల్లోకి పడిపోవడం, ఆగి ఉన్న ట్రక్కులను ఢీకొన్న కార్లు. ద్విచక్ర వాహనాలను ఢీకొన్న పెద్ద వాహనాలు. ఈ రోజువారీ విషాదాలు నిశ్శబ్ద సంక్షోభానికి అద్దం పడుతున్నాయి. భారత్‌లో ప్రతి మూడు నిమిషాలకొకరు రోడ్డు ప్రమాదంలో మరణిస్తున్నారు. సగటున రోజూ 474 మరణాలు సంభవిస్తున్నాయి.

 2023లోనే 1,72,000 మందికి పైగా భారతీయులు రోడ్లపై ప్రాణాలు కోల్పోయినట్టు కేంద్రం విడుదల చేసిన అధికారిక నివేదికే పేర్కొది. వారిలో 10,000 మంది పిల్లలే. పాఠశాలలు, కళాశాలల సమీపంలో జరిగిన ప్రమాదాల్లో మరో 10వేల మంది మరణించారు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా వాహనాలు ఢీకొట్టి 35 వేల మంది పాదచారులు ప్రాణాలు కోల్పోయారు. మృత్యువాత పడ్డ ద్విచక్ర వాహనదారుల సంఖ్య కూడా అధికమే. 

ఈ ప్రమాదాలకు అతివేగమే అతి పెద్ద కారణం. కనీస భద్రతా జాగ్రత్తలు తీసుకోకపోవడం కూడా ప్రాణాంతకంగా మారింది. హెల్మెట్‌ ధరించకపోవడం వల్ల 54 వేల మంది ద్విచక్రవాహనదారులు ప్రాణాలు కోల్పోయారు. కారులో సీట్‌ బెల్ట్‌ ధరించకపోవడం వల్ల 16 వేల మంది మరణించారు. ఓవర్‌ లోడ్‌ 12,000 మరణాలకు దారితీసింది. సరైన లైసెన్స్‌ లేకుండా వాహనాలు నడపడం వల్ల జరిగిన ప్రమాదాలకు బలైనవారు 34 వేలమంది. 

రోడ్ల వ్యవస్థ అస్థవ్యస్తం 
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద రహదారి నెట్‌వర్క్‌ భారత్‌లో ఉంది. మొత్తం 66 లక్షల కిలోమీటర్ల పొడవైన రహదారులున్నాయి. ఇందులో జాతీయ, రాష్ట్ర రహదారుల వాటా 5 శాతం. 35 కోట్ల రిజిస్టర్డ్‌ వాహనాలున్నాయి. కానీ భారత రహదారులు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయి. అస్థవ్యస్తమైన రహదారుల వ్యవస్థే దీనికి కారణం. రోడ్లపై ట్రాఫిక్‌ నియమాలు సరిగ్గా లేకపోవడం, ఉన్నా పాటించకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి. 

కార్లు, బస్సులు, ద్విచక్రవాహనాలు, భారీ వాహనాలు, ఆటోలు, సైకిళ్లు, పాదచారులు, అక్కడక్కడా జంతువులు.. మొత్తంగా రోడ్డును అడ్డదిడ్డంగా ఉపయోగించడం వల్ల పరమాదాలు జరుగుతున్నాయి. ఫుట్‌పాత్‌ ఆక్రమణ కూడా ప్రమాదాలకు కారణంగా ఉంది. ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా నియంత్రణకోసం ఎన్ని నిధులు వెచ్చించినా మారని మనుషుల తీరు, అమలులో లోపాలు, వ్యవస్థాగత నిర్లక్ష్యం సంక్షోభానికి కారణమవుతోంది. రోడ్డు ప్రమాదాలతో దేశ వార్షిక జీడీపికి 3 శాతం నష్టం కలుగుతోందంటే తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రజలకు చట్టం పట్ల గౌరవం, భయం లేకపోవడం వల్లే అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రభుత్వాలు చెబుతున్నా అది ఒక పార్శ్వం మాత్రమే. 

నిర్మాణ, నిర్వహణ లోపాలు 
లోపభూయిష్టమైన రోడ్ల డిజైన్, నాసిరకం నిర్మాణం, అసమర్థ నిర్వహణ ప్రమాదాలకు ప్రధాన కారణంగా ఉన్నాయి. రోడ్డు సూచికలు, మార్కింగ్‌ విధానం వంటి చిన్న విషయాలు కూడా అధ్వానంగా ఉన్నాయి. 59 ప్రధాన లోపాలను కేంద్ర ఉపరితల రవాణా శాఖే గుర్తించింది. రహదారుల్లో ప్రమాదానికి కారణమయ్యే 13,795 బ్లాక్‌ స్పాట్స్‌ ఉన్నాయి. వీటిలో 5,036లకు మాత్రమే దీర్ఘకాలిక మరమ్మతులు చేశారు. ఢిల్లీ ఐఐటీ ట్రాన్స్‌పోర్టేషన్‌ రీసర్చ్‌ అండ్‌ ఇంజ్యూరీ ప్రివెన్షన్‌ సెంటర్‌ నిర్వహించిన రోడ్‌ సేఫ్టీ ఆడిట్లు దేశ రహదారుల్లో మౌలిక సదుపాయాల లోపాలేంటో గుర్తించాయి. 

క్రాష్‌ బారికేడ్ల నిర్వహణ సరిగ్గా లేకపోవడం కూడా ప్రధాన కారణంగా ఉంది. బారికేడ్లున్నా లెక్క చేయకపోవడం కొంత కారణమైతే అస్థవ్యస్తమైన నిర్వహణే ఎక్కువ హాని చేస్తోందని నిపుణులు చెబుతున్నారు. డివైడర్ల నిర్మాణంలోనూ లోపాలున్నాయి. ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఎత్తులో ఉండటం కూడా ప్రమాదాలకు కారణమవుతోంది. గుంతలు తవ్వి వదిలేయడం, సైన్‌ బోర్డులు పెట్టకపోవడం వల్లా ప్రమాదాలు జరుగుతున్నాయి. పటిష్టమైన రహదారుల వ్యవస్థ కాగితాలపైనే ఉందని, క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని నిపుణులు చెబుతున్నారు. 

అనుకరణ వద్దు
భారత్‌ అభివృద్ధి చెందుతున్న దేశం. ఇక్కడ ప్రత్యేక ట్రాఫిక్‌ వ్యవస్థ ఉంటుంది. తదనుగుణంగా ఏర్పాట్లుండాలి. అందుకు భిన్నంగా పాశ్చాత్య రహదారుల నమూనాలను అనుకరించడం ప్రమాదాలకు కారణమవుతోందన్నది అంతర్జాతీయ నిపుణుల వాదన. రోడ్డు వెడల్పు చేయడం వల్ల ప్రమాదాలు తగ్గుతాయన్నది నిజం కాదని చెబుతున్నారు. రోడ్డు వెడల్పు అతి వేగానికి దారి తీస్తుందని, చిన్న వాహనదారులకు ప్రాణాంతకంగా మారుతోందని హెచ్చరిస్తున్నారు. దేశాభివృద్ధికి మరిన్ని రహదారులను నిర్మించడం కీలకమేనని, అయితే అది పాదచారులు, సైక్లిస్టుల, ద్విచక్ర వాహనాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆ అభివృద్ధికి నిరుపేద వర్గాలు మూల్యం చెల్లించుకోవాల్సి రాకూడదని హెచ్చరిస్తున్నారు.

     – సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement