
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య విమానాశ్రయానికి ‘మహర్షి వాల్మికి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు–అయోధ్యధామ్’ అని పేరుపెట్టాలన్న ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. దాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించాలని కూడా నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశం పలు నిర్ణయాలు తీసుకుంది. రైల్వేలో ‘సున్నా కర్బన ఉద్గారాల’ లక్ష్యాన్ని సాధించడానికి అమెరికాతో ఒప్పందానికి అనుమతించింది. మారిషస్ భాగస్వామ్యంతో ఉమ్మడిగా బుల్లి ఉపగ్రహం అభివృద్ధికి అవగాహనా ఒప్పందానికి కూడా అంగీకరించింది.
‘పృథ్వీ విజ్ఞాన్’కు ఆమోదం
ఎర్త్ సైన్సెస్ రంగంలో ఐదు వేర్వేరు పథకాల కింద పరిశోధనలకు, కేటాయించిన నిధుల వినియోగానికి ఉద్దేశించిన ‘పృథ్వీ విజ్ఞాన్’కు కార్యక్రమానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని అమలుకు రూ.4,797 కోట్లు కేటాయించింది. ఇది ఐదేళ్లపాటు అమల్లో ఉంటుంది. వాతావరణం, సముద్రం, క్రయోస్పియర్, పోలార్ సైన్స్, సీస్మాలజీ, జియోసైన్సెస్ వంటి అంశాలపై పరిశోధనలు చేయనున్నారు. పృథ్వీ విజ్ఞాన్ కింద రీసెర్చ్ ప్రాజెక్టులను విదేశీ సంస్థలకు అప్పగించడానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. గయానా నుంచి ముడి చమురు కొనుగోలుతో పాటు హైడ్రో కార్బన్ రంగంలో పరస్పర సహకారానికి ఒప్పందం కుదుర్చుకునేందుకూ అంగీకరించింది. గయానాలో ముడి చమురు అన్వేషణ, ఉత్పత్తిలో భారతీయ కంపెనీలకు సైతం భాగస్వామ్యం కలి్పస్తారు.
ప్రపంచ దేశాలతో అయోధ్య అనుసంధానం: మోదీ
అయోధ్య విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి పేరు పెట్టాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ అంగీకారం తెలపడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. దీన్ని వాల్మికి మహర్షికి దేశ ప్రజల తరపున ఘనమైన నివాళిగా అభివరి్ణంచారు. అయోధ్యను ప్రపంచ దేశాలతో అనుసంధానించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందంటూ ఎక్స్‌లో పోస్టు చేశారు.