
పన్ను వసూళ్లలో పదో స్థానం
● జిల్లాలో ఇంటిపన్నులు 91శాతం వసూలు ● ప్రథమ స్థానంలో జైపూర్, కన్నెపల్లి మండలాలు ● చివరన జన్నారం మండలం
మంచిర్యాలరూరల్(హాజీపూర్): జిల్లాలో ఇంటి పన్ను వసూళ్ల లక్ష్యసాధనకు పంచాయతీ అధికారులు చేపట్టిన ప్రత్యేక చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయి. ఇప్పటివరకు 91శాతం పన్నులు వసూలయ్యాయి. దీంతో జిల్లా రాష్ట్రంలో పదో స్థానంలో నిలిచింది. మిగతా 9శాతం పన్నులు వసూలు చేస్తామని అధికారులు తెలిపారు. ఉన్నతాధికారుల ఒత్తిడితో ప్రత్యేక డ్రైవ్ చేపట్టి ఇంటి పన్నులు, వాణిజ్య పన్నులు, మంచినీటి కులాయి బిల్లులు వసూలు చేశారు. జిల్లాలోని 306 గ్రామ పంచాయతీల్లో ఇంటిపన్నులు, ఇతర పన్నుల ద్వారా రూ.6 కోట్ల 70లక్షల 81వేలు వసూలు చేయాలనే లక్ష్యంలో భాగంగా మార్చి 31వరకు రూ.6కోట్ల 9లక్షల 8వేలు వసూలు చేశారు. ఇంకా రూ.61.73లక్షలు వసూలు చేయాల్సి ఉంది. రానున్న ఆర్థిక సంవత్సరానికి జీరో శాతంతో ఉంటామని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్‌రావు తెలిపారు.
అన్ని మండలాల్లో 90శాతంపైగానే..
జిల్లాలోని 16 మండలాల్లో జైపూర్, కన్నెపల్లి మండలాలు 96శాతం పన్ను వసూళ్లతో మొదటి స్థానంలో నిలిచాయి. జన్నారం 86శాతం వసూళ్లతో చివరి స్థానంలో ఉంది. భీమారం, కోటపల్లి లక్సెట్టిపేట మండలాలు 94శాతం, భీమిని, కాసిపేట మండలా లు 93శాతం, హాజీపూర్, నెన్నెల 92శాతం, బెల్లంపల్లి, దండేపల్లి, వేమనపల్లి మండలాలు 91శాతం, చెన్నూర్ 90శాతం, మందమర్రి 89శాతం, తాండూర్ 87శాతం పన్నులు వసూళ్లు చేశాయి.