న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యధిక ప్లాస్టిక్ వ్యర్థాలను భారత్ ఉత్పత్తి చేస్తోంది. దేశంలో ఒక ఏడాదిలో 10.2 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇది రెండవ అతిపెద్ద ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తిదారు కంటే రెండు రెట్లు అధికం. యూకేలోని లీడ్స్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు తెలిపిన వివరాల ప్రకారం ప్రపంచంలో ప్రతి సంవత్సరం 57 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ కాలుష్యం ఉత్పత్తి అవుతోంది.
ఈ అధ్యయనం ప్రకారం ఈ 57 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలలో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ గ్లోబల్ సౌత్ నుండి వస్తుంది. ఈ అధ్యయనాన్ని నిర్వహించిన కోస్టాస్ వెలిస్ తెలిపిన వివరాల ప్రకారం ప్రతి సంవత్సరం ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలను ఒకచోట చేరిస్తే, అది న్యూయార్క్ నగరంలోగల సెంట్రల్ పార్క్‌లోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ఎత్తుకంటే అధికంగా ఉంటుంది. పరిశోధకులు ఈ అధ్యయనం కోసం ప్రపంచవ్యాప్తంగా 50 వేలకు పైగా నగరాలు, పట్టణాలలో స్థానికంగా ఉత్పత్తి అయిన వ్యర్థాలను పరిశీలించారు.
ఈ అధ్యయన ఫలితాలు నేచర్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఈ అధ్యయనం బహిరంగ వాతావరణంలో కనిపించే ప్లాస్టిక్ వ్యర్థాలను పరిశీలించింది. ప్రపంచ జనాభాలో 15 శాతం మంది నుంచి వస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి, పారవేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఆగ్నేయాసియా, సబ్-సహారా ఆఫ్రికాలో అత్యధిక ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తికి ఇదే ప్రధాన కారణమని అధ్యయనం వెల్లడించింది. ఈ 15 శాతం జనాభాలో భారతదేశంలోని 25.5 కోట్ల మంది ఉన్నారు.
నైజీరియాలోని లాగోస్ ప్రపంచంలోని ఇతర నగరాల కంటే ఎక్కువ ప్లాస్టిక్ కాలుష్యాన్ని విడుదల చేస్తోంది. ఇదేవిధంగా న్యూఢిల్లీ, లువాండా, అంగోలా, కరాచీ, ఈజిప్ట్‌లోని కైరోలు ప్లాస్టిక్ కాలుష్య కారకాల విడుదలలో అగ్రస్థానంలో ఉన్నాయి. చైనా ఈ విషయంలో నాల్గవ స్థానంలో ఉంది. వ్యర్థాలను తగ్గించడంలో ఆ దేశం అద్భుతమైన పురోగతి సాధిస్తోందని వెల్లడయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment