
అర్హులు దరఖాస్తు చేసుకునేలా చూడాలి
● వీసీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
మహబూబాబాద్: రాజీవ్ యువ వికాసం పథకానికి ఎక్కువ మంది అర్హులు దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి రాజీవ్ యువవికాసం పథకంపై జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. రాష్ట్రంలో ఐదు లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువత ఆర్థికంగా ఎదిగేందుకు రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం అమలుతో రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తగ్గుతుందన్నారు. రుణం మాఫీ విధానంపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. దరఖాస్తు చేసుకున్న తర్వాత మున్సిపల్ పరిధి అయితే మున్సిపాలిటీ కార్యాలయంలో.. మండల స్థాయిలో అయితే ఎంపీడీఓ కార్యాలయంలో పత్రాలు అందజేయాలన్నారు. వీసీలో జిల్లా నుంచి కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్, అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
వైభవంగా
శివపార్వతుల కల్యాణం
మార్వాడీల ‘ఘన్‌గోర్’ ఊరేగింపు
మహబూబాబాద్ రూరల్: మార్వాడీలు భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఘన్‌గోర్ వేడుకల్లో భాగంగా శివపార్వతుల స్వరూపమైన గోరా, ఈసర్ (ఘన్‌గోర్) కల్యాణం సోమవారం ఘనంగా నిర్వహించారు. మంగళవాయిద్యాల నడుమ మానుకోట పట్టణ వీధుల్లో ఘన్‌గోర్‌ల విగ్రహాలను ఊరేగించారు. వాటిని మహేశ్వరీభవన్‌లోని రాధాకృష్ణుల సన్నిధిలో ఏర్పాటు చేసి మార్వాడీ మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హారతులిచ్చి, నైవేద్యాలు సమర్పించి పూజలు ఆచరించారు. ఈ పూజలతో వివాహం కానివారికి జరుగుతుందని, మహిళలు సుమంగళిగా ఉండేందుకు భగవంతుడు అనుగ్రహిస్తాడని తెలిపారు. భక్తులు ఉపవాసం ఉండి పూజలు చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో సఖీ మండలి సభ్యులు చిన్నారులతో నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. సంగీత్ విభావరిలో మహిళలు భక్తి గేయాలు ఆలపించారు.
వేయిస్తంభాల ఆలయంలో సీతారాములకు పూజలు
హన్మకొండ కల్చరల్: శ్రీరామనవమి నవరాత్ర ఉత్సవాల్లో భాగంగా రుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో సోమవారం రెండోరోజూ సీతారాములకు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో శ్రీరుద్రేశ్వరుడికి రుద్రాభిషేకం, 121 మంది దంపతులు సామూహిక రుద్రాభిషేకాలు నిర్వహించారు. తెలుగు సంవత్సరాది ప్రారంభం, శివ ప్రీతికరమైన సోమవారం కావడంతో అధికసంఖ్యలో భక్తులు దేవాలయాన్ని సందర్శించారు. కృష్ణయజుర్వేద పండితుడు గుదిమెల్ల విజయకుమారాచార్యులు ఆధ్వర్యంలో సీతారాముల ఉత్సవ మూర్తులను ప్రతిష్ఠించి అనుష్టాన పూజలు, యాగశాలలో మహా సుదర్శనహోమం జరిపారు. కార్యక్రమాలను ఆలయ ఈఓ అనిల్‌కుమార్, సిబ్బంది పర్యవేక్షించారు.
భద్రకాళి అమ్మవారికి పుష్పార్చన
హన్మకొండ కల్చరల్: వసంత నవరాత్ర ఉత్సవాల్లో భద్రకాళి దేవాలయంలో సోమవారం అమ్మవారికి పుష్పార్చన చేశారు. ఉదయం అర్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో అమ్మవారికి నిర్మాల్యసేవలు, నిత్యాహ్నికం నిర్వహించారు. అనంతరం వేదపండితులు, వేదపాఠశాల విద్యార్థులు తెల్లచామంతి పూలకు సంప్రోక్షణ చేసి అమ్మవారికి లక్షపుష్పార్చన నిర్వహించారు.

అర్హులు దరఖాస్తు చేసుకునేలా చూడాలి

అర్హులు దరఖాస్తు చేసుకునేలా చూడాలి

అర్హులు దరఖాస్తు చేసుకునేలా చూడాలి