
సాక్షి, బెంగళూరు: అంతరిక్ష వ్యర్థాల నిర్వహణలో ఇస్రో మరోసారి తన ఘనతను చాటింది. అంతరిక్ష ప్రయోగాల కోసం వినియోగించిన వ్యోమనౌక సంబంధిత భాగాలు అక్కడే అంతరిక్ష చెత్తగా పేరుకుపోకుండా వాటిని సురక్షితంగా భూమి మీదకు తీసుకొచ్చే ప్రక్రియను ఇస్రో మరోసారి విజయవంతంగా పూర్తిచేసింది.
అంతరిక్షంలో ఉపగ్రహాల వంటి వస్తువుల అనుసంధానం(డాకింగ్), విడతీత(అన్‌డాకింగ్) కోసం వినియోగించిన పోలార్ శాటిలైట్ లాంఛ్ వెహికల్(పీఎల్‌ఎల్వీ–సీ60)లోని పైభాగం(పీఎల్4) అయి న పీఎస్‌ఎల్వీ ఆర్బిటల్ ఎక్స్‌పరిమెంటల్ మాడ్యూల్ (పోయె మ్–4)ను విజయవంతంగా తిరిగి భూవాతావరణంలోకి తీసు కొచ్చారు.
తర్వాత దానిని ఏప్రిల్ నాలుగో తేదీ ఉదయం 8.03 గంటలకు హిందూమహాసముద్రంలో పడేలాచేశామని ఇస్రో శని వారం వెల్లడించింది. అంతరిక్ష నుంచి జాగ్రత్తగా కక్ష్య తగ్గిస్తూ సముద్రంలో పడేసే పనిని ఇస్రో వారి సిస్టమ్ ఫర్ సేఫ్ అండ్ సస్టేనబుల్ స్పేస్ ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్(ఐఎస్4ఓఎం) విభాగం పూర్తిచేసింది.
గతేడాది డిసెంబర్ 30న రెండు స్పేడెక్స్ ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ వ్యోమనౌక ద్వారా 475 కిలోమీటర్ల ఎత్తులో కక్ష్యలో చేర్చారు. అదే కక్ష్యలోనే పోయెమ్–4ను ప్రవేశపెట్టారు. తర్వాత నెమ్మదిగా 350 కిలోమీటర్ల ఎత్తు కక్ష్యలోకి తీసుకొచ్చారు. పోయెమ్–4 మొత్తంగా 24 పేలోడ్లను వెంట తీసుకెళ్లింది. ఇందులో 14 ఇస్రోకు చెందినవి కాగా, మరో 10 ప్రభుత్వేతర సంస్థలకు చెందినవి. ప్రస్తుతం అన్ని పేలోడ్లు సక్రమంగా పని చేస్తున్నాయి. వాటిని నిర్దేశించిన విధులను నిర్వర్తిస్తూ అంతరిక్ష డేటాను పంపిస్తున్నాయి.